రాష్ట్రాలు విడిపోయినా కలసి పనిచేయాలి : డీజీపీ
సిబ్బందికి డీజీపీ ప్రసాదరావు పిలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తన కార్యాలయంలో ఉన్న సిబ్బంది మరికొన్ని రోజుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పని చేయాల్సి ఉంటుందని డీజీపీ బయ్యారపు ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రాలు విడిపోయినా సిబ్బంది మాత్రం దూరం కాకుండా కలసిమెలసి పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ప్రక్రియ జోరందుకోవడం, అపాయింటెడ్ డే సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో కలసి డీజీపీ సోమవారం తన కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు వేరైనా సిబ్బంది పరస్పర సహకారంతో పని చేస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరారు. రెండు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాలు పక్కపక్కనే ఉండనున్న నేపథ్యంలో పరస్పర సహకారం కూడా సముచిత స్థాయిలో ఉండాలన్నారు.
ఎవరెక్కడ పని చేస్తున్నా అందరూ పోలీసు శాఖకు చెందిన వారే అన్నది మరువద్దని కోరారు. ఫైళ్ల క్లియరెన్స్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ ద్వారా శిక్షణ ఇప్పించనున్నట్లు వెల్లడించారు. సిబ్బంది సైతం ఫైళ్లు రాసే విధానంలో నూతనత్వాన్ని అలవర్చుకోవడంతో పాటు పాతవాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, చెక్ లిస్ట్ తయారు చేసుకోవడం వంటివి చేసి త్వరగా క్లియర్ చేయాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ పని చేయబోయే ప్రస్తుత సిబ్బంది త్వరలోనే పదోన్నతులతోపాటు ఇతర లాభాలు పొందే అవకాశం ఉందని క్రీడల విభాగం అదనపు డీజీ రాజీవ్ త్రివేది తెలిపారు. డిస్పోజల్ ఫైళ్లను సైతం రాష్ట్రాల వారీగా భద్రపరచాలని అదనపు డీజీ ఉమేష్ షరాఫ్ కోరారు.