ఖమ్మం మామిళ్లగూడెం,న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణంపై నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఖమ్మం రిక్కాబజార్ హైస్కూల్‌లో జరుగనున్న సదస్సును జయప్రదం చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ కోరారు. ఆదివారం ఖమ్మంనగరంలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పురిటిగడ్డ ఖమ్మం ఖిల్లా అని, 2009లో తెలంగాణ రాష్ట్ర సాదనకు కేసీఆర్ కరీంనగర్‌లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి ఆయన్ని ఖమ్మం తీసుకువచ్చారని, అది చారిత్రక దినంగా పాటిస్తున్నామని అన్నారు. 60 సంవత్సరాల ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువచ్చి తెలంగాణ సాధించారని అన్నారు.
నేడు జరుగనున్న సదస్సుకు టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జిల్లా ఇన్‌చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, టీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, టీజీవో రాష్ట కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఖాజామీయా పాల్గొంటారని తెలిపారు. పద్మావతి, పమ్మి కళాబృందాల ఆధ్వర్యంలో ధూంధాం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండీ అబ్దుల్ నబి, పాలేరు ఇన్‌చార్జ్ బత్తుల సోమయ్య, నాయకులు ఎస్‌యూ బేగ్, డోకుపర్తి సుబ్బారావు, నందిగాం రాజ్‌కుమార్, రయిస్ అన్వర్, రడం సురేష్ గౌడ్, పమ్మిరవి, రవికాంత్, శంకర్‌రావు, కాసాని నాగేశ్వరరావు, పగడాల నరేందర్ పాల్గొన్నారు.