నేతల వాహనాలూ తనిఖీ చేస్తాం: డీజీపీ ప్రసాదరావు
* ఏపీజేఎఫ్ ‘మీట్ ది ప్రెస్’లో డీజీపీ ప్రసాదరావు
* డబ్బు, మద్యం తరలింపుపై డేగ కన్ను వేశాం
* ఆదాయపు పన్ను శాఖ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది
* రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ ఉండడంతో పెద్దగా సవాళ్లు ఎదురుకాలేదు
* మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, బలగాల తరలింపునకు హెలికాప్టర్ వినియోగిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం తరలిస్తున్నారని, దీనిపై పోలీసుశాఖ డేగకన్ను వేసిందని డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. రాజకీయనేతలు నగదు తరలింపు కోసం వినూత్న మార్గాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోందని, సమాచారం ఉంటే నాయకుల వాహనాలను కూడా తనిఖీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఏపీజేఎఫ్) మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు.
ఇటీవల హైదరాబాద్ శివార్లలో చిక్కిన డబ్బును ఓ వ్యక్తి కమీషన్ తీసుకుని రాజకీయ నాయకుడి కోసం తరలిస్తున్నట్లు తేలిందని వివరించారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. ఇక ఇళ్లపై దాడుల అంశం ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ సైతం ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని... అందులో కొంత సొమ్ముకు ఆధారాలు చూపడంతో తిరిగి అప్పగించామని, మిగతా దానిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనతో పాటు ఎన్నికల కోడ్ సైతం అమల్లో ఉండటంతో వరుసగా వచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయడంలో పోలీసులకు ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదన్నారు. రెండు దశల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల ఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బందోబస్తు
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక పరిస్థితుల ఆధారంగా అవసరమైన బందోబస్తు స్కీమ్ రూపొందిస్తున్నామన్నారు. 2009 ఎన్నికలకు పంపిన దాని కంటే కాస్త ఎక్కువగానే పారా మిలటరీ బలగాలను కేటాయిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న 1.3 లక్షల పోలీసులు, 28 వేల మంది హోంగార్డుల్లో 20 శాతం మందిని మాత్రమే సాధారణ విధులకు వినియోగిస్తూ.. మిగతా వారిని ఎన్నికల విధులకు కేటాయిస్తామన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే (ఈ నెల 30న) తెలంగాణకు సీమాంధ్ర నుంచి... రెండో విడతలో జరిగే (మే 7న) సీమాంధ్రకు తెలంగాణ నుంచి బలగాలను తరలిస్తామని తెలిపారు.
మావోయిస్టు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు..
ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందనే సమాచారం నేపథ్యంలో... జిల్లా ఎస్పీల నేతృత్వంలోని స్పెషల్ పార్టీలు, గ్రేహౌండ్స్‌ను అప్రమత్తం చేశామని డీజీపీ చెప్పారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, తూర్పు గోదావరి, విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖల్లోని మారుమూల ప్రాంతాలకు ఎన్నికల సిబ్బంది, బలగాల తరలింపునకు హెలికాప్టర్ వాడతామని చెప్పారు. ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం నేరం కాదని పేర్కొన్నారు. కాగా, ఎన్నికల విధుల్లో ఉండే పోలీసు సిబ్బందికి నెల జీతం అదనంగా ఇవ్వడం అనేది ఈసీ పరిధిలోని అంశమని చెప్పారు.