
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల పర్వంలో ఇవాళ కీలక కసరత్తు జరగనుంది. బరిలో ఉండే వారెందరు..? నామినేషన్ ఉపసంహరించుకునే వారెవరు..? అన్నది నేడు తేలనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రెబెల్ అభ్యర్థులను బరిలోనుంచి తప్పించేందుకు అన్ని పార్టీల పెద్దలు నానా పాట్లు పడుతున్నారు. బాబూ తప్పుకో అంటూ బతిమలాడుతున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నం.. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. తనకు సహకరించాలంటూ ఏకంగా చేవెళ్ల కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వెంకటస్వామి కాళ్లు ఆయన పట్టుకొని బ్రతిమిలాడుతున్న ఫొటో.. ఇప్పుడు వైరల్‌గా మారింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి పడాల వెంకటస్వామి అధిష్టానాన్ని కోరారు. అనూహ్యంగా ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేఎస్ రత్నంకు టికెట్ దక్కింది. దీంతో అలకవహించిన వెంకటస్వామి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించినా అధిష్టానం నచ్చజెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో బుధవారం కేఎస్ రత్నం.. వెంకటస్వామి ఇంటికి వచ్చి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment