చెరువుకు చేటు.. బతుకుపై వేటు | Survival on the fire disaster to the pond | Sakshi
Sakshi News home page

చెరువుకు చేటు.. బతుకుపై వేటు

Published Sat, Sep 20 2014 11:44 PM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

చెరువుకు చేటు.. బతుకుపై వేటు - Sakshi

చెరువుకు చేటు.. బతుకుపై వేటు

ప్రజల చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు, జీవన విధానాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చెరువులు. తెలంగాణ చరిత్రను వేల సంవత్సరాల పాటు సజీవ ప్రవాహంగా నిలిపి ఉంచడంలో ఈ చెరువుల నిర్మాణమే కీలకం. ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన వివక్ష ఒక కారణమైతే, చెరువుల విధ్వంసం ఈ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునాదులను పెకిలించివేసింది.     
 
తెలంగాణ పునర్నిర్మాణంలో చెరువుల ప్రాధాన్యతను గుర్తించి, ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే వైపు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ చరిత్రను వేల ఏళ్లపాటు సజీవ ప్రవాహంగా నిలిపి ఉంచడంలో ఈ చెరువుల నిర్మాణమే కీలకం. ఈనాటికీ తెలంగాణ గడ్డపైన ఆ గురుతులు నిలిచి ఉన్నాయనడానికి నిర్మల్ ప్రత్యక్ష ఉదాహరణ. నిర్మల్ కోటపై నించొని పది నిమిషాలు పరికించి చూస్తే చుట్టూతా ఉన్న పదహారు గొలుసుకట్టు చెరువులు మనసుని పులకింపజేస్తాయి. తెలంగాణ రైతన్నల భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేస్తాయి. ఇప్పుడిదే చెరువుల పునర్నిర్మాణానికి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ సోమవారం (22-09- 2014) స్వయంగా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగా ణలో ఉన్న చెరువులను సర్వే చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం పని మొదలు పెట్టింది. మూడు రోజుల్లో ఈ పని పూర్తి చేయా లని కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఇది ఆహ్వానించదగ్గ పరి ణామం. ఈ సందర్భంగా మనం మన చెరువు ప్రాచీన కథను కలబోసుకుందాం.

చెరువులు కేవలం వ్యవసాయ అభివృద్ధికే ప్రతీకలు కావు. అవి ప్రజల చరిత్రకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు, జీవన విధానాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు.. మానవ నాగరికతలో, పురోగతిలో చెరువుల నిర్మాణం, ఉనికి ఒక విప్లవం. ప్రజలకు చెరువులు స్థిరమైన జీవనాన్ని అందించాయి. చెరువు చుట్టూరా కులాలు ఏర్పడ్డాయి. రైతుల భూములకు నీళ్లు, కూలీలకు ఉపాధి, భూగర్భ జలాలు పెరుగుదలతో తాగునీటి కొరత లేకుండా చేసింది. అంతేకాకుండా, కుండలు చేసే కుమ్మరి వాళ్లకు ముట్టిన ఇంటి కప్పుల మీద వేసుకోవడానికి తుంగ గడ్డిని, తెనుగోళ్లకు, బెస్తవాళ్లకు చేపలను ప్రత్యక్షంగా అందించింది. ఈత, తాటిచెట్ల నుంచి పుష్కలంగా కల్లు రావడానికి భూగర్భ జలాల ద్వారా పరోక్షంగా ఉపయోగ పడుతున్నది. అంతే కాకుండా రైతుల భూముల్లో భూసారం దెబ్బతినకుండా, ఎండాకాలంలో చెరువులలోని ఒండ్రుమట్టిని చేలల్లో వేసేవాళ్లు. ఈ విధంగా చెరువులో మేట పెరగకుండా వీలయ్యేది. ఆవులు, మేకలు, గొర్లు, బర్రెలు తాగడానికి నీళ్లను చెరువు అందించేది. వాటి మేతకు గడ్డి దొరికేది. అందువల్ల గ్రామాల్లో చెరువుల పరిరక్షణ ఒక కర్తవ్యంగా ఉండేది.

ఈ చెరువుల నిర్మాణంలో, నిర్వహణలో దళితులైన నీరడికాండ్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి చెరువును కాపాడిన సంఘటనలున్నాయి. చెరువులు ఉండే తూముల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించడానికి ఎటువంటి రక్షణలు లేకుండా లోతైన నీళ్లలో మునిగి వాటిని తొలగించే వాళ్లు. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగేది. అంతేకాకుండా చెరువు నీటి వాడకం కోసం గ్రామాల మధ్య జరిగే దాడుల్లో, ఘర్షణల్లో దళితులు (నీరడికాండ్లు) బలైన కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర మానాల చెరువు కోసం వెలమ, కాపుల మధ్య జరిగిన ఘర్షణల్లో కడారి జినుకన్న అనే నీరడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కథను ఇప్పటికీ జానపద కళాకారులు ప్రదర్శిస్తుంటారు. దళితులైన నీరడికాండ్ల సాంకేతిక పరిజ్ఞానంతో చెరువు ఊరందరి జీవితాలను నడిపించేది. అందువల్ల చెరువు చుట్టూరా జనజీవితం పెరిగింది.

తెలంగాణ ప్రాంతంలో చెరువులకు ఎంతో చరిత్ర ఉన్నది. కాకతీయుల కాలం నుంచే చెరువులు కట్టిన దాఖలాలున్నాయి. 13వ శతాబ్దంలో ప్రసిద్ధి గాంచిన పాకాల, రామప్ప, లక్నవరం చెరువుల నిర్మాణం జరిగింది. కాకతీయ పాలకులే కాక వారి అధీనంలోనున్న సామంతులు, సైనికాధిపతులు కూడా చెరువులను నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. 14, 15 శతాబ్దాలలో జరిగిన నిరంతర యుద్ధాల కారణంగా ఆనాటి పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారు. చాలా చెరువులు ఆదరణ లేక క్షీణించాయి. మళ్లీ 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీలు అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మెరుగయ్యాయి. కొత్త చెరువుల నిర్మాణం మొదలైంది. కుతుబ్‌షాహీల కాలంలో హుస్సేన్‌సాగర్ నిర్మాణం జరిగింది. కుతుబ్‌షాహీల పాలన అంతమైన తరువాత నిజాం పాల కులు హైదరాబాద్ పగ్గాలు చేపట్టారు. నిజాం రాజుల కాలంలో సాగునీటి వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది.

1987లో వరుస కరువుల నేపథ్యంలో సాగునీటి సౌకర్యాన్ని పెంచాలని నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికే మొదటి సాలార్‌జంగ్ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాడు. 1868లో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ బోర్డును ఏర్పరిచారు. 1878లో ఇరిగేషన్ బోర్డును ఇంజీరు ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖగా మార్చారు. ఈ శాఖ ఏర్పాటుతో ఇరిగేషన్ పనులు వేగం పుంజుకున్నాయి. మొట్టమొదట శిథిలమైన చెరువులను బాగుచేశారు. ఆ తరువాత కొత్త ఆనకట్టల నిర్మాణాలను మొదలుపెట్టారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, పోచారం ప్రాజెక్టు, పాలేరు చెరువు, నిజాంసాగర్ ప్రాజెక్టు, వైరా ప్రాజెక్టు, పెండ్రి పాకాల ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, మానేరు ప్రాజెక్టు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వంటి చెరువులను, మధ్యతరహా ప్రాజెక్టులను 1940కల్లా నిజాం ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ చర్యల ఫలితంగా నిజాం పాలనలో చెరువుల కింద ఆయకట్టు 1920 నుంచి 1945 మధ్య కాలంలో 3,44,592 ఎకరాల నుంచి 8,43,090 ఎకరాలకు పెరిగింది. ఇదే కాలంలో కాలువల కింద ఆయకట్టు 67,793 ఎకరాల నుంచి 1,30,000 ఎకరాలకు పెరిగింది. అయితే స్వాతంత్య్రానంతరం చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం అంతగా కృషి చేయలేదు.

ముఖ్యంగా ఈ ప్రాంతంలో వందల ఏళ్లుగా నీటి వనరులను ధ్వంసం చేయడం వల్ల భయానకస్థితి ఏర్పడింది. ‘చెరువుల నీళ్లు పోయి నెరువెనక పడ్డంక ఏమి చేస్తే ఏమౌతుంది’ అనేది సామెత. ఏదైనా ఒక అవకాశం చేజారిపోతే ఈ సామెత చెప్పడం తెలంగాణలో అలవాటు. కానీ నిజానికి ఈ సామెత ప్రత్యక్షంగానే అతికింది. ఈ రోజు తెలంగాణలో చెరువులన్నీ కట్టలు తెగి, మేటలతో పూడకపోయి, తుమ్మచెట్లు మొలిచి చెరువులు ఎక్కడ ఉన్నాయో కనిపించని స్థితి ఏర్పడింది. ఇంకా కొన్నిచోట్ల స్థానిక ప్రజల అవసరాల కోసం కాకుండా, దగ్గరున్న పట్టణాల, నగరాల దాహాన్ని తీర్చడం కోసం తరలిస్తు న్నారు. దీని ఫలితంగా 1968 సంవత్సరంలో రాష్ట్రం మొత్తం మీద 10.70 లక్షల హెక్టార్ల సాగుతో 36 శాతం నీటిపారుదల అవసరాలను తీర్చిన చెరువులు 1998 వచ్చేసరికి 7.20 లక్షల హెక్టార్లతో కేవలం 17 శాతం నీటి పారుదల అవసరాల స్థాయికి పడిపోయాయి. దీన్ని బట్టి చెరువుల విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. అయితే ఈ చెరువుల వినాశనం కోస్తాంధ్రకన్నా తెలంగాణను ఎక్కువ దెబ్బతీసింది. 1950 ప్రాంతంలో తెలంగాణ 11 లక్షల హెక్టార్ల భూమి చెరువుల ద్వారా సాగయితే ప్రస్తుతం అది 5 లక్షల 42 వేల 620 హెక్టార్లకు పడిపోయింది. కోస్తాంధ్ర ప్రాంతంలో కాలువల ద్వారా ఆ లోటు తీరింది కానీ, తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరగక దాని నష్టం ఈనాటి పరిస్థితికి కారణమైంది. ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన వివక్ష ఒక కారణమైతే, చెరువుల విధ్వంసం ఈ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునాదులను పెకిలించివేసింది. నిజానికి చెరువుల వినాశనం జనజీవనాన్ని అధఃపాతాళానికి తోసింది. ఇటు వంటి చెరువుల విధ్వంసం కథలు ఊరూరా వినిపిస్తాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల చెరువుల పునరుద్ధరణ ముందుకొచ్చింది. నిజానికి తెలంగాణ ప్రగతి, పరమార్థం చెరువుల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఊరూరా ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన చెరువును మనం పునర్జీవింపజేసుకుందాం.

 (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు)  -మల్లెపల్లి లక్ష్మయ్య
 

 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement