Bayyarapu Prasada Rao
-
ఎనిమిది నెలల్లో ఎన్నో సవాళ్లు
* రాష్ట్ర విభజన సహా ఎన్నికలను సమర్థంగా నిర్వహించాం * మాజీ డీజీపీ ప్రసాదరావు వెల్లడి * ఘనంగా వీడ్కోలు పలికిన రెండు రాష్ట్రాల కొత్త డీజీపీలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా పనిచేసిన ఎనిమిది నెలల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని మాజీ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో సహా వరుసగా వచ్చిన ఎన్నికలను సైతం సమర్థవంతంగా నిర్వహించామన్నారు. గురువారమిక్కడి అంబర్‌పేట్‌లో ఉన్న ఎస్ఏఆర్ సీపీఎల్ మైదానంలో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. 1980-90ల్లో ఉధృతంగా ఉన్న నక్సల్స్ సమస్యను సమష్టిగా, అంకితభావంతో పనిచేయడమే కాకుండా ప్రాణాలు సైతం త్యాగాలు చేసి ఎదుర్కొన్నారు. రాష్ట్రం రెండుగా వేరుపడినా, ఇరు ప్రాంతాల్లోనూ ఉండే పోలీసులు అదే స్ఫూర్తితో పనిచేస్తూ రెండు రాష్ట్రాలకూ అదే గుర్తింపు తేవాలి. 1969లో జరిగిన ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగేళ్లుగా ఎంత ఉధృతంగా ఉద్యమం జరిగినా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాల్పుల వంటి ఘటనలు చోటు చేసుకోలేదు. యూనిఫాం వేసుకుని పోలీసు విభాగంలో పనిచేయడం హోదా, పవర్ కాదు. ఇది ఓ అదృష్టంగా భావించాలి. సామాన్యుడికి అందుబాటులో ఉండే తొలి ప్రభుత్వ కార్యాలయం పోలీస్ స్టేషనే. అక్కడకు సమస్యలతో వచ్చినవారికి సేవ చేయడం ద్వారా మన్ననలు పొందాలి. నిర్విరామంగా విధుల్లో ఉండే పోలీసులకు వారి కుటుంబీకులు ఇచ్చే నైతికస్థైర్యం చెప్పనలవి కానిది. అందుకే సిబ్బందితోపాటు వారి కుటుంబాల సంక్షేమానికి పోలీసు విభాగం చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు. సంక్షేమం, మర్యాదతో కూడిన ప్రవర్తన, ఏదో చేయాలనే తపనతో ఉండే ప్రసాదరావు ప్రతి పోలీసుకూ గుర్తుండిపోతారని తెలంగాణ తాత్కాలిక డీజీపీ అనురాగ్ శర్మ ప్రశంసించారు. ప్రముఖ విద్యావేత్త కూడా అయిన ఆయన తన ఫిజిక్స్ రీసెర్చ్ల్లోనే రిలాక్స్ అవుతుంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీ జాస్తి వెంకటరాముడు మాట్లాడుతూ.. ‘‘ప్రసాదరావు, నేను దాదాపు ఒకేసారి సర్వీస్‌లోకి వచ్చాం. ఆయనతో కలిసే ఢిల్లీలో జరిగిన యూపీఎస్సీ ఇంటర్వ్యూకు హాజరయ్యా. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసుల్లో ఇంతకంటే సౌమ్యుడు లేరు. సంక్షేమానికి ప్రసాదరావు కేరాఫ్ అడ్రస్. ఆయన పరిచయం చేసిన సంక్షేమ కార్యక్రమాలను రెండు రాష్ట్రాల పోలీసులు కొనసాగించాలి. నా ఫస్ట్ లవ్ రీసెర్చ్ అంటూ పాతికేళ్లుగా చెప్తున్న ఆయనకు ఇటీవల డాక్టరేట్ కూడా వచ్చింది. ప్రసాదరావు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు. సమైక్య డీజీపీకి ఇచ్చే ఆఖరి పెరేడ్ ఇదే కావడంతో ప్రసాదరావుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీలు ఉమ్మడిగా వీడ్కోలు పలికారు. పోలీసు విభాగం నుంచి ప్రసాదరావు గౌరవ వందనం స్వీకరించడంతోపాటు కవాతును వీక్షించారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తర్వాత అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. -
ఆంధ్రప్రదేశ్‌కే నా ఆప్షన్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ‘‘1979లో ఐపీఎస్‌గా చేరినప్పుడు రాష్ట్రం విడిపోతుందని అనుకోలేదు. మంచి రాష్ట్రం ఇప్పుడు విడిపోతోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీని కావడం బాధాకరంగా ఉంది. ఏదేమైనా ఇది ప్రజల అభీష్టం మేరకే జరుగుతోంది’’ అని రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు అన్నారు. మిగిలిన సర్వీసు ఆంధ్రప్రదేశ్‌లో పని చేయడానికి ఆప్షన్ ఇచ్చానని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు ఆ రాష్ట్రానికే డీజీపీగా కొనసాగుతానని అన్నారు. గురువారం ఆయన డీజీపీ కార్యాలయంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పోలీసుల కోసం నిర్మించిన బ్యారెక్స్‌తో పాటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విరాళంగా ఇచ్చిన ఫ్రీజర్లతో కూడిన రెండు అంబులెన్స్‌లను, కంటి చికిత్సా శిబిరాన్నీ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులకు 59 ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. పోలీసు కుటుంబాలకు వివిధ రకాలైన శిక్షణలు ఇవ్వడానికి యూనిట్‌కు రూ.25 వేల చొప్పున మంజూరు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, డీజీపీగా ఈ ఎనిమిది నెలల కాలం మంచి సంతృప్తినిచ్చిందని, ఈ సమయంలోనే ఉద్యమాలతో పాటు వరుసగా వచ్చిన ఎన్నికలనూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తి చేశామని చెప్పారు. ఇరు ప్రాంతాల్లోనూ జరిగిన ఆందోళనల్లో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా వ్యవహరించామన్నారు. అభివృద్ధిలో శాంతిభద్రతలది కీలకపాత్రని, వాటిని కాపాడే పోలీసులు ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుకి దేశంలోనే మంచి పేరుందన్నారు. రెండు రాష్ట్రాల పోలీసులూ దీన్ని నిలబెట్టేలా కృషి చేయాలని చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకే ఐపీఎస్ అధికారుల విభజన ఉంటుందని, అప్పటి వరకు తెలంగాణలో పరిపాలన కోసం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కొందరిని తాత్కాలికంగా కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్ర క్యాడర్ పోస్టుల విభజనకు కమలనాథన్ కమిటీ సిఫార్సులు రావాలని, అప్పటి వరకు ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు ఎక్కడివారక్కడే పని చేస్తారన్నారు. కీలక పోస్టులైన సీఎస్, డీజీపీ, అదనపు డీజీపీ ఇంటెలిజెన్స్ తదితర పోస్టులతో మాత్రమే పాలన ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం పోలీసు విభాగంలో జరుగుతున్న కేటాయింపులన్నీ తాత్కాలికమైనవేనని, హైదరాబాద్‌లో పని చేస్తున్న వాళ్లు యథాతథంగా ఉంటారని డీజీపీ పేర్కొన్నారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
* తొలి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు * తనిఖీ చేశాకే లోపలకు అనుమతి * ప్రాంగణంలోకి వాహనాల ప్రవేశం నిషేధం * రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక గస్తీ సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరగనున్న కౌంటింగ్‌కు రాష్ట్ర పోలీసు విభాగం విసృ్తత స్థాయి భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. వీటిని రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు గురువారం సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఎలాంటి ఏమరుపాటుకు తావులేకుండా ఉన్నతాధికారి మొదలు కిందిస్థాయి సిబ్బందివరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలింగ్ నేపథ్యంలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలతో పాటు ఫ్యాక్షన్ ప్రభావిత, సున్నితమైన చోట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సాధారణం కంటే అదనంగా సిబ్బంది మోహరించాలని ఆదేశించారు. తొలిదశలో తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు 14,213 ప్రాంతాల్లోని 26,135 పోలింగ్ స్టేషన్లలో, రెండో దశలో సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు 42,794 ప్రాంతాల్లో ఉన్న 68,678 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. వీటి కౌంటింగ్ రాష్ట్రంలోని 168 కేంద్రాల్లో జరుగనుంది. బందోబస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం లోపల, అతి సమీపంలో ఉండే తొలి అంచెలో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సిబ్బంది ఉంటారు. ఈవీఎమ్‌లను స్ట్రాంగ్‌రూమ్స్ నుంచి కౌంటింగ్ హాల్‌కు తీసుకువచ్చే మార్గం వీరి ఆధీనంలోనే ఉంటుంది. దీంతోపాటు ఇతర బందోబస్తు, రిజర్వ్ అవసరాల కోసం 37 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు. ప్రాంగణం, చుట్టుపక్కల ఉండే రెండు, మూడు అంచెల్లో ఏపీఎస్పీ సాయుధ పోలీసులు, జిల్లా సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. విధుల్లో ఉండే సిబ్బంది, ఏజెంట్ల సహా కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరవాతే అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాకీటాకీలు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు మండే స్వభావమున్న వస్తువులు, రంగులు, పూలదండలు, మంచినీళ్ల బాటిళ్లు తదితరాలు కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురావడాన్ని ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. వీలున్న ప్రతిచోటా ప్రవేశ ద్వారాల వద్ద మెటల్‌డిటెక్టర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలతో పాటు 144వ సెక్షన్ కూడా విధిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ర్యాలీ తీయడం, బాణాసంచా పేల్చడం తదితరాలను నిషేధించిన నేపథ్యంలో ప్రాంగణంతో పాటు చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో గస్తీ కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపుతున్నారు. వీరు పెద్ద సంఖ్యలో ఎవరూ గుమిగూడకుండా చర్యలు తీసుకుంటారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్దా కనిష్టంగా 200 మంది పోలీసులు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. -
రాష్ట్రాలు విడిపోయినా కలసి పనిచేయాలి : డీజీపీ
సిబ్బందికి డీజీపీ ప్రసాదరావు పిలుపు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తన కార్యాలయంలో ఉన్న సిబ్బంది మరికొన్ని రోజుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పని చేయాల్సి ఉంటుందని డీజీపీ బయ్యారపు ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రాలు విడిపోయినా సిబ్బంది మాత్రం దూరం కాకుండా కలసిమెలసి పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ప్రక్రియ జోరందుకోవడం, అపాయింటెడ్ డే సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో కలసి డీజీపీ సోమవారం తన కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు వేరైనా సిబ్బంది పరస్పర సహకారంతో పని చేస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరారు. రెండు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాలు పక్కపక్కనే ఉండనున్న నేపథ్యంలో పరస్పర సహకారం కూడా సముచిత స్థాయిలో ఉండాలన్నారు. ఎవరెక్కడ పని చేస్తున్నా అందరూ పోలీసు శాఖకు చెందిన వారే అన్నది మరువద్దని కోరారు. ఫైళ్ల క్లియరెన్స్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ ద్వారా శిక్షణ ఇప్పించనున్నట్లు వెల్లడించారు. సిబ్బంది సైతం ఫైళ్లు రాసే విధానంలో నూతనత్వాన్ని అలవర్చుకోవడంతో పాటు పాతవాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, చెక్ లిస్ట్ తయారు చేసుకోవడం వంటివి చేసి త్వరగా క్లియర్ చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ పని చేయబోయే ప్రస్తుత సిబ్బంది త్వరలోనే పదోన్నతులతోపాటు ఇతర లాభాలు పొందే అవకాశం ఉందని క్రీడల విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది తెలిపారు. డిస్పోజల్ ఫైళ్లను సైతం రాష్ట్రాల వారీగా భద్రపరచాలని అదనపు డీజీ ఉమేష్ షరాఫ్ కోరారు. -
తొలిదశకు 90 వేల మందితో బందోబస్తు: డీజీపీ ప్రసాదరావు
రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ బందోబస్తు కోసం 90 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు పోలింగ్ సామగ్రి, సిబ్బందితో పాటు పోలీసు బలగాలను తరలించడానికి వాయుసేనకు చెందిన నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. వీటికి తోడు అత్యవసర సమయాల్లో సేవలు అందించడం కోసం రెండు ఎయిర్ అంబలెన్సులను పోలీసు విభాగం సిద్ధం చేశామన్నారు. మావోయిస్టు యాక్షన్ టీమ్స్ విరుచుకుపడవచ్చనే అనుమానం ఉన్న మూడు జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల అదనపు భద్రతకోసం ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణతో పాటు సమీక్ష కోసం తెలంగాణలో 11 మంది ఐపీఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్టు తెలిపారు. ఇప్పటివరకు 32,18,143 మద్యం బాటిళ్లు, రూ. 122,94,08,385 నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. -
నేతల వాహనాలూ తనిఖీ చేస్తాం: డీజీపీ ప్రసాదరావు
* ఏపీజేఎఫ్ ‘మీట్ ది ప్రెస్’లో డీజీపీ ప్రసాదరావు * డబ్బు, మద్యం తరలింపుపై డేగ కన్ను వేశాం * ఆదాయపు పన్ను శాఖ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది * రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ ఉండడంతో పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు * మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, బలగాల తరలింపునకు హెలికాప్టర్ వినియోగిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం తరలిస్తున్నారని, దీనిపై పోలీసుశాఖ డేగకన్ను వేసిందని డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. రాజకీయనేతలు నగదు తరలింపు కోసం వినూత్న మార్గాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోందని, సమాచారం ఉంటే నాయకుల వాహనాలను కూడా తనిఖీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఏపీజేఎఫ్) మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ శివార్లలో చిక్కిన డబ్బును ఓ వ్యక్తి కమీషన్ తీసుకుని రాజకీయ నాయకుడి కోసం తరలిస్తున్నట్లు తేలిందని వివరించారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. ఇక ఇళ్లపై దాడుల అంశం ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ సైతం ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని... అందులో కొంత సొమ్ముకు ఆధారాలు చూపడంతో తిరిగి అప్పగించామని, మిగతా దానిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనతో పాటు ఎన్నికల కోడ్ సైతం అమల్లో ఉండటంతో వరుసగా వచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయడంలో పోలీసులకు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదన్నారు. రెండు దశల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల ఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బందోబస్తు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక పరిస్థితుల ఆధారంగా అవసరమైన బందోబస్తు స్కీమ్ రూపొందిస్తున్నామన్నారు. 2009 ఎన్నికలకు పంపిన దాని కంటే కాస్త ఎక్కువగానే పారా మిలటరీ బలగాలను కేటాయిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న 1.3 లక్షల పోలీసులు, 28 వేల మంది హోంగార్డుల్లో 20 శాతం మందిని మాత్రమే సాధారణ విధులకు వినియోగిస్తూ.. మిగతా వారిని ఎన్నికల విధులకు కేటాయిస్తామన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే (ఈ నెల 30న) తెలంగాణకు సీమాంధ్ర నుంచి... రెండో విడతలో జరిగే (మే 7న) సీమాంధ్రకు తెలంగాణ నుంచి బలగాలను తరలిస్తామని తెలిపారు. మావోయిస్టు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు.. ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందనే సమాచారం నేపథ్యంలో... జిల్లా ఎస్పీల నేతృత్వంలోని స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్స్‌ను అప్రమత్తం చేశామని డీజీపీ చెప్పారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, తూర్పు గోదావరి, విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖల్లోని మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, బలగాల తరలింపునకు హెలికాప్టర్ వాడతామని చెప్పారు. ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం నేరం కాదని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల విధుల్లో ఉండే పోలీసు సిబ్బందికి నెల జీతం అదనంగా ఇవ్వడం అనేది ఈసీ పరిధిలోని అంశమని చెప్పారు. -
పోలీసులకు మానసిక ఒత్తిడి ఎక్కువే
మెడికల్ క్యాంప్ ప్రారంభ కార్యక్రమంలో డీజీపీ సాక్షి, హైదరాబాద్: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యం బారిన పడుతుంటారని రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు అన్నారు. వయసు ప్రభావంతో రక్తపోటు, మధుమేహం, గుండెనొప్పి బారిన పడకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఆయన సూచించారు. మెడ్విన్ ఆస్పత్రి సౌజన్యంతో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు వెల్ఫేర్ మెడికల్ క్యాంప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ శిబిరంలో పంపిణీ చేసే మందులకోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) రూ.లక్ష విరాళంగా ఇచ్చిందని డీజీపీ తెలిపారు. ఈ క్యాంప్ సేవల్ని డీజీపీ కార్యాలయంతోపాటు ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏపీఎస్పీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం వినియోగించుకోవచ్చని అదనపు డీజీ(సంక్షేమం) సౌమ్య మిశ్రా తెలిపారు. -
కానిస్టేబుల్ కొడుకే డీజీపీ
తెనాలి/నరసరావుపేట, న్యూస్‌లైన్ : ఓ కానిస్టేబుల్ కొడుకు పోలీసుశాఖ రాష్ట్ర సర్వోన్నతాధికారి అయ్యారు. డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలంటూ వేసిన పటిషన్ హైకోర్టు తోసిపుచ్చడంతో కొత్త ఇన్చార్జి డీజీపీగా బయ్యారపు ప్రసాదరావును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1979 బ్యాచ్‌కు చెందిన ప్రసాదరావు గుంటూరు జిల్లా తెనాలి వాసి కావడం గమనార్హం. ఈయన తండ్రి శ్రీనివాసరావు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఉద్యోగరిత్యా తెనాలికి వచ్చి ఇక్కడి ఐతానగర్లో స్థిరపడ్డారు. 1955లో జన్మించిన ప్రసాదరావు ప్రాధమిక విద్యను నర్సరావుపేటలో అభ్యసించారు. కొల్లూరు జెడ్పీహైస్కూలులో ఉన్నత విద్యను చదివి, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ను విజయవాడ లయోలా కళాశాలలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను మద్రాస్ ఐఐటీలో పూర్తి చేశారు. ఐదుగురు సంతానంలో ప్రసాదరావు పెద్దవారు. ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రసాదరావు తల్లి సుశీలమ్మది తెనాలి మండలం తేలప్రోలు గ్రామం. ఎన్నిసార్లు తెనాలికి వచ్చినా, పెదరావూరులోని తన మేనమామ వేజండ్ల అలీషా కుటుంబాన్ని కలవకుండా వెళ్లరు. ఫిజిక్స్ అంటే ఉన్న మక్కువతో ఇప్పటికీ తరంగ సిద్దాంతం, బిగ్‌బ్యాంగ్ థియరీలపై రిసెర్చ్ చేస్తుంటారు. నరసరావుపేటలో... ప్రసాదరావు తండ్రి శ్రీనివాసరావు నరసరావుపేటలో కానిస్టేబుల్‌గా కొద్దికాలం పనిచేశారు. అప్పటికి పట్టణంలోని కొండలరావుపేట కొత్తబావి ఎదురుగా ఉన్న పెంకుటింటిలో స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లాల్‌బహుదూర్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ప్రసాదరావు ప్రాధమిక విద్యను అభ్యసించారు. ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సమయంలో రెండేళ్ళ క్రితం నరసరావుపేట వచ్చినపుడు తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను పట్టణంలోని పాత పోలీస్‌స్టేషన్ వెనుకవైపు ఉండే పెంకుటింటిలో ఉన్న పాఠశాలలో చదువుకున్నానని చెప్పారు. అంతేకాకుండా తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూలును సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.