Telangana reconstruction
-
చెరువుకు చేటు.. బతుకుపై వేటు
ప్రజల చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు, జీవన విధానాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చెరువులు. తెలంగాణ చరిత్రను వేల సంవత్సరాల పాటు సజీవ ప్రవాహంగా నిలిపి ఉంచడంలో ఈ చెరువుల నిర్మాణమే కీలకం. ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన వివక్ష ఒక కారణమైతే, చెరువుల విధ్వంసం ఈ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునాదులను పెకిలించివేసింది. తెలంగాణ పునర్నిర్మాణంలో చెరువుల ప్రాధాన్యతను గుర్తించి, ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే వైపు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ చరిత్రను వేల ఏళ్లపాటు సజీవ ప్రవాహంగా నిలిపి ఉంచడంలో ఈ చెరువుల నిర్మాణమే కీలకం. ఈనాటికీ తెలంగాణ గడ్డపైన ఆ గురుతులు నిలిచి ఉన్నాయనడానికి నిర్మల్ ప్రత్యక్ష ఉదాహరణ. నిర్మల్ కోటపై నించొని పది నిమిషాలు పరికించి చూస్తే చుట్టూతా ఉన్న పదహారు గొలుసుకట్టు చెరువులు మనసుని పులకింపజేస్తాయి. తెలంగాణ రైతన్నల భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేస్తాయి. ఇప్పుడిదే చెరువుల పునర్నిర్మాణానికి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ సోమవారం (22-09- 2014) స్వయంగా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగా ణలో ఉన్న చెరువులను సర్వే చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం పని మొదలు పెట్టింది. మూడు రోజుల్లో ఈ పని పూర్తి చేయా లని కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఇది ఆహ్వానించదగ్గ పరి ణామం. ఈ సందర్భంగా మనం మన చెరువు ప్రాచీన కథను కలబోసుకుందాం. చెరువులు కేవలం వ్యవసాయ అభివృద్ధికే ప్రతీకలు కావు. అవి ప్రజల చరిత్రకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు, జీవన విధానాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు.. మానవ నాగరికతలో, పురోగతిలో చెరువుల నిర్మాణం, ఉనికి ఒక విప్లవం. ప్రజలకు చెరువులు స్థిరమైన జీవనాన్ని అందించాయి. చెరువు చుట్టూరా కులాలు ఏర్పడ్డాయి. రైతుల భూములకు నీళ్లు, కూలీలకు ఉపాధి, భూగర్భ జలాలు పెరుగుదలతో తాగునీటి కొరత లేకుండా చేసింది. అంతేకాకుండా, కుండలు చేసే కుమ్మరి వాళ్లకు ముట్టిన ఇంటి కప్పుల మీద వేసుకోవడానికి తుంగ గడ్డిని, తెనుగోళ్లకు, బెస్తవాళ్లకు చేపలను ప్రత్యక్షంగా అందించింది. ఈత, తాటిచెట్ల నుంచి పుష్కలంగా కల్లు రావడానికి భూగర్భ జలాల ద్వారా పరోక్షంగా ఉపయోగ పడుతున్నది. అంతే కాకుండా రైతుల భూముల్లో భూసారం దెబ్బతినకుండా, ఎండాకాలంలో చెరువులలోని ఒండ్రుమట్టిని చేలల్లో వేసేవాళ్లు. ఈ విధంగా చెరువులో మేట పెరగకుండా వీలయ్యేది. ఆవులు, మేకలు, గొర్లు, బర్రెలు తాగడానికి నీళ్లను చెరువు అందించేది. వాటి మేతకు గడ్డి దొరికేది. అందువల్ల గ్రామాల్లో చెరువుల పరిరక్షణ ఒక కర్తవ్యంగా ఉండేది. ఈ చెరువుల నిర్మాణంలో, నిర్వహణలో దళితులైన నీరడికాండ్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి చెరువును కాపాడిన సంఘటనలున్నాయి. చెరువులు ఉండే తూముల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించడానికి ఎటువంటి రక్షణలు లేకుండా లోతైన నీళ్లలో మునిగి వాటిని తొలగించే వాళ్లు. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగేది. అంతేకాకుండా చెరువు నీటి వాడకం కోసం గ్రామాల మధ్య జరిగే దాడుల్లో, ఘర్షణల్లో దళితులు (నీరడికాండ్లు) బలైన కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర మానాల చెరువు కోసం వెలమ, కాపుల మధ్య జరిగిన ఘర్షణల్లో కడారి జినుకన్న అనే నీరడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కథను ఇప్పటికీ జానపద కళాకారులు ప్రదర్శిస్తుంటారు. దళితులైన నీరడికాండ్ల సాంకేతిక పరిజ్ఞానంతో చెరువు ఊరందరి జీవితాలను నడిపించేది. అందువల్ల చెరువు చుట్టూరా జనజీవితం పెరిగింది. తెలంగాణ ప్రాంతంలో చెరువులకు ఎంతో చరిత్ర ఉన్నది. కాకతీయుల కాలం నుంచే చెరువులు కట్టిన దాఖలాలున్నాయి. 13వ శతాబ్దంలో ప్రసిద్ధి గాంచిన పాకాల, రామప్ప, లక్నవరం చెరువుల నిర్మాణం జరిగింది. కాకతీయ పాలకులే కాక వారి అధీనంలోనున్న సామంతులు, సైనికాధిపతులు కూడా చెరువులను నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. 14, 15 శతాబ్దాలలో జరిగిన నిరంతర యుద్ధాల కారణంగా ఆనాటి పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారు. చాలా చెరువులు ఆదరణ లేక క్షీణించాయి. మళ్లీ 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీలు అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మెరుగయ్యాయి. కొత్త చెరువుల నిర్మాణం మొదలైంది. కుతుబ్‌షాహీల కాలంలో హుస్సేన్‌సాగర్ నిర్మాణం జరిగింది. కుతుబ్‌షాహీల పాలన అంతమైన తరువాత నిజాం పాల కులు హైదరాబాద్ పగ్గాలు చేపట్టారు. నిజాం రాజుల కాలంలో సాగునీటి వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. 1987లో వరుస కరువుల నేపథ్యంలో సాగునీటి సౌకర్యాన్ని పెంచాలని నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికే మొదటి సాలార్జంగ్ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాడు. 1868లో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ బోర్డును ఏర్పరిచారు. 1878లో ఇరిగేషన్ బోర్డును ఇంజీరు ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖగా మార్చారు. ఈ శాఖ ఏర్పాటుతో ఇరిగేషన్ పనులు వేగం పుంజుకున్నాయి. మొట్టమొదట శిథిలమైన చెరువులను బాగుచేశారు. ఆ తరువాత కొత్త ఆనకట్టల నిర్మాణాలను మొదలుపెట్టారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, పోచారం ప్రాజెక్టు, పాలేరు చెరువు, నిజాంసాగర్ ప్రాజెక్టు, వైరా ప్రాజెక్టు, పెండ్రి పాకాల ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, మానేరు ప్రాజెక్టు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వంటి చెరువులను, మధ్యతరహా ప్రాజెక్టులను 1940కల్లా నిజాం ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ చర్యల ఫలితంగా నిజాం పాలనలో చెరువుల కింద ఆయకట్టు 1920 నుంచి 1945 మధ్య కాలంలో 3,44,592 ఎకరాల నుంచి 8,43,090 ఎకరాలకు పెరిగింది. ఇదే కాలంలో కాలువల కింద ఆయకట్టు 67,793 ఎకరాల నుంచి 1,30,000 ఎకరాలకు పెరిగింది. అయితే స్వాతంత్య్రానంతరం చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం అంతగా కృషి చేయలేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వందల ఏళ్లుగా నీటి వనరులను ధ్వంసం చేయడం వల్ల భయానకస్థితి ఏర్పడింది. ‘చెరువుల నీళ్లు పోయి నెరువెనక పడ్డంక ఏమి చేస్తే ఏమౌతుంది’ అనేది సామెత. ఏదైనా ఒక అవకాశం చేజారిపోతే ఈ సామెత చెప్పడం తెలంగాణలో అలవాటు. కానీ నిజానికి ఈ సామెత ప్రత్యక్షంగానే అతికింది. ఈ రోజు తెలంగాణలో చెరువులన్నీ కట్టలు తెగి, మేటలతో పూడకపోయి, తుమ్మచెట్లు మొలిచి చెరువులు ఎక్కడ ఉన్నాయో కనిపించని స్థితి ఏర్పడింది. ఇంకా కొన్నిచోట్ల స్థానిక ప్రజల అవసరాల కోసం కాకుండా, దగ్గరున్న పట్టణాల, నగరాల దాహాన్ని తీర్చడం కోసం తరలిస్తు న్నారు. దీని ఫలితంగా 1968 సంవత్సరంలో రాష్ట్రం మొత్తం మీద 10.70 లక్షల హెక్టార్ల సాగుతో 36 శాతం నీటిపారుదల అవసరాలను తీర్చిన చెరువులు 1998 వచ్చేసరికి 7.20 లక్షల హెక్టార్లతో కేవలం 17 శాతం నీటి పారుదల అవసరాల స్థాయికి పడిపోయాయి. దీన్ని బట్టి చెరువుల విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. అయితే ఈ చెరువుల వినాశనం కోస్తాంధ్రకన్నా తెలంగాణను ఎక్కువ దెబ్బతీసింది. 1950 ప్రాంతంలో తెలంగాణ 11 లక్షల హెక్టార్ల భూమి చెరువుల ద్వారా సాగయితే ప్రస్తుతం అది 5 లక్షల 42 వేల 620 హెక్టార్లకు పడిపోయింది. కోస్తాంధ్ర ప్రాంతంలో కాలువల ద్వారా ఆ లోటు తీరింది కానీ, తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరగక దాని నష్టం ఈనాటి పరిస్థితికి కారణమైంది. ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన వివక్ష ఒక కారణమైతే, చెరువుల విధ్వంసం ఈ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునాదులను పెకిలించివేసింది. నిజానికి చెరువుల వినాశనం జనజీవనాన్ని అధఃపాతాళానికి తోసింది. ఇటు వంటి చెరువుల విధ్వంసం కథలు ఊరూరా వినిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల చెరువుల పునరుద్ధరణ ముందుకొచ్చింది. నిజానికి తెలంగాణ ప్రగతి, పరమార్థం చెరువుల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఊరూరా ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన చెరువును మనం పునర్జీవింపజేసుకుందాం. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) -మల్లెపల్లి లక్ష్మయ్య -
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
ఇల్లెందు: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఇల్లెందులో జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం పాతబస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలు ఆంధ్రలో కలపడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు . టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేస్తోందన్నారు. త్వరలో జరగబోవు క్యాబినెట్ సమావేశంలో రూ.18 వేల కోట్లతో 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు. జేకే 5 నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన మైన్స్ ఏర్పాటు కృషిచే స్తానన్నారు. ప్యాసింజర్ ైరె లు పునరుద్ధరణకు ఎంపీ సీతారాంనాయక్ కేంద్ర రైల్వేమంత్రితో మాట్లాడరని, త్వరలో రైలు సేవలు అందుబాలులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ ఊకె అబ్బయ్య, కౌన్సిలర్లు జానిపాషా, సామల రాథశ్రీ, ఎర్రోళ్ల తులసీరామ్గౌడ్, నా యకులు దేవిలాల్నాయక్, ఖమ్మంపాటి కోటేశ్వరరావు, నవీన్, సత్యనారయణ, కృష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా జగదాంబసెంటర్‌లో శ్రీ షిరిడీసాయి మందిరంలో నిర్వహించిన గురుపౌర్ణమి పూజా కార్యక్రమంలో పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్ణాహుతితో ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. సాయిబాబా ఊరేగింపు రథాన్ని పద్మ ప్రారంభించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లికార్జున్, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక కేఎన్ఎస్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను నాయకులు పూలమాల, శాలువలతో ఘనంగా సత్కరించారు. -
తెలంగాణ అస్థిత్వాన్ని అణగదొక్కారు
తెయూ(డిచ్పల్లి) : సమైక్యవాద పాలకులు తెలంగాణ అస్థిత్వాన్ని అణగదొక్కారని, తెలంగాణ విషయంలో చరిత్రలో చాలా తప్పులు జరిగాయని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఐసీఎస్ఎస్ఆర్, తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో ‘సామాజిక శాస్త్రాలు- ఈనాటి స్థితి’ (స్టేటస్ ఆఫ్ సోషల్ సెన్సైస్)’ అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సు రెండో రోజు సమావేశంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రసంగించారు. సామాజిక శాస్త్రవేత్తలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలపై తప్పులు దొర్లకుండా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజిక శాస్త్రాల పరిశోధనల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. సామాజిక శాస్త్రవేత్తలపై ఈ అంశంలో గురుతర బాధ్యత ఉందన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు. ఈ హామీల అమలు ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పోరాట చరిత్ర, నిజాం రాజుల పాలన, సమ్మక్క-సారక్కల చరిత్ర భావితరాలకు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వలసలు, వ్యవసా యం, చ రిత్ర, సామాజిక , ఆర్థిక పరిస్థితులపై సమగ్రమైన పరిశోధనలు మరింత లోతుగా జరుపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. -
కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం
జహీరాబాద్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యపడుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని సుభాష్ గంజ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కూడా తమ పార్టీదేనన్నారు. అనుభవం ఉన్న పార్టీకి పట్టం కట్టడం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయా రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చి ఆ తర్వాత మాట మార్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ద్వారా సీమాంధ్రలో నష్టం జరిగిందన్నారు. అయినా సోనియాగాంధీ లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులతో వచ్చి సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామనని చెప్పిన కేసీఆర్ హైదరాబాద్‌కు రాగానే మాట మార్చారని విమర్శించారు. ఆయనను 1 సీఆర్, 2 సీఆర్ 3 సీఆర్ = కేసీఆర్‌గా అభివర్ణించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో తమ పార్టీలోనే ఉండేవారన్నారు. మామ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన అనంతరం పరిస్థితిని చూసి అక్కడకు వెళ్లాడని, ఆ తర్వాత మామ వద్ద నుంచి అధికారాన్ని చేజిక్కించుకుని ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్తో పొత్తు కూడా పెట్టుకున్నారన్నారు. ఇప్పుడు బీజేపీతో జతకట్టారని, మోడీ జపం చేస్తున్నారని విమర్శించారు. ఇక నరేంద్ర మోడి మోసం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ప్రపంచంలో అబద్దాలు చెప్పే వారిలో మోడీ నంబర్‌వన్ స్థానంలో ఉంటాడని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను 10 స్టార్ అని విమర్శించారు. ఆయన ఫాంహౌస్‌లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తనిఖీల్లో లభ్యమైన నగదు : రూ.3.29 కోట్లు అక్రమ మద్యం కేసులు : 1,177 ఓటర్లకు ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘన ఘటనలు : 116 అనుమతి లేని ప్రచారాలు, ప్రదర్శనలపై కేసులు : 59 -
తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యం
అనంతగిరి, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో త్రీడీషో ద్వారా ఆయన ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడిన ఆయన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎలా మోసపోయారనే విషయాన్ని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలనుకుంటే, మంచి పరిపాలన కావాలంటే ప్రజలంతా టీఆర్ఎస్కు అధికారం ఇవ్వాలన్నారు. రాజకీయ అవినీతిని పాతాళంలోకి తొక్కాలన్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్ష నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి సంజీవరావు మాట్లాడుతూ.. నేడు ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పైలట్ రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శుభప్రద్ పటేల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణయ్య, విజయ్‌కుమార్, ఎల్లారెడ్డి, రాంచందర్ రెడ్డి, మున్వర్ షరీఫ్, ముత్తాహర్ షరీఫ్, శంకర్‌చ మహేందర్‌రెడ్డి, రాంరెడ్డి, కిశోర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
దేవరకొండ, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకసారి టీడీపీలో, మరోసారి కాంగ్రెస్‌లో ఎంపీగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాదన్నారు. కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే టీఆర్ఎస్ ఊరుకునే స్థితిలో లేదని హెచ్చరించా రు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కేతావత్ లాలునాయక్ గాజుల ఆంజనేయులు, ఏ.వి.రెడ్డి, సపావట్ నిరంజన్‌నాయక్, రాంబాబునాయక్ తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ సాధ్యం
పాలకుర్తి టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన టీఆర్ఎస్తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది.. కేసీఆర్‌తోనే బంగారు తెలంగా ణ కల సాకారమవుతుందని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు నామినేషన్ వేసే సందర్భా న్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీహరి మాట్లాడారు. కేసీఆర్ పోరా టం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. చంద్రబాబు అడుగులకు ముడగులొత్తుతున్న తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్‌రావును పాల కుర్తి సోమన్న సాక్షిగా డిపాడిట్ రాకుండా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1969, 2004లో జరిగిన ఉద్యమంలో 1200 మంది అమరుల ఆత్మబాలిదానాలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే పొన్నాల లక్ష్మయ్య అమెరికా పారిపోయాడని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పునర్మిర్మాణంతో పాటు జిల్లా, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. నా హయాంలోనే అభివృద్ధి జరిగింది : సుధాకర్‌రావు నియోజకవర్గంలో తన హయంలోనే అభివృద్ధి జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు అన్నారు. తన తండ్రి యతి రాజారావు, తల్లి విమలాదేవి 40 ఏళ్లు ప్రజలకు సేవా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ద్రోహులకు పాలకుర్తిలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి, దుగ్యాలను డిపాటిట్ రాకుండా ఓడించి నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాల ని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీ గా కడియం శ్రీహరిని గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. సమావేశంలో నియోజకవర్గం లోని అన్ని మండలాల జెడ్పీటీసీ అభ్యర్థులు, మాడ్గుల నట్వర్, దైద ప్రియాంక, చిలుక దేవేంద్ర, జాటోతు కమలాకర్, చిర్ర ఉపేంద్ర, అల్లంనేని కమలాకర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ముస్కు రాంబాబు, మూల వెంకటేశ్వర్లు, మొల్గూరి రమేష్, పాలకుర్తి యాదగిరి రావు, కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, తాళ్లపెల్లి నర్సయ్య, పుస్కూరి శ్రీనివాస్‌రావు, ఎండీ.అప్రోజ్, ముత్తినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అమరుల త్యాగం వృథా కారాదు
తెలంగాణ పోరుబాటలో ప్రాణార్పణ చేసింది బడుగు, బలహీనులేనని.. అయితే ఆ శక్తులన్నీ ఐక్యం కాలేకపోయాయని విప్లవకవి వరవరరావు అభిప్రాయపడ్డారు. త్యాగాలు చేసిన వాళ్లంతా ఒకే తాటిపైకి రాలేకపోవడంతో ఒక్కో ఉద్యమ కెరటం ఒక్కో పార్టీ పక్షానికి వెళ్లిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ప్రశాంతంగానే వచ్చిందని పాలకులు చెబుతున్నా.. వందలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటే అది ప్రశాంతత ఎలా అవుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అమరుల త్యాగఫలం వృథా కాకూడదని, వారి ఆలోచనల్లోంచే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. కొత్త రాష్ట్రాల నవ నిర్మాణంపై ప్రజలకు పెద్దగా ఆశలున్నాయని అనుకోవడం లేదు. ప్రజాస్వామ్య హక్కుల గురించే మాట్లాడని పార్టీలు, వాటి పరిరక్షణకు హామీలివ్వని నేతలు నవ నిర్మాణం ఎలా చేస్తాయి? పార్టీలన్నీ సామ్రాజ్య శక్తుల గిరిదాటి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి, కొత్త రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమాలు తప్పవు. నిజానికి జనశక్తి, మావోయిస్టుల ఐక్యఫ్రంట్ 1997లోనే భూ సంస్కరణల అమలుకు పట్టుబట్టాయి. ఎక్కడెక్కడ మిగులు భూమి ఉందనే జాబితాలు ఇచ్చాయి. 2004 చర్చల సందర్భానూ ఇదే ప్రధానాంశమైంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే కోనేరు రంగారావు కమిటీని వేశారు. అది కొన్ని సూచనలు చేసినా అమలుకు నోచుకోలేదు. చంద్రబాబు తప్పిదాల వల్ల బలహీనవర్గాల భూములన్నీ బడా కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. కొత్త రాష్ట్రాలు ఎన్ని వచ్చినా భూమి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. చంద్రబాబే దోపిడీదారు చంద్రబాబు పేదలు, అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ శత్రువే. పెట్టుబడిదారీ విధానాలకు బీజం వేసిందే ఆయన. ప్రపంచ బ్యాంకుకు అమ్ముడు పోయి వాళ్ల ఆలోచనలను అమలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుకున్నట్టే వైస్రాయి కుట్రను అమలు చేశారు. దీనివెనుక పెట్టుబడిదారీ శక్తుల హస్తం కూడా ఉంది. ఆయన సీఎంగా అసెంబ్లీలో ‘దీన్ని ప్రపంచ బ్యాంకు ఒప్పుకోదు’ అని నిర్లజ్జగా చెప్పారు. ప్రజల కోసమేనని చెప్పే నేత ఈ మాట అనొచ్చా. ఆయన ప్రపంచబ్యాంకు ఏజెంట్ అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకెందుకు? ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నప్పుడు జనం పెద్ద ఎత్తున ఉద్యమించారు. పరిశ్రమలు మూసివేస్తుంటే శ్రామిక వర్గం తిరగబడింది. అయినా ఆయన పట్టించుకోలేదు. ఉద్యమకారులపై నిర్బంధం అమలు చేశాడు. తుపాకులు ఎక్కుపెట్టాడు. ఇది చరిత్ర. సామాజ్య్రవాద కుట్రకు సాక్ష్యం. తాళిపుస్తెలు తెగుతున్న మహిళలు సారా వద్దు మొర్రో అంటే, నిషేధం ఎత్తివేయలేదా? సబ్సిడీలు రద్దు చేయలేదా? సబ్సిడీ బియ్యం రేటు పెంచలేదా? ఇదంతా ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు కాదా? ఇలాంటి చరిత్ర ఉన్న బాబు ఇప్పుడు మారాననడం హాస్యాస్పదం. కేసీఆర్ ఇస్తామంటున్నారా? ఇంటికి నాలుగెకరాల భూమి ఇస్తామంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటల్లో విశ్వసనీయత ఎంత? వాళ్ల భూములు వాళ్లకే కొనిస్తామంటున్నారు? ఇది ఎంతమాత్రం పరిష్కారం కాదు. దగాపడ్డ తెలంగాణలో దళితులు, బడుగు జీవులదే ప్రధాన పాత్ర. ఆ వర్గానికి కేసీఆర్ ఏం చేస్తారో చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రతిఘటన తప్పదు. హక్కులు, కనీస అవసరాల కోసం సాగే ఉద్యమాన్ని వాగ్దానాలతో ఆపడం ఎంతమాత్రం సాధ్యం కాదు. పరిశ్రమల ఏర్పాటును ఏ ఉద్యమ పార్టీలు, సంఘాలు అడ్డుకోవు. కాకపోతే వారి ప్రయోజనాలను దెబ్బతీస్తూ, పెట్టుబడిదారీవర్గ ప్రయోజనాలు కాపాడే చర్యలకే వ్యతిరేకం. జనం కోరుకునేదేంటి? ప్రాంతీయ వాదాలు వేరుకావచ్చు. ఆలోచన ధోరణులు భిన్నంగా ఉండొచ్చు. కానీ రెండు ప్రాంతాల ప్రజలు స్వావలంబన, స్వపరిపాలన ఆశిస్తున్నారు. అభివృద్ధే ఎజెండా అంటున్న ఏ పార్టీనీ వాళ్లు నమ్మడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా మేనిఫెస్టోలు రావడం లేదు. హైటెక్ సిటీ కడితేనే అభివృద్ధి జరిగిపోలేదు. 90 శాతం మంది ప్రజల దారిద్య్రం పోలేదు. విద్య, వైద్యం, ఉపాధి, కూడు, గుడ్డ అడుగుతున్నారు. కానీ వీటిని అందిస్తామని పార్టీలు భరోసా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో నవ నిర్మాణం ఎలా సాధ్యం. ఎన్నికల మ్యానిఫెస్టోలు రూపొందించేప్పుడు ఒక్కసారి ప్రజల దగ్గరకు వెళ్లాలి. వాళ్లకు కావాల్సింది ఏమిటో వాళ్లనే అడగాలి. అప్పుల కోసం విదేశీ బ్యాంకులను ఆశ్రయించనక్కర్లేదు. ప్రజల కోసమే ప్రభుత్వాలు అప్పులు చేయాల్సి వస్తే వాటిని ప్రజలే అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. డబ్బుల కన్నా మించిన శ్రమశక్తి వాళ్ల దగ్గరుంది. వాళ్లకు మేలు జరుగుతుందనే భరోసా ఇస్తే ఎందుకు ఇవ్వరు? కానీ నేతలు అలా ఆలోచించడం లేదు. కావల్సింది ఇదే... ఆంక్షలు లేని... నిర్బంధం లేని... నిషేధాలు లేని రాష్ట్రాలు కావాలి. ప్రజావసరాలే ఎజెండాగా పనిచేసే ప్రభుత్వాలు కావాలి. ఆ పరిస్థితి వచ్చే వరకూ ప్రజా పోరాటాలకు విశ్రాంతి ఉండదు. జన తెలంగాణ యువతకు ప్రోత్సాహం ... నవ తెలంగాణ నిర్మాణంలో యువత కీలక పాత్ర నిర్వహించాలి. మనకేం లాభమన్న దృష్టితో కాకుండా యువత కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా పనిచేయాలి. వనరులను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమలను నెలకొల్పే దిశగా యువతను ప్రోత్సహించాలి. అన్ని రంగాల్లో నీతి, నిజాయితీ గల వారిని నియమించాలి. వెలుగులు విరజిమ్మే నవ తెలంగాణను నిర్మించాలి. - ఎండీ. అజీమొద్దీన్, లక్ష్మీనగర్, గోదావరిఖని, కరీంనగర్ జిల్లా ఆకుపచ్చ తెలంగాణ కావాలి.... అరవైఏళ్ల కల నెరవేరింది. అమరవీరుల త్యాగం ఫలించింది. ఇక జరగాల్సింది నవ తెలంగాణ నిర్మాణమే. ఆధిపత్య భావజాలం లేని సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలి. తెలంగాణ రైతాంగం పూర్తిగా బోర్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల విద్యుత్ కోసం ఇక్కట్లు పడుతున్నారు. ఖర్చు కూడా అధికమే. ఈ పరిస్థితిని అధిగమించాలంటే కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా 700 టీఎంసీలను సాధించి కోటి ఎకరాలకు సాగునీరందించాలి. గిట్టుబాటు ధర కల్పించి ఆత్మహత్యలను నిరోధించాలి. చెరువులను తవ్వించి ఆకుపచ్చ తెలంగాణ నిర్మించాలి. అత్యుత్తమ విద్య వైద్య అవకాశాలను కల్పించాలి. ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలను పాఠ్యాంశాలుగా చేర్చాలి. - కలకొండ నరేష్కుమార్, టీచర్, పరకాల 20 జిల్లాలుండాలి... అమరుల త్యాగాలు, ఉద్యోగుల పోరాటాలు, సకల జనుల సమ్మె, కోట్లాది ప్రజల ఉద్యమాల ఫలంగా తెలంగాణ ఏర్పడింది. జూన్2న ఏర్పడుతున్న కొత్త తెలంగాణలో పరిపాలన ప్రజలకు చేరువగా సాగాలి. అందుకు జిల్లాల సంఖ్య పెరగాలి. కనీసం 20 జిల్లాలుండాలి. పెద్ద జిల్లాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు నియోజకవర్గాలు దూరంగా ఉంటాయి. దూరభారాన్ని తీర్చేందుకు బెల్లంపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఈ మేరకు గవర్నర్‌తో సహా అందరికీ ఇక్కడి ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. - కోలిపాక శ్రీనివాస్, పద్మశాలివీధి, బెల్లంపల్లి -
కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి
మెదక్ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయం వద్ద మున్సిపల్ వార్డు సభ్యులకు సంబందించి 9 మంది అభ్యర్థుల పేర్లను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ పట్టణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారన్నారు. పట్టణాభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. 13 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను భరించి కేసీఆర్ ఢిల్లీ పెద్దలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించారని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త రాగి అశోక్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం పట్టణంలోని 9వ వార్డులకు సంబంధించి పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డులో శ్రీధర్‌యాదవ్, 2వ వార్డులో రాగి అశోక్, 3వ వార్డులో జెల్ల గాయత్రి సుధాకర్, 4వ వార్డులో సలాం, 5వ వార్డులో మెంగని విజయలక్ష్మి, 8వ వార్డులో మాయ మల్లేశం, 12వ వార్డులో మోచి కిషన్, 18వ వార్డులో ఏ.కృష్ణారెడ్డి, 26వ వార్డులో రెహనా బేగంను ప్రకటించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం. దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య శ్రీనివాస్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కిష్టాగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గంగాధర్, జీవన్, శ్రీకాంత్, ముకుందం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జోగు రామన్న అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో ఎదుట జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ముగిశాయి. ఎట్టకేలకు తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అపాయింటెడ్ డేను ప్రకటించడంతో దీక్షలు విరమించారు. జేఏసీ జిల్లా అధికార ప్రతినిధి కారింగుల దామోదర్ నేతృత్వంలో చేపట్టిన దీక్షలు గురువారానికి 1523 రోజులకు చేరాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రామన్న దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చారు. అంతకుముందు జేఏసీ నాయకులు అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం ఒక్కటై పోరాటం చేయడం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చిందన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాలయులు, కార్మికులు, కులసంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమించాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జేఏసీ అధికార ప్రతినిధి కారింగుల దామోదర్ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు వృథా కాలేదని, పోరాడి తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దీక్షలు విరమించలేదన్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం అపాయింటెడ్ డేను జూన్ 2గా ప్రకటించడంతో దీక్షలు విరమించామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమరెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి.రవీంద్ర, సాెహ బ్రావు పవార్, జాదవ్ కిరణ్‌కుమార్, బీజేపీ నాయకలు దుర్గం రాజేశ్వర్, పాయల్ శంకర్, మడావి రాజు, సురేష్ జోషి, టీఆర్ఎస్ నాయకులు గంగరెడ్డి, గంగన్న, అనంద్, బాలశంకర్ కృష్ణ, గోలి శంకర్, ప్రశాంత్, బండారి సతీష్, రంగినేని శ్రీనివాస్, కస్తాల ప్రేమల, అంజలి, త్రిశూల, అనుసూయ, సురేఖ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో తెలంగాణ పునర్నిర్మాణం అంశంపై యువకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ బిల్లుపెడితే బీజేపీ మద్దతిచ్చిందన్నారు. పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు నానా తంటాలు పడిన చంద్రబాబు.. ఇప్పుడు తాము లేఖ ఇవ్వటం వల్లే తెలంగాణ వచ్చిందటం హాస్యాస్పదమన్నారు. దశాబ్దాలపాటు వెనకబాటుకు గురైన తెలంగాణకు ప్యాకేజి ఇవ్వాలన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినంతనే పోరా టం ఆగదని, ఈ ప్రాంత అభివృద్ది కోసం మరి న్ని పోరాటాలు అవసరమన్నారు. కార్యక్రమం లో ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ రౌతు కనకయ్య, పరిగి సర్పంచ్ విజయమాల, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబాయ్య, మాజీ ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సురేందర్, పరిగి, కుల్కచర్ల మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పరిగి పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి సునంద బుగ్గన్నయాదవ్, నాయకులు అనూష, రాములు, సురేష్, రాంచంద్రయ్య పాల్గొన్నా రు. అనంతరం కుల్కచర్ల మండల పరిధిలోని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వీరిలో టీడీపీ కుల్కచర్ల మం డల అధ్యక్షుడు శివరాజ్ తదితరులు న్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్‌లో చైర్మన్ స్థానాన్ని సాధించి సత్తా చాటాలని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో గురువారం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కనకయ్య, నాయ కులు కృష్ణయ్య, యాదగిరి యాదవ్, శంకర్, సత్యనారాయణరెడ్డి, వేమారెడ్డి తదితరులు న్నారు. టీఆర్ఎస్ కండువాతో శుభప్రద్ పటేల్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్ ఈ సమావేశంలో గులాబీ కండువాతో కనిపించడం చర్చంనీయాంశమైంది, వికారాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్ఎస్నుంచి శుభప్రద్ పోటీ చేస్తున్నారన్న గుసగుసలు వినపించాయి. -
పునర్నిర్మాణంలో పీఆర్టీయూ కీలకపాత్ర
కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పీఆర్టీయూ ఉపాధ్యాయులు క్రియాశీల పాత్ర పోషించారని, రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ముందుంటారని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. మంగళవారం కామారెడ్డిలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రవీంద ర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్నారు. తెలంగాణకు 60 శా తం విద్యుత్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ...సకలజనుల సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించి వేతనాలు ఇప్పించడంలో పీఆర్టీయూ కృషి ఉందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి కృషి జరగాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్, శంక ర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, తాడ్వాయి శ్రీని వాస్, గోవర్ధన్, రవీందర్‌శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణతల్లి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఆచార్య జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. -
తెలంగాణలో భూముల ధరలు పడిపోవు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత తనపై ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణ బాధ్యత తన భుజష్కందాలపై ఉందన్నారు. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరగాల్సిన అవసరముందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో భూముల ధరలు పడిపోతాయనేది వాస్తవం కాదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాల్సిన అవసరముందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రూ.1500, వితంతువులకు రూ.1000 పెన్షన్ ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తామన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, గిరిజన తండాలకు పంచాయతీ హోదా కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిమ్స్ తరహ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు 125 చదరపు గజాల స్థలంలో ఇళ్లు కట్టిస్తామని హామీయిచ్చారు. రెండేళ్లలో 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పటిష్టమైన ప్రభుత్వముంటేనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి సాధించినప్పుడే అసలైన పండుగని కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
ఎర్రదండు గర్జన
ఖమ్మం/ ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణం..జిల్లా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కదంతొక్కింది. పోరుగర్జన పేరిట ఖమ్మంలో బుధవారం భారీ ప్రదర్శన, బహిరంగసభ నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలివచ్చారు. తమ సమస్యలపై గర్జించారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. పలు రకాల డిమాండ్లను సభ ముందు ఉంచారు. ఆంక్షలు లేని ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు, ముంపు ప్రాంతాలను తెలంగాణ నుంచి విడదీయరాదు, పోడు భూములకు పట్టాలివ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, గ్రీన్‌హంట్ ఆపరేషన్లు నిలిపివేయాలి, తెలంగాణ ఉద్యమ వీరుల విగ్రహాలను హైదరాబాద్, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి, ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలి...మొత్తం 28 డిమాండ్లను పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు సభ ముందుంచారు. వీటికి సభ ఆమోదం తెలిపింది. జిల్లాలోని గిరిజనులు, ఇతర అట్టడుగు వర్గాలకు ప్రత్యేక తెలంగాణ ఫలాలు అందినప్పుడే ఆరు దశాబ్దాల కల సాకారమైనట్టని సభకు ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా ప్రజలు, ఉద్యమకారులు చూపిన పోరాట పటిమ చిరస్మరనీయమన్నారు. వేలాదిమంది తెలంగాణ అమరుల త్యాగాల ఫలమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. రాష్ట్రం వస్తుందనే సంతోషం ఉన్నా.. జిల్లాలోని గిరిజనులు, కొండరెడ్లు, కోయ, ఇతర ఆదివాసీలు, వారి సంస్కృతి జలసమాధి అవుతుందనే బాధ వెంటాడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినంత మాత్రాన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని దేవత అని సంబోధించడం సరికాదన్నారు. 60 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు జంకి జంకి రాష్ట్రం ఇచ్చారన్నారు. భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన జిల్లాలో సమస్యలు తీరవని, వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాల్సిందే అన్నారు. పోలవరం ముంపు, సింగరేణి ఓపెన్‌కాస్టుల విధ్వంసం, టేల్పాండ్ భూముల నష్టం...తదితర అంశాలు మనముందు శాపాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజన, మైనింగ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉపాధి మార్గాలు చూపడం వంటి లక్ష్యాలు మనముందున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ అన్నారు. అంగన్వాడీలు, బీడీ, పారిశుధ్య మహిళా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు పోరుపథంలో నడిచి తెలంగాణ ఉద్యమానికి శక్తిని ఇచ్చారని ఆమె అన్నారు. ఈ సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పంజాబ్ నాయకులు ఎస్ఎస్ మాల్, రాష్ట్ర నాయకులు గాదె దివాకర్, బలచంద్ర సంగిడి, కెచ్చెల రంగయ్య, గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్, జేఏసీ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, వెంకటపతిరాజు, కూరపాటి రంగరాజు, బిచ్చాల తిరుమలరావు, ఖాజామియా, అరుణోదయ కళాకారులు నాగన్న, రామారావు, సురేష్, ఎన్డీ నాయకులు చంద్ర అరుణ, జగ్గన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అశోక్, పీవైఎల్ నాయకులు పుల్లయ్య, మాదా భిక్షం, చిల్లగుండ నాగేశ్వరరావు, ఆవులు వెంకటేశ్వర్లు, చలపతి పాల్గొన్నారు. -
‘తెలంగాణ పునర్నిర్మాణం’ సదస్సును జయప్రదం చేయండి
ఖమ్మం మామిళ్లగూడెం,న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణంపై నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్లో జరుగనున్న సదస్సును జయప్రదం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ కోరారు. ఆదివారం ఖమ్మంనగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పురిటిగడ్డ ఖమ్మం ఖిల్లా అని, 2009లో తెలంగాణ రాష్ట్ర సాదనకు కేసీఆర్ కరీంనగర్లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి ఆయన్ని ఖమ్మం తీసుకువచ్చారని, అది చారిత్రక దినంగా పాటిస్తున్నామని అన్నారు. 60 సంవత్సరాల ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువచ్చి తెలంగాణ సాధించారని అన్నారు. నేడు జరుగనున్న సదస్సుకు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, టీజీవో రాష్ట కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఖాజామీయా పాల్గొంటారని తెలిపారు. పద్మావతి, పమ్మి కళాబృందాల ఆధ్వర్యంలో ధూంధాం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండీ అబ్దుల్ నబి, పాలేరు ఇన్చార్జ్ బత్తుల సోమయ్య, నాయకులు ఎస్‌యూ బేగ్, డోకుపర్తి సుబ్బారావు, నందిగాం రాజ్‌కుమార్, రయిస్ అన్వర్, రడం సురేష్ గౌడ్, పమ్మిరవి, రవికాంత్, శంకర్రావు, కాసాని నాగేశ్వరరావు, పగడాల నరేందర్ పాల్గొన్నారు.