'టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి'
న్యూఢిల్లీ: కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారమే రేపు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని ఆయన కుమారుడు కేటీఆర్ తెలిపారు. రేపు బేగంపేట నుంచి భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందని ఎక్కడా చెప్పలేదన్నారు. అందరితో చర్చించాకే పొత్తు, విలీనంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అపాయింట్మెంట్ డే, ఎన్నికల షెడ్యూల్ తర్వాతే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
ఇప్పటివరకు టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇకపై టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని వర్ణించారు. టీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్ ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మహేందర్ రెడ్డిలకు సముచితస్థానం కల్పిస్తామని హామీయిచ్చారు.
వ్యక్తిగత కారణాల వల్లే గతంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టు కేఎస్ రత్నం తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములం కావాలన్న కోరికతో తిరిగి టీఆర్ఎస్ చేరుతున్నట్టు ఆయన చెప్పారు.