24 గంటల బంద్‌కు తెలంగాణ జేఏసీ నిర్ణయం
Published Fri, Sep 6 2013 2:12 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
తెలంగాణపై ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుండి 7 తేదీ అర్ధరాత్రి దాకా 24 గంటల బంద్‌ను నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. బంద్‌లో పార్టీ శ్రేణులు, తెలంగాణలోని అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వర్తక, వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ హైదరాబాద్‌లోని టీఎన్‌జీఓ భవన్‌లో గురువారం సమావేశమైంది. ఈ సమావేశం వివరాలను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. తెలంగాణ వ్యతిరేక సభలను, కార్యక్రమాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
‘‘సమైక్యవాదం అనేది ఒక భావన. తెలంగాణ ఏర్పాటు అనేది ప్రజల హక్కు. ఒక ప్రాంత ప్రజల హక్కులకోసం తెలంగాణ ప్రజలు సభలు పెట్టుకుంటామంటే ఎప్పుడూ అనుమతించలేదు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులకు వ్యతిరేకంగా ఏపీఎన్జీఓలు సమైక్యసభను పెట్టుకుంటామంటే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల ముందుగానే అనుమతినిచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణను ఎలాగైనా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కుట్రలుచేస్తున్నడు. ముఖ్యమంత్రి అనుసరిస్తోన్న తెలంగాణ వ్యతిరేక ధోరణికి నిరసనగానే బంద్‌కు పిలుపును ఇస్తున్నాం. తెలంగాణ 10 జిల్లాల్లో బంద్‌ను నిర్వహించాలి. విజయవాడ, కర్నూలు రహదారులను దిగ్బంధం చేయాలి’’ అని కోదండరాం పిలుపునిచ్చారు. ఇరుప్రాంతాల ఉద్యోగుల మధ్య విద్వేషాలను ఇంకా పెంచకుండా తెలంగాణ బిల్లును వేగిరం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు తప్ప మరే ప్రత్యామ్నాయాన్నీ అంగీకరించబోమని జేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా సభ పెడితే ఇప్పటికే అన్యాయానికి గురైన తెలంగాణ ఉద్యోగులకు, ప్రజలకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుంద ని జేఏసీ కోచైర్మన్లు దేవీ ప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ అగ్రనేతలు కె.గోవర్ధన్, అద్దంకి దయాకర్, రఘు, రసమయి బాలకిషన్, గోపాలశర్మ, పి.సంధ్య, మామిడి నారాయణ, మాదు సత్యం, కృష్ణ యాదవ్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
సభను అడ్డుకుంటాం: ఓయూ విద్యార్థి సంఘాల హెచ్చరిక
ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎల్బీస్టేడియంలో నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను అడ్డుకుంటామని ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని పలు విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. సీమాంధ్రులపై దాడులు చేసైనా సభను అడ్డుకొని తీరుతామని మరికొన్ని విద్యార్థి సంఘాల నాయకులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఎన్జీవోల సభను అడ్డుకునేందుకు రహదారుల దిగ్బంధం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బంద్, ఆర్ట్స్ కాలేజ్, నిజాం, సిటీ కళాశాల నుంచి ఎల్బీ స్టేడియంవరకు తెలంగాణ విద్యార్థుల యుద్ధభేరీ పేరుతో మహార్యాలీ నిర్వహించనున్నట్లు 13 విద్యార్థి సంఘాలు పాల్గొన్న తెలంగాణ, ఓయూ విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి చెప్పారు.
Advertisement
Advertisement