ఎనిమిది నెలల్లో ఎన్నో సవాళ్లు | we have faced more challanges in 8months of period, says Bayyarapu Prasada rao | Sakshi
Sakshi News home page

ఎనిమిది నెలల్లో ఎన్నో సవాళ్లు

Published Fri, Jun 6 2014 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

ఎనిమిది నెలల్లో ఎన్నో సవాళ్లు

ఎనిమిది నెలల్లో ఎన్నో సవాళ్లు

* రాష్ట్ర విభజన సహా ఎన్నికలను సమర్థంగా నిర్వహించాం
* మాజీ డీజీపీ ప్రసాదరావు వెల్లడి
* ఘనంగా వీడ్కోలు పలికిన రెండు రాష్ట్రాల కొత్త డీజీపీలు

 
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా పనిచేసిన ఎనిమిది నెలల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని మాజీ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో సహా వరుసగా వచ్చిన ఎన్నికలను సైతం సమర్థవంతంగా నిర్వహించామన్నారు. గురువారమిక్కడి అంబర్‌పేట్‌లో ఉన్న ఎస్‌ఏఆర్ సీపీఎల్ మైదానంలో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది.
 
 1980-90ల్లో ఉధృతంగా ఉన్న నక్సల్స్ సమస్యను సమష్టిగా, అంకితభావంతో పనిచేయడమే కాకుండా ప్రాణాలు సైతం త్యాగాలు చేసి ఎదుర్కొన్నారు. రాష్ట్రం రెండుగా వేరుపడినా, ఇరు ప్రాంతాల్లోనూ ఉండే పోలీసులు అదే స్ఫూర్తితో పనిచేస్తూ రెండు రాష్ట్రాలకూ అదే గుర్తింపు తేవాలి. 1969లో జరిగిన ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగేళ్లుగా ఎంత ఉధృతంగా ఉద్యమం జరిగినా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాల్పుల వంటి ఘటనలు చోటు చేసుకోలేదు. యూనిఫాం వేసుకుని పోలీసు విభాగంలో పనిచేయడం హోదా, పవర్ కాదు. ఇది ఓ అదృష్టంగా భావించాలి.
 
 సామాన్యుడికి అందుబాటులో ఉండే తొలి ప్రభుత్వ కార్యాలయం పోలీస్ స్టేషనే. అక్కడకు సమస్యలతో వచ్చినవారికి సేవ చేయడం ద్వారా మన్ననలు పొందాలి. నిర్విరామంగా విధుల్లో ఉండే పోలీసులకు వారి కుటుంబీకులు ఇచ్చే నైతికస్థైర్యం చెప్పనలవి కానిది. అందుకే సిబ్బందితోపాటు వారి కుటుంబాల సంక్షేమానికి పోలీసు విభాగం చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు. సంక్షేమం, మర్యాదతో కూడిన ప్రవర్తన, ఏదో చేయాలనే తపనతో ఉండే ప్రసాదరావు ప్రతి పోలీసుకూ గుర్తుండిపోతారని తెలంగాణ తాత్కాలిక డీజీపీ అనురాగ్ శర్మ ప్రశంసించారు. ప్రముఖ విద్యావేత్త కూడా అయిన ఆయన తన ఫిజిక్స్ రీసెర్చ్‌ల్లోనే రిలాక్స్ అవుతుంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీ జాస్తి వెంకటరాముడు మాట్లాడుతూ.. ‘‘ప్రసాదరావు, నేను దాదాపు ఒకేసారి సర్వీస్‌లోకి వచ్చాం.
 
 ఆయనతో కలిసే ఢిల్లీలో జరిగిన యూపీఎస్సీ ఇంటర్వ్యూకు హాజరయ్యా. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసుల్లో ఇంతకంటే సౌమ్యుడు లేరు. సంక్షేమానికి ప్రసాదరావు కేరాఫ్ అడ్రస్. ఆయన పరిచయం చేసిన సంక్షేమ కార్యక్రమాలను రెండు రాష్ట్రాల పోలీసులు కొనసాగించాలి. నా ఫస్ట్ లవ్ రీసెర్చ్ అంటూ పాతికేళ్లుగా చెప్తున్న ఆయనకు ఇటీవల డాక్టరేట్ కూడా వచ్చింది. ప్రసాదరావు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు. సమైక్య డీజీపీకి ఇచ్చే ఆఖరి పెరేడ్ ఇదే కావడంతో ప్రసాదరావుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీలు ఉమ్మడిగా వీడ్కోలు పలికారు. పోలీసు విభాగం నుంచి ప్రసాదరావు గౌరవ వందనం స్వీకరించడంతోపాటు కవాతును వీక్షించారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన  ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తర్వాత అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement