తెలంగాణలో భూముల ధరలు పడిపోవు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత తనపై ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణ బాధ్యత తన భుజష్కందాలపై ఉందన్నారు. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరగాల్సిన అవసరముందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో భూముల ధరలు పడిపోతాయనేది వాస్తవం కాదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాల్సిన అవసరముందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రూ.1500, వితంతువులకు రూ.1000 పెన్షన్ ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తామన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, గిరిజన తండాలకు పంచాయతీ హోదా కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిమ్స్ తరహ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు 125 చదరపు గజాల స్థలంలో ఇళ్లు కట్టిస్తామని హామీయిచ్చారు.
రెండేళ్లలో 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పటిష్టమైన ప్రభుత్వముంటేనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి సాధించినప్పుడే అసలైన పండుగని కేసీఆర్ వ్యాఖ్యానించారు.