హైదరాబాద్ : 'కేసీఆర్ మావాడు... ఎప్పుడైనా కలుస్తా'మని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది అవాస్తవమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో కేసీఆర్ బిజీగా ఉన్నారని... కేసీఆర్ మావాడు ఎప్పుడైనా కలవవచ్చని కోదండరామ్ అన్నారు. కేసీఆర్ అపాయింట్మెంట్ విషయాన్ని వివాదం చేయవద్దని ఆయన మీడియాను కోరారు.
తెలంగాణ జేఏసీ శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచే తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరుపుకుంటామని తెలిపారు. అర్థరాత్రి జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచే గన్ పార్క్ వద్ద కార్యక్రమాలు మొదలవుతాయన్నారు. జూన్ రెండున తెలంగాణ వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు ర్యాలీలు, వేడుకలు నిర్వహిస్తామన్నారు.
ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే ఉంచాలని కోదండరామ్ అన్నారు. స్థానికత ఆధారంగానే విభజన జరగాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను చంద్రబాబు నాయుడు గౌరవించాలని ఆయన సూచించారు. రెచ్చగొట్టడం అనేది తమ డిక్షనరీలో లేదని కోదండరామ్ వ్యాఖ్యానించారు.
కాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న కేసీఆర్ను అభినందించడానికి కోదండరాం ఐదురోజుల కిందటే సమయం కోరినా ఆయనకు ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని సమాచారం. తాను అపాయింట్‌మెంటు కోరిన విషయాన్ని రెండు రోజుల కిందట కూడా కేసీఆర్ వ్యక్తిగత సిబ్బందికి కోదండరాం గుర్తుచేశారని, అయినా ఇప్పటికీ కోదండరాంకు అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదని తెలిసింది.
' కేసీఆర్ మావాడు... ఎప్పుడైనా కలుస్తాం'
Published Fri, May 23 2014 12:47 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement