ఆటోలో ఈవీఎంల తరలింపును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
పెరవలి, న్యూస్‌లైన్ : ఈవీఎం బాక్సుల తరలింపునకు అధికారులు టీడీపీ అభ్యర్థికి చెందిన విద్యా సంస్థ బస్సును వినియోగించటంపై వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానూరులో 149వ పోలింగ్ కేంద్రానికి బుధవారం సాయంత్రం 5గంటలకు ఓటర్లు అధిక సంఖ్యలో రావటంతో ఇక్కడ రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఈవీఎంలను తరలించేందుకు శశి విద్యాసంస్థకు చెందిన బస్సు రావడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ బస్సులో ఈవీఎంలను తరలించడానికి అంగీకరించబోమని రోడ్డుపై బైఠాయించారు. ఎస్సై డి.రవికుమార్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు కలెక్టర్‌తో మాట్లాడి ఆ బస్సును రద్దుచేయించారు.
మరో బస్సు రాకపోవడంతో ఈవీఎంలు తరలించటానికి పోలీసులు ఆటో ఏర్పాటు చేశారు. ఈవీఎంల తరలింపులో ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలాగని వైసీపీ నాయకులు పోలీసులను నిల దీశారు. పెరవలి పోలీస్‌స్టేషన్ వరకు ఆటోలో తీసుకెళతామని, అక్కడకు ఆర్టీసీ బస్సు వస్తుం దని, మీరు కూడా రావచ్చని సీఐ గోవిందరాజు వారికి నచ్చజెప్పారు. ఈవీఎంలు తీసుకెళుతున్న ఆటోను అనుసరిస్తూ వైసీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌కు వచ్చిన తరువాత అదే వాహనంలో వాటిని ఏలూరు తరలిస్తామని చెప్పడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహోదగ్రులయ్యా రు. తమ విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు పెడతామని, అవసరమైతే లాఠీ చార్జి చేస్తామని సీఐ హెచ్చరించారు. దీంతో కోపం వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఈవీఎంలకు భద్రత కల్పించాలంటూ రోడ్డుపై నినాదాలు చేశారు.
వైసీపీ నాయకులు కార్చెర్ల ప్రసాద్, కోర్ల ఉదయభాస్కరరావు, కొమ్మిశెట్టి సత్యనారాయణ, నేదునూరి గంగరాజు, వెంకటేశ్వరరావు, యర్రంశెట్టి బుజ్జి, కొమ్మిశెట్టి రాము, వీరమళ్ల సత్యనారాయణలు కార్యకర్తలకు సర్దిచెప్పారు. భద్రత కలిగిన ప్రభుత్వ వాహనంలోనే ఈవీఎంలను తరలించాలని, అంతవరకు తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని తెలపడంతో పోలీసు ఉన్నతాధికారులకు సీఐ సమాచారం అందించారు. రాత్రి 11గంటలకు పెరవలి పోలీస్‌స్టేషన్‌కు చేరిన ఈవీఎంలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండిపోయాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజీవ్‌కృష్ణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కార్యకర్తలతో మాట్లాడారు.
తరువాత ఆయన పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి ఇక్కడి విషయం తీసుకెళ్లారు. ఈవీఎంల తరలింపులో ఎటువంటి తేడాలు వచ్చినా పూర్తి బాధ్యత తమదేనని వారు హామీ ఇచ్చారు. ఈవీఎంలు తరలించే ఆటోను వైసీపీ నాయకుల వాహనాలు అనుసరించేందుకు అనుమతించారు. దీంతో వైసీపీ నాయకులు రెండు వాహనాల్లో ఆ ఆటో వెనుక ఏలూరు వరకు వెళ్లారు. సమస్య పరిష్కారానికి సహకరించిన రాజీవ్‌కృష్ణను సీఐ గోవిందరాజు అభినందించారు.