కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
* తొలి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు
* తనిఖీ చేశాకే లోపలకు అనుమతి
* ప్రాంగణంలోకి వాహనాల ప్రవేశం నిషేధం
* రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక గస్తీ
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరగనున్న కౌంటింగ్‌కు రాష్ట్ర పోలీసు విభాగం విసృ్తత స్థాయి భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. వీటిని రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు గురువారం సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఎలాంటి ఏమరుపాటుకు తావులేకుండా ఉన్నతాధికారి మొదలు కిందిస్థాయి సిబ్బందివరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్ నేపథ్యంలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలతో పాటు ఫ్యాక్షన్ ప్రభావిత, సున్నితమైన చోట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సాధారణం కంటే అదనంగా సిబ్బంది మోహరించాలని ఆదేశించారు.
తొలిదశలో తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు 14,213 ప్రాంతాల్లోని 26,135 పోలింగ్ స్టేషన్లలో, రెండో దశలో సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు 42,794 ప్రాంతాల్లో ఉన్న 68,678 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వీటి కౌంటింగ్ రాష్ట్రంలోని 168 కేంద్రాల్లో జరుగనుంది.
బందోబస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం లోపల, అతి సమీపంలో ఉండే తొలి అంచెలో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సిబ్బంది ఉంటారు. ఈవీఎమ్‌లను స్ట్రాంగ్‌రూమ్స్ నుంచి కౌంటింగ్ హాల్‌కు తీసుకువచ్చే మార్గం వీరి ఆధీనంలోనే ఉంటుంది. దీంతోపాటు ఇతర బందోబస్తు, రిజర్వ్ అవసరాల కోసం 37 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు. ప్రాంగణం, చుట్టుపక్కల ఉండే రెండు, మూడు అంచెల్లో ఏపీఎస్పీ సాయుధ పోలీసులు, జిల్లా సాయుధ బలగాలను మోహరిస్తున్నారు.
విధుల్లో ఉండే సిబ్బంది, ఏజెంట్ల సహా కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరవాతే అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వాకీటాకీలు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు మండే స్వభావమున్న వస్తువులు, రంగులు, పూలదండలు, మంచినీళ్ల బాటిళ్లు తదితరాలు కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురావడాన్ని ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
వీలున్న ప్రతిచోటా ప్రవేశ ద్వారాల వద్ద మెటల్‌డిటెక్టర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలతో పాటు 144వ సెక్షన్ కూడా విధిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ర్యాలీ తీయడం, బాణాసంచా పేల్చడం తదితరాలను నిషేధించిన నేపథ్యంలో ప్రాంగణంతో పాటు చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో గస్తీ కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపుతున్నారు. వీరు పెద్ద సంఖ్యలో ఎవరూ గుమిగూడకుండా చర్యలు తీసుకుంటారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్దా కనిష్టంగా 200 మంది పోలీసులు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.