కానిస్టేబుల్ కొడుకే డీజీపీ
Published Tue, Oct 1 2013 6:01 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
తెనాలి/నరసరావుపేట, న్యూస్‌లైన్ : ఓ కానిస్టేబుల్ కొడుకు పోలీసుశాఖ రాష్ట్ర సర్వోన్నతాధికారి అయ్యారు. డీజీపీ దినేష్‌రెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలంటూ వేసిన పటిషన్ హైకోర్టు తోసిపుచ్చడంతో కొత్త ఇన్‌చార్జి డీజీపీగా బయ్యారపు ప్రసాదరావును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1979 బ్యాచ్‌కు చెందిన ప్రసాదరావు గుంటూరు జిల్లా తెనాలి వాసి కావడం గమనార్హం. ఈయన తండ్రి శ్రీనివాసరావు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఉద్యోగరిత్యా తెనాలికి వచ్చి ఇక్కడి ఐతానగర్‌లో స్థిరపడ్డారు.
1955లో జన్మించిన ప్రసాదరావు ప్రాధమిక విద్యను నర్సరావుపేటలో అభ్యసించారు. కొల్లూరు జెడ్పీహైస్కూలులో ఉన్నత విద్యను చదివి, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ను విజయవాడ లయోలా కళాశాలలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను మద్రాస్ ఐఐటీలో పూర్తి చేశారు. ఐదుగురు సంతానంలో ప్రసాదరావు పెద్దవారు. ముగ్గురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రసాదరావు తల్లి సుశీలమ్మది తెనాలి మండలం తేలప్రోలు గ్రామం. ఎన్నిసార్లు తెనాలికి వచ్చినా, పెదరావూరులోని తన మేనమామ వేజండ్ల అలీషా కుటుంబాన్ని కలవకుండా వెళ్లరు. ఫిజిక్స్ అంటే ఉన్న మక్కువతో ఇప్పటికీ తరంగ సిద్దాంతం, బిగ్‌బ్యాంగ్ థియరీలపై రిసెర్చ్ చేస్తుంటారు.
నరసరావుపేటలో... ప్రసాదరావు తండ్రి శ్రీనివాసరావు నరసరావుపేటలో కానిస్టేబుల్‌గా కొద్దికాలం పనిచేశారు. అప్పటికి పట్టణంలోని కొండలరావుపేట కొత్తబావి ఎదురుగా ఉన్న పెంకుటింటిలో స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లాల్‌బహుదూర్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ప్రసాదరావు ప్రాధమిక విద్యను అభ్యసించారు. ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సమయంలో రెండేళ్ళ క్రితం నరసరావుపేట వచ్చినపుడు తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను పట్టణంలోని పాత పోలీస్‌స్టేషన్ వెనుకవైపు ఉండే పెంకుటింటిలో ఉన్న పాఠశాలలో చదువుకున్నానని చెప్పారు. అంతేకాకుండా తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూలును సందర్శించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Advertisement