చరిత్ర తవ్వితే చెరువులెన్నో! | ponds have a relationship with telangana life and bathukamma festival | Sakshi
Sakshi News home page

చరిత్ర తవ్వితే చెరువులెన్నో!

Published Fri, Oct 3 2014 12:34 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

చరిత్ర తవ్వితే చెరువులెన్నో! - Sakshi

చరిత్ర తవ్వితే చెరువులెన్నో!

ఇక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా చెరువులకు అనుకూలం. చెరువుల వెనుక ఉన్న కథలను ప్రచారం చేసి, అన్ని కులాల వారు వీటి పునర్ నిర్మాణంలో భాగం పంచుకునేటట్టు చేయాలి. ఇందుకు అక్కమ్మ వంటి వీరవనితల గాథలను గుర్తు చేయాలి. తెలంగాణ బతుక్కూ, బతుకమ్మకూ, చెరువుకూ అవినాభావ సంబంధం ఉంది.
 
ఎండిన బీళ్లు, వలసలు, ఆకలితో అంటుకుపోయిన డొక్క లు.. నీటిచుక్క లేక ఆరిన గొంతులు, తడిలేని కళ్లు - ఇవే తెలంగాణకు అనవాళ్లు. ఈ దుస్థితికి సవాలక్ష కారణాలు. అయితే తెలంగాణ దృశ్యం ఎప్పుడూ ఇదే అని చెప్పలేం. ఇందుకు గొప్ప సాక్ష్యమే ఏనుగుల వీరాస్వామయ్య రచన ‘కాశీయాత్ర చరిత్ర’. ఒకనాటి సిరుల తెలంగాణ పల్లె పరిస్థి తులకు ఇది వాస్తవ చిత్రణ. ఇదొక యాత్రా కథనమే అయి నా ఆ వర్ణనలలో సస్యశ్యామలమైన ఆనాటి తెలంగాణ దర్శనమిస్తుంది. జలచర్ల, మెతుకుసీమ పేర్లు ఆయాచితంగా రాలేదనీ, ఆ పేర్ల వెనుక ఎంతో పరిణామం ఉందనీ అవగతమౌతుంది. ఇప్పు డు తొలి తెలంగాణ రాష్ట్ర అవతరణతో నాటి సిరుల తెలంగాణకు చిరునవ్వుల తెలంగాణకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదని, ఇక్కడి చరిత్రలో కనిపించే చెరువులను రక్షిస్తే చాలు నని ప్రభుత్వం యోచించడం గమనించదగి నది. అభినందించవలసిన అంశం కూడా.

కథనం నిండా జలసిరులే
‘‘ఉదయాన ఆరు ఘంటలకు బయలుదేరి 10 కోసుల దూరములో నుండే మాషాపేట అనే యూరు 12 ఘంటలకు చేరినాను. దోవ నిన్నటి దోవ వలెనే రమణీయముగానున్నది. ఇరుపక్కలా జీడిచెట్లు, టేకుచెట్లు, మోదుగచెట్లు మొదలైన వృక్షములు గల యడవి భూమి సమమయినది. ఆ మాషాపేట గొప్ప యూరు. సకల పదార్థాలు దొరుకును. అక్కడ రాత్రి నిలిచినాను. ఆయూరు వర్షాకాలములో మిక్కిలి బురద గలిగి చిత్తడిగా నుండుచున్నది. హయిదారాబాదు వద్ద హుశేనుసాగరమనే చెరువు మొదలుగా ఊరూరికి భారీ చెరువులున్నా, వాటి కింద పొలము కట్లున్ను, వరి పైరున్ను కలిగియున్నవి. జల వసతి కలదు.

అవి మెట్ట పంటగల యూళ్లు కావు’’ - ఇవి వీరాస్వామయ్య 1830లో ఈ ప్రాంతాన్ని చూసి రాసిన మాటలు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగి వీరాస్వామయ్య చెన్నపట్నం (నేటి చెన్నై) నుంచి కాశీయాత్రకు వెళుతూ ఆ అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. తిరుపతి, శ్రీశైలం, నల్లమల మీదుగా ఈనాటి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయన అడుగుపెట్టారు. నల్లమల అడవిలోనే ఆయన పెద్ద చెరువును చూశారు. దాని కట్టమీదనే గుడారాలు వేసుకుని బస చేసినట్టు రాశారు. తరువాత హైదరాబాద్ ప్రాంతం దాటేవరకు చెరువుల ప్రస్తావన లేకుండా ఆయన కథనం సాగలేదు. ఈ చెరువును వర్ణిస్తూ, ‘చెన్నపట్టణపు కొణ్ణూరు నీళ్లు వదిలిన వెనుక నింతపాటి యుదకము నేను చూచిన వాడను గాను’ అని రాసుకున్నారు. చిన్నమంది చెరువుకట్ట గురించి కూడా ప్రస్తావించారు. ఇంకొక ఘట్టాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘1830 జూన్ 27వ తేదీన 5.30 ఘంటలకు ప్రయాణమై పదకొండు ఘంటలకు ఆరు కోసుల దూరంలో నుండే జలచర్ల యూరు చేరినాను.

దారి ఇసుకపొర. ఆ నడుమ మూలకర్ర, కోటూరు, ఆలూరు అనే గ్రామాలున్నవి. ఆలూరు వరకు అడవి నడుమ బాట. ఆలూరు మొదలుకొని అడవిలేదు. దారిలో జలసమృద్ధిగల బావులు చెరువులున్నవి. వరిపొలాలు, పొలకట్లు తీర్చి యున్నవి’ అని పేర్కొన్నాడు. జడ్చర్లను ఆనాడు ఆయన జలచర్లగా వాడడం వాస్తవానికి సమీపంగా ఉంది.  ఈ అనుభవాలన్నీ 1838లో ‘కాశీయాత్ర చరిత్ర’పేరుతో పుస్తక రూపం దాల్చాయి. ఇటీవల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తన వారసత్వ సంపదగా ఉన్న చెరువులను పునరుద్ధరిం చాలని నిర్ణయించింది. కోస్తా పాలకులు చెరువులను ధ్వం సం చేయడం వల్లనే ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైం దన్న వాదన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో ముం దుకు వచ్చింది.

రాష్ట్రావతరణ తరువాత చెరువుల పున రుద్ధరణను ప్రాధాన్యతా కార్యక్రమంగా చేపట్టాలన్న ఆకాంక్ష వెల్లువెత్తింది. తెలంగాణ విద్యావంతుల వేదిక పుస్త కం ‘చెదిరిన చెరువులు’ దీనినే చర్చించింది. చెరువులను కాపాడడం, నదులతో వాటిని అనుసంధానం చేయడం అనే సూత్రం ముందుకు వచ్చింది. ప్రజల ఆశలు, ఆకాం క్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది.
 
పేర్లు మాత్రం మిగిలాయి
పల్లెల సంగతి పక్కన పెడదాం. వీరాస్వామయ్య వర్ణనల ప్రకారం హైదరాబాద్ నగరం నిండా చెరువులే కనిపిస్తా యి. వాటి చుట్టూ కూరగాయలు, పండ్ల తోటలు ఉన్నట్టు రాశారాయన. వర్షాకాలంలో ఆయన దాదాపు నెలరోజులు నగరంలో ఉన్నారు. కాకాగూడాలో నాగన్నతోటలో విడిదిచే శానని నమోదు చేశారు. నిజానికి ఈనాటికీ హైదరాబాద్ లో చెరువుల, కుంటల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. మాసా హెబాట్యాంక్, నల్లకుంట, మాలకుంట, బొగ్గులకుంట ఒకవైపు ఉంటే, సీతారాంబాగ్, జాంబాగ్, బాగ్‌లింగంపల్లి, ఫూలబాగ్, ఇమ్లీబన్, చింతల్‌బస్తీ లాంటి పేర్లు నగరంలో నాడు ఉన్న తోటలను గుర్తుచేస్తాయి. బావుల పేర్లతో కూడా అనేక ప్రాంతాలను పిలుచుకోవడం ఉంది. దూద్ బౌలి, గచ్చిబౌలి, రేతిబౌలి, పుత్‌లీబౌలి, అల్లంబావి, ఆలు గడ్డబావి ఇలాంటివే. కానీ ఇవాళ ఆ పేర్లు మిగిలాయి. బావులు, తోటలు, చెరువులు కనుమరుగయ్యాయి.
 
చెరువుతో అవినాభావ బంధం
హైదరాబాద్, సికింద్రాబాద్‌లను విభజించే హుస్సేన్‌సా గర్ గురించి ఒక విశేషం ‘కాశీయాత్ర చరిత్ర’లో కనిపిస్తుం ది. ‘షహరుకున్ను (హైదరాబాద్) ఇంగిలీషు దండుకున్ను రెండుకోసుల దూరమున్నది. నడుమ హుశేనుసాగరమనే పేరుగల యొక గొప్ప చెరువున్నది. ఆ కట్ట మీద ఇంగిలీషు వారు గుర్రపు బండ్లు పొయ్యేటందుకు యోగ్యముగా బాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలున్నూ, మను షులున్నూ, ఎక్కినడిచి చెరచకుండా బాటకు ఇరుపక్కలా తమ పహారా పెట్టియున్నారు. జాతుల వాండ్లను తప్ప ఇత రులను ఆ కట్టమీదకు హుకుమ్ లేక ఎక్కనియ్యరు’ అని రాశారు. ఒకనెల తరువాత వీరాస్వామయ్య హైదరాబాద్ నుంచి తిరిగి బయలుదేరారు. మార్గంలో ఆయన చూసిన విషయాలలో వరిపైరు, మంచి బియ్యం గురించి ఆసక్తిక రంగా చెప్పారు. ‘కామారెడ్డిపేట వసతియైన గ్రామమే. చెరువు ఉన్నది.

జలవసతి కలదు. క్రిష్ణా దాటినది మొద లుగా ప్రతి గ్రామంలోనున్నూ బియ్యము మంచిదిగా దొరు కుతున్నది. వడ్లపైరు హైదరాబాద్ మొదలుకొని పండు తున్నది.’అని వివరించారు. ఆ తరువాత మల్లుపేట, ఈద లఘాటు, జగనంపల్లె, ఆర్మూరు, బాల్కొండ, నిర్మల గురించి చెప్పినపుడు కూడా చెరువుల ప్రస్తావనలు ఉన్నాయి. ఇక్కడ వరిఅన్నం చాలా సమృద్ధిగా దొరికేది. కానీ కొందరు ఇక్కడి వారికి వరి అన్నం తినడం తామే నేర్పామని వక్రభాష్యం చెబుతున్నారు. నిజానికి ఇక్కడ మెట్టపంటలు తక్కువని వీరాస్వామయ్య రచనను బట్టి అర్థమవుతుంది. కాలక్రమేణా వివక్షవల్ల చెరువులు కను మరుగైనాయి.

ఆకలి, వలసలు, పేదరికం పెరిగాయి. తెలం గాణ పల్లె జీవితం పచ్చగా ఉండాలంటే మళ్లీ చెరువులను కళకళలాడేటట్టు చేయాలి. అవసరమైతే తప్ప భారీ, మధ్య తరగతి ప్రాజెక్టులు చేపట్టడం అవసరం కాదు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా చెరువులకు అనుకూలం. చెరు వుల వెనుక కథలను ప్రచారం చేసి, అన్ని కులాల వారు వీటి పునర్ నిర్మాణంలో భాగం పంచుకునేటట్టు చేయాలి. ఇందుకు అక్కమ్మ వంటి వీరవనితల గాథలను గుర్తు చేయాలి. తెలంగాణ బతుక్కూ, బతుకమ్మకూ, చెరువుకూ అవినాభావ సంబంధం ఉంది.

(వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు)
మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement