ఆంధ్రప్రదేశ్‌కే నా ఆప్షన్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ‘‘1979లో ఐపీఎస్‌గా చేరినప్పుడు రాష్ట్రం విడిపోతుందని అనుకోలేదు. మంచి రాష్ట్రం ఇప్పుడు విడిపోతోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీని కావడం బాధాకరంగా ఉంది. ఏదేమైనా ఇది ప్రజల అభీష్టం మేరకే జరుగుతోంది’’ అని రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు అన్నారు. మిగిలిన సర్వీసు ఆంధ్రప్రదేశ్‌లో పని చేయడానికి ఆప్షన్ ఇచ్చానని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు ఆ రాష్ట్రానికే డీజీపీగా కొనసాగుతానని అన్నారు.
గురువారం ఆయన డీజీపీ కార్యాలయంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పోలీసుల కోసం నిర్మించిన బ్యారెక్స్‌తో పాటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విరాళంగా ఇచ్చిన ఫ్రీజర్లతో కూడిన రెండు అంబులెన్స్‌లను, కంటి చికిత్సా శిబిరాన్నీ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులకు 59 ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. పోలీసు కుటుంబాలకు వివిధ రకాలైన శిక్షణలు ఇవ్వడానికి యూనిట్‌కు రూ.25 వేల చొప్పున మంజూరు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, డీజీపీగా ఈ ఎనిమిది నెలల కాలం మంచి సంతృప్తినిచ్చిందని, ఈ సమయంలోనే ఉద్యమాలతో పాటు వరుసగా వచ్చిన ఎన్నికలనూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తి చేశామని చెప్పారు.
ఇరు ప్రాంతాల్లోనూ జరిగిన ఆందోళనల్లో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా వ్యవహరించామన్నారు. అభివృద్ధిలో శాంతిభద్రతలది కీలకపాత్రని, వాటిని కాపాడే పోలీసులు ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుకి దేశంలోనే మంచి పేరుందన్నారు. రెండు రాష్ట్రాల పోలీసులూ దీన్ని నిలబెట్టేలా కృషి చేయాలని చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల మేరకే ఐపీఎస్ అధికారుల విభజన ఉంటుందని, అప్పటి వరకు తెలంగాణలో పరిపాలన కోసం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కొందరిని తాత్కాలికంగా కేటాయిస్తుందని తెలిపారు.
రాష్ట్ర క్యాడర్ పోస్టుల విభజనకు కమలనాథన్ కమిటీ సిఫార్సులు రావాలని, అప్పటి వరకు ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు ఎక్కడివారక్కడే పని చేస్తారన్నారు. కీలక పోస్టులైన సీఎస్, డీజీపీ, అదనపు డీజీపీ ఇంటెలిజెన్స్ తదితర పోస్టులతో మాత్రమే పాలన ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం పోలీసు విభాగంలో జరుగుతున్న కేటాయింపులన్నీ తాత్కాలికమైనవేనని, హైదరాబాద్‌లో పని చేస్తున్న వాళ్లు యథాతథంగా ఉంటారని డీజీపీ పేర్కొన్నారు.