KS Ratnam
-
బీఆర్ఎస్కు కూచుకుళ్ల, కేఎస్ రత్నం రాజీనామా
సాక్షి, హైదరాబాద్/కొల్లాపూర్/చేవెళ్ల: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇద్దరూ తమ రాజీనామా లేఖలను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపించారు. ఈనెల 31న కొల్లాపూర్‌లో నిర్వహించనున్న ప్రియాంకాగాంధీ సభలో ఆమె సమక్షంలో దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. సభాస్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవితో తగిన గుర్తింపు ఇచ్చినప్పటికీ, స్థానికంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదన్నారు. సమస్యలను చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ను ఎన్నిసార్లు అపాయిట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. మంత్రి కేటీఆర్‌కు చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదన్నారు. తాను గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని 15 రోజులకోసారి కలిసి స్థానిక అంశాలు మాట్లాడేవాడినని వివరించారు. కేసీఆర్ పాలనలో అలాంటి అవకాశం లేదన్నారు. కాగా.. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇది వరకే కాంగ్రెస్‌లో చేరగా.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం శుక్రవారం బీజేపీలో చేరనున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పదేళ్లుగా పారీ్టలో తగిన ప్రాధాన్యత లేకపోయినా కేసీఆర్‌పై ఉన్న గౌరవంతో కార్యకర్తగా కొనసాగానని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకుని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఆ తరువాత రెండుసార్లు తనకు టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని.. చేవెళ్ల ప్రజల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని పేర్కొన్నారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
రెబెల్ కాళ్లపై పడిన అభ్యర్థి.. వైరల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల పర్వంలో ఇవాళ కీలక కసరత్తు జరగనుంది. బరిలో ఉండే వారెందరు..? నామినేషన్ ఉపసంహరించుకునే వారెవరు..? అన్నది నేడు తేలనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రెబెల్ అభ్యర్థులను బరిలోనుంచి తప్పించేందుకు అన్ని పార్టీల పెద్దలు నానా పాట్లు పడుతున్నారు. బాబూ తప్పుకో అంటూ బతిమలాడుతున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నం.. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. తనకు సహకరించాలంటూ ఏకంగా చేవెళ్ల కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వెంకటస్వామి కాళ్లు ఆయన పట్టుకొని బ్రతిమిలాడుతున్న ఫొటో.. ఇప్పుడు వైరల్‌గా మారింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి పడాల వెంకటస్వామి అధిష్టానాన్ని కోరారు. అనూహ్యంగా ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేఎస్ రత్నంకు టికెట్ దక్కింది. దీంతో అలకవహించిన వెంకటస్వామి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించినా అధిష్టానం నచ్చజెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో బుధవారం కేఎస్ రత్నం.. వెంకటస్వామి ఇంటికి వచ్చి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నాడు రూ.12 కోట్లు.. నేడు రూ.4కోట్లు
సాక్షి, చేవెళ్ల: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేఎస్ రత్నం సమర్పించిన అఫిడవిట్ వివరాలిలా ఉన్నాయి. గత ఎన్నికల్లో, ఇప్పటి ఎన్నికల్లో సమర్పించిన ఆస్తుల్లో తగ్గుదల కనిపించింది. అప్పులు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 2014 ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఆయనతోపాటు భార్య పిల్లలకు సంబంధించిన ఆస్తుల వివరాలను అందించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనతో పాటు భార్య పేరుపై ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను మాత్రమే అందజేశారు. పిల్లల వివరాలను జతచేయటకపోవటంతో ఆస్తుల విలువ తగ్గింది. కెఎస్.రత్నం ప్రకటించిన 2014 అఫిడవిట్లో మొత్తం ఆస్తులు రూ.12 కోట్ల 34లక్షల 80వేలుగా ప్రకటించారు. 2018లో రూ. 4కోట్ల 9లక్షల 41వేల 252రూపాయలుగా ప్రకటించారు. 2014లో సిర్థాస్తులు రూ. 11, 80,00,000 కాగా చరాస్తులు రూ. 54,80,000గా తెలిపారు. అప్పులు 33 లక్షలుగా చూపించారు. 2018 ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తుల వివరాల్లో స్థిరాస్తులు రూ.3,51,83,500, చారాస్తులు 57,57,752లుగా ప్రకటించారు. అప్పులు రూ.52,40,546 ఉన్నట్లుగా ప్రకటించారు. గత ఎన్నికల్లో రెండు కార్లు మాత్రమే ఉండగా ఇప్పుడు మూడు కార్లు ఉన్నట్లుగా వెల్లడించారు. -
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే!
చేవెళ్ల (రంగారెడ్డి): మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖారారైంది. ఈనెల 27న కాంగ్రెస్ పార్టీలో చేరాలని దాదాపు ఖారారు అయిందని విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో నిరాశ చెందిన ఆయన తన అనుచరగణంతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమన్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 27న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి వెళ్లి పార్టీలో చేరనున్నారని సమాచారం. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ఆయన అనుచరులతో చర్చించి వారిని పెద్ద ఎత్తున వెంట తీసుకెళ్లేందుకు సోమవారం చేవెళ్లలో మారోసారి ఆయన అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరి అధిష్టానం ఎవరికి టికెట్‌ను ఇస్తుందో వేచి చూడాల్సిందే. -
ఉందామా.. పోదామా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నేత కేఎస్ రత్నం ఆదివారం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. రెండు రోజులుగా కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాలు జరిపిన ఆయన చేవెళ్ల మండల కేంద్రంలో రేపు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో రత్నం పరాజయం పాలయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో యాదయ్య టీఆర్ఎస్ గూటికి చేరారు.దీంతో పార్టీలో రత్నం ప్రాబల్యం తగ్గింది. దీనికితోడు మంత్రి మహేందర్‌రెడ్డితో కూడా వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో దూరం పెరిగింది. అయినప్పటికీ పార్టీ వీడని ఆయన.. తన అనుచరవర్గంతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి తప్పకుండా తనకే టికెట్ లభిస్తుందని ఆశించారు. అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే యాదయ్య అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గుచూపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో గురువారం రాత్రి సన్నిహితులతో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరించారు. శుక్రవారం మొయినాబాద్‌లో కూడా అనుచరులతో భేటీ అయిన రత్నం.. పార్టీలో కొనసాగాలా? కాంగ్రెస్ గూటికి చేరాలా? అనే అంశంపై ఆదివారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. టికెట్ ఇవ్వకుండా అవమానించిన పార్టీలో ఇమడలేమని, పార్టీ మారడమే ఉత్తమమని మెజార్టీ అభిప్రాయం వ్యక్తమైంది. ఇదిలావుండగా, అసంతృప్తితో ఉన్న రత్నంను ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుజ్జగింపులకు దిగినట్లు తెలిసింది. తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మీ ఇద్దరిని పిలిచి మాట్లాడతారని భరోసా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారంలోపు పిలుపు రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని రత్నం నిర్ణయించినట్లు ఆయన అనుచరవర్గం స్పష్టం చేస్తోంది. చేవెళ్ల కాకుండా వికారాబాద్‌కు వెళ్లాలనే ప్రతిపాదనను టీఆర్ఎస్ అధిష్టానం తెచ్చినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. -
లిఫ్ట్ వచ్చిందనుకొని..
డోర్ తెరిచి అడుగేసిన రత్నం అమాంతం రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయిన మాజీ ఎమ్మెల్యేతీవ్ర గాయాలు, నిమ్స్‌కు తరలింపు హైదరాబాద్‌లో ఎంపీ కవిత ఇంటి వద్ద ప్రమాదం చేవెళ్ల: లిఫ్టు ఎక్కబోతూ కిందపడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు కేఎస్ రత్నం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేఎస్ రత్నం శుక్రవారం నిజామాబాద్ ఎంపీ కవితను కలిసేందుకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లారు. ఎంపీని కలసి తిరిగి వెళ్లేందుకు ఆమె నివాసంలోనే రెండో అంతస్తులో ఉన్న లిఫ్టు వద్దకు వచ్చారు. ఏదో ఆలోచనలో ఉన్న ఆయన లిఫ్ట్ రెండో అంతస్తుకు రాకమునుపే డోర్ తెరిచి లోపలికి అడుగు పెట్టారు. దీంతో ఆయన ఒక్కసారిగా కింది అంతస్తులో ఉన్న లిఫ్ట్ పైభాగంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గన్మెన్లు పరుగున వచ్చి రత్నంను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇటీవల చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానిక టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో నిమ్స్‌కు తరలివెళ్లారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు రత్నంను నిమ్స్‌లో పరామర్శించారు. -
టీఆర్ఎస్ కొంపముంచిన ‘రెబల్’
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్లలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారు. సునాయాసంగా గెలవాల్సిన చోట కేఎస్ రత్నం రెబల్ అభ్యర్థి దేశమోళ్ల ఆంజనేయులు మూలంగా ఓటమి పాలు కావాల్సి వచ్చింది. రెబల్ అభ్యర్థి రంగంలో లేకపోతే రత్నం సుమారు 5వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించేవారని పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు. దేశమోళ్ల ఆంజనేయులు దశాబ్ధకాలంగా నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో గులాబీ జెండాను చేతపట్టుకొని గ్రామగ్రామాన తిరుగుతూ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజెప్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకే వస్తుందని ఆశించారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న దశలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ రత్నం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆంజనేయులు ఆశలు అడియాసలయ్యాయి. గులాబీ బాస్ కేసీఆర్, రాష్ట్ర నాయకులు హరీష్‌రావు, కేటీఆర్‌ల వద్దకు వెళ్లి టికెట్ కోసం చివరి నిమిషం దాకా విశ్వప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నందున ఎమ్మెల్సీ ఇప్పిస్తామని కేసీఆర్‌తో హామీ ఇప్పించారు. అయితే, ఉద్యమం కోసం దశాబ్ధకాలంగా నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేసిన తనను కాదని ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినవారికి ఎలా టికెట్ ఇస్తారని ఆంజనేయులు వాదించినా పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక రెబల్‌గా బరిలోకి దిగారు. ఓట్ల చీలికతో గట్టెక్కిన ‘కాలె’.. ఫలితాల్లో రౌండ్లవారీగా కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే ఆంజనేయులు గెలుపునకు ఆమడదూరంలో ఉన్నా టీఆర్ఎస్ ఓట్లను చీల్చడంలో సఫలీకృతులయ్యారు. ఆంజనేయులుకు 6,799 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చిన ఓట్లు రత్నంను ఓడించడానికి దోహదపడ్డాయి. ఉద్యమ ద్రోహులు, అవకాశవాదం, స్వార్థంతో పార్టీలు మారేవారికి టికెట్లు ఇచ్చి చిరకాలంగా పార్టీని నమ్ముకున్న వారి తీరని అన్యాయం చేశారని గ్రామాల్లో ఆంజనేయులు చేసిన ప్రచారం కాస్తోకూస్తో పనిచేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో రత్నం కేవలం 781 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్‌లో చివరికి రెబల్ అభ్యర్థి చీల్చిన ఓట్ల పుణ్యమా అని కాలె యాదయ్య స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. -
టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి
శంకర్పల్లి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ రత్నం అన్నారు. సోమవారం మండలంలోని జనవాడ, మిర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, పొద్దుటూర్ గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో.. అదే విధంగా నవ తెలంగాణ నిర్మాణం కూడా ఆ పార్టీకే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. దేశ సంపదను దోచుకున్న ఆ పార్టీకి ఓటు వేయకూడదని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి మండలానికి తాగు సాగునీరు అందిస్తామని, పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌడిచెర్ల నర్సింహ, మాజీ ఎంపీపీ బీర్ల నర్సింహ, మిర్జాగూడ సర్పంచ్ సంజీవ్‌కుమార్, మాజీ సర్పంచ్ అయిలయ్య, జిల్లా గొర్రెల కాపరుల సంఘం మాజీ అధ్యక్షుడు ఒగ్గు మల్లేష్‌యాదవ్, రాములు, చోటు, పంతం జంగయ్య, యాదయ్య, ఎజాస్, శ్రీశైలం, అఫ్సర్, గోవింద్‌రెడ్డి ,శ్రీరాములు పాల్గొన్నారు. -
నేడు చేవెళ్లలో కేసీఆర్ సభ
చేవెళ్ల, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు చేవెళ్లలో నిర్వహించే ఎన్నికల సభలో పాల్గొననున్నారు. శనివారం సాయంత్రం 5గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ ఏర్పాట్లను చేవెళ్ల లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ రత్నం పరిశీలించారు. కేసీఆర్ నగరం నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా చేవెళ్లకు చేరుకుంటారు. స్థానిక ఇంద్రారెడ్డి స్మారక ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో నిర్వహించే బహిరంగసభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభాస్థలికి కొద్ది దూరంలోని కొండా వెంకటరంగారెడ్డి మైదానంలో హెలిపాడ్ నిర్మాణపనులు చేపట్టారు. కేసీఆర్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నందున భద్రతా ఏర్పాట్లను, సభ ప్రాంగణం, హెలిపాడ్ నిర్మాణ పనులను అడిషనల్ ఎస్పీ పీ. వెంకటస్వామి, చేవెళ్ల డీఎస్పీ సీహెచ్ శ్రీదర్, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ లక్ష్మీరెడ్డి పరిశీలించారు. -
ఆశావహులెందరో.. టికెట్ దక్కేదెవరికో?
చేవెళ్ల, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పలు రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారోనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ రత్నంకు దాదాపు టికెట్ ఖరారు కాగా, బీజేపీ నుంచి గతంలో పోటీచేసి ఓడిపోయిన కంజర్ల ప్రకాశ్‌కు టికెట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తుందోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ఈ స్థానంపై గురి పెట్టిన పలువురు నాయకులు టికెట్ తమకే వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 28 లేదా 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించడం ఆశావహుల్లో మరింత ఉత్కంఠకు తెరతీసింది. కొన్ని నెలలుగా ఫలానా నాయకుడికే చేవెళ్ల అసెంబ్లీ టికెట్ వస్తుందన్న అంచనాలకు మరో వారం రోజుల్లో తెరపడనుంది. టికెట్ ఎవరికి దక్కేనో? నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేం దుకు ఇద్దరు సీనియర్ నాయకులతో పాటు ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ముగ్గురిలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందోనని పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెల కొంది. నియోజకవర్గ పరిధిలో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్, నవాబుపేట మండలాలున్నాయి. ఎవరికి వారు ప్రయత్నాలు.. 2009లో పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ చేయడంతో అప్పటివరకు చేవెళ్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి పి.సబి తారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి మారారు. దీంతో కాంగ్రెస్ టికెట్‌ను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాలె యాదయ్యకు కేటాయించారు. తెలుగుదేశం పార్టీనుంచి పోటీచేసిన రత్నం కేవలం 2258 ఓట్ల తేడాతో యాదయ్యపై విజయం సాధిం చారు. ప్రస్తుతం మళ్లీ యాదయ్య సైతం పోటీలో ఉన్నానంటూ టికెట్ కోసం పైరవీలు సాగిస్తున్నారు. మరోవైపు మాజీ హోంమంత్రి సబితారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ పడాల వెంకటస్వామి కూడా తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2009లో ఎమ్మెల్యే టికెట్ చివరిక్షణంలో చేజారిందని, ఈ సారి కచ్చితంగా ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. టికెట్ తనకే వస్తుం దనే నమ్మకంతో వెంకటస్వామి క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. తేలేందుకు మరో వారం.. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ కూడా చేవెళ్ల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈయనకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఎక్కడో ఓ చోట టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వికారాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఉండటంతో అక్కడ అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పొచ్చు. దీంతో పక్క నియోజకవర్గమైన చేవెళ్ల నుంచి పోటీ చేయాలనే ఆలోచనను అధిష్టానం వద్ద చంద్రశేఖర్ వ్యక్తం చేసినట్టు సమాచారం. స్థానికేతరుడైన చంద్రశేఖర్‌కు టికెట్ ఇస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారనేది అనుమానమే. ఈ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ నుంచి చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అదృష్టవంతుడెవరో మరో వారం రోజుల్లో అధిష్టానం తేల్చనుంది. -
తెలంగాణలో భూముల ధరలు పడిపోవు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత తనపై ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణ బాధ్యత తన భుజష్కందాలపై ఉందన్నారు. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరగాల్సిన అవసరముందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో భూముల ధరలు పడిపోతాయనేది వాస్తవం కాదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాల్సిన అవసరముందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రూ.1500, వితంతువులకు రూ.1000 పెన్షన్ ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తామన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, గిరిజన తండాలకు పంచాయతీ హోదా కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిమ్స్ తరహ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు 125 చదరపు గజాల స్థలంలో ఇళ్లు కట్టిస్తామని హామీయిచ్చారు. రెండేళ్లలో 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పటిష్టమైన ప్రభుత్వముంటేనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి సాధించినప్పుడే అసలైన పండుగని కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
కప్పదాట్లు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నేతల కప్పదాట్లతో ప్రధాన పార్టీల్లో ఒకప్పటి ప్రత్యర్థులు కాస్తా ఇప్పుడు మిత్రులుగానో, మిత్రపక్షంగానో కొత్త అవతారమెత్తుతున్నారు. ముగ్గు రు ముఖ్యనేతలు తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంతో జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కేఎస్ రత్నం తమ సహచరులతో కలిసి మంగళవారం టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. దీంతో వీరికి ఇన్నాళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరించిన నేతలు ఈ పరిణామాలను విశ్లేషించుకునే పనిలో పడ్డారు. మహేందర్ అనూహ్య నిర్ణయంతో డోలాయమానంలో పడ్డ తాండూరు కాంగ్రెస్ నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తమకు సీటు గ్యారెంటీ అని బలంగా విశ్వసించిన నేతలు కాస్తా మారుతున్న సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్తో పొత్తు లేదా విలీనం ఉంటుందనే అభిప్రాయానికొచ్చారు. ఈ క్రమంలో ఊహిం చని రీతిలో మహేందర్ తదితర ఎమ్మెల్యేలు తమకు మిత్రపక్షంగా వ్యవహరిస్తుందని భావిస్తున్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అంతర్మథనంలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కొందరు కాంగ్రెస్ నాయకులు తమ అంతరంగికులతో భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు జరిపారు. ఒకరిద్దరు ఆశావహులు ఏకంగా పార్టీని వీడనున్నట్లు సంకేతాలిచ్చినట్లు తెలిసిం ది. రాజకీయ వైరం ఉన్న నేతలతో ఇమడలేమని భావిస్తున్న వీరు ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేద ని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ సీటుపై గంపెడాశ పెట్టుకున్న నేతలకు తాజా పరిణామం మింగుడుపడటం లేదు. సీటు లభిస్తుందనే ఆశతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన తమకు గులాబీ నాయకత్వం రిక్తహస్తం చూపుతుందనే గుబులు వెంటాడుతోంది. సిట్టింగ్‌లను కాదని తమకు సీట్లిచ్చే అవకాశాలుండవనే అంచనాకొచ్చిన వారు కొత్తదార్లు వెతుక్కుంటున్నారు. లైన్ క్లియర్! ఇన్నాళ్లు మేహ ందర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు తమకు లైన్‌క్లియర్ అయిందనే సంతోషంలో ఉన్నారు. మహేందర్‌ను ధిక్కరించి సీటు అడిగే పరిస్థితి లేకపోవడంతో గప్‌చిప్‌గా ఉన్నారు. ఇప్పుడు వారంతా తాండూరు రేసుకు రెడీ అవుతున్నారు. మరికొందరు దిగువశ్రేణి నాయకులు మాత్రం ఆయనను అనుసరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మండలాల్లో ఇప్పటికే వీరికి వైరివర్గంగా ఉన్న ఇతర పార్టీ నేతలు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తాండూరుతో పోలిస్తే చేవెళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంది. చేవెళ్ల ఎస్సీ రిజర్వ్ కావడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థిత్వం కోసం పెద్దగా పోటీ లేదు. రత్నం బలమైన నేతగా ఎదగడంతో ఆ వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులె వ్వరూ ఆ స్థాయిలో బలపడలేదు. దీంతో ఇప్పుడు టీడీపీ కొత్త నాయకుడి అన్వేషణలో పడింది. మరోవైపు రత్నం గులాబీ పంచన చేరడంతో కాంగ్రెస్‌లోనూ అంతర్మథనం మొదలైంది. పొత్తు-విలీనంలో భాగంగా టీఆర్ఎస్ చేవెళ్ల సీటుకు ఎక్క డ ఎసరు పెడుతుందోననే భయం పట్టుకుంది. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు రత్నం టీఆర్ఎస్ గూటికి చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పొత్తు,విలీనం జరిగిన పక్షంలో రత్నం పోటీచేస్తే తాము కూడా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్లోనూ రత్నం చేరికతో ముసలం పుట్టింది. పార్టీ కోసం అహర్నిషలు కృషిచేసిన తమను కాదని, చివరి నిమిషంలో చేరినవారికి సీటు కేటాయిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. టీడీపీలో వెలుగువెలిగిన నేతలు ఇప్పుడు కారెక్కిన నేపథ్యంలో పరిణామాలను పరిశీలిస్తే.. ఒకట్రెండు రోజుల్లో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి. దీనికితోడు కాంగ్రెస్ ఎంపీ సీటుపై గంపెడాశ పెట్టుకున్న ఒకరిద్దరు నేతలు తమకు బీ ఫారం దక్కకపోతే.. ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు. -
'టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి'
న్యూఢిల్లీ: కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారమే రేపు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని ఆయన కుమారుడు కేటీఆర్ తెలిపారు. రేపు బేగంపేట నుంచి భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమవుతుందని ఎక్కడా చెప్పలేదన్నారు. అందరితో చర్చించాకే పొత్తు, విలీనంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అపాయింట్మెంట్ డే, ఎన్నికల షెడ్యూల్ తర్వాతే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇకపై టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని వర్ణించారు. టీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్ ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మహేందర్ రెడ్డిలకు సముచితస్థానం కల్పిస్తామని హామీయిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్లే గతంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టు కేఎస్ రత్నం తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములం కావాలన్న కోరికతో తిరిగి టీఆర్ఎస్ చేరుతున్నట్టు ఆయన చెప్పారు.