టీఆర్‌ఎస్ కొంపముంచిన ‘రెబల్’
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్లలో టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారు. సునాయాసంగా గెలవాల్సిన చోట కేఎస్ రత్నం రెబల్ అభ్యర్థి దేశమోళ్ల ఆంజనేయులు మూలంగా ఓటమి పాలు కావాల్సి వచ్చింది. రెబల్ అభ్యర్థి రంగంలో లేకపోతే రత్నం సుమారు 5వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించేవారని పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు. దేశమోళ్ల ఆంజనేయులు దశాబ్ధకాలంగా నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో గులాబీ జెండాను చేతపట్టుకొని గ్రామగ్రామాన తిరుగుతూ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజెప్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకే వస్తుందని ఆశించారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న దశలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ రత్నం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆంజనేయులు ఆశలు అడియాసలయ్యాయి. గులాబీ బాస్ కేసీఆర్, రాష్ట్ర నాయకులు హరీష్‌రావు, కేటీఆర్‌ల వద్దకు వెళ్లి టికెట్ కోసం చివరి నిమిషం దాకా విశ్వప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నందున ఎమ్మెల్సీ ఇప్పిస్తామని కేసీఆర్‌తో హామీ ఇప్పించారు. అయితే, ఉద్యమం కోసం దశాబ్ధకాలంగా నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేసిన తనను కాదని ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినవారికి ఎలా టికెట్ ఇస్తారని ఆంజనేయులు వాదించినా పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక రెబల్‌గా బరిలోకి దిగారు.
ఓట్ల చీలికతో గట్టెక్కిన ‘కాలె’..
ఫలితాల్లో రౌండ్లవారీగా కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే ఆంజనేయులు గెలుపునకు ఆమడదూరంలో ఉన్నా టీఆర్‌ఎస్ ఓట్లను చీల్చడంలో సఫలీకృతులయ్యారు. ఆంజనేయులుకు 6,799 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చిన ఓట్లు రత్నంను ఓడించడానికి దోహదపడ్డాయి. ఉద్యమ ద్రోహులు, అవకాశవాదం, స్వార్థంతో పార్టీలు మారేవారికి టికెట్లు ఇచ్చి చిరకాలంగా పార్టీని నమ్ముకున్న వారి తీరని అన్యాయం చేశారని గ్రామాల్లో ఆంజనేయులు చేసిన ప్రచారం కాస్తోకూస్తో పనిచేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో రత్నం కేవలం 781 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్‌లో చివరికి రెబల్ అభ్యర్థి చీల్చిన ఓట్ల పుణ్యమా అని కాలె యాదయ్య స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు.