లిఫ్ట్ వచ్చిందనుకొని..
డోర్ తెరిచి అడుగేసిన రత్నం
అమాంతం రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై
పడిపోయిన మాజీ ఎమ్మెల్యేతీవ్ర గాయాలు, నిమ్స్‌కు తరలింపు
హైదరాబాద్‌లో ఎంపీ కవిత ఇంటి వద్ద ప్రమాదం
చేవెళ్ల: లిఫ్టు ఎక్కబోతూ కిందపడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకులు కేఎస్ రత్నం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేఎస్ రత్నం శుక్రవారం నిజామాబాద్ ఎంపీ కవితను కలిసేందుకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లారు. ఎంపీని కలసి తిరిగి వెళ్లేందుకు ఆమె నివాసంలోనే రెండో అంతస్తులో ఉన్న లిఫ్టు వద్దకు వచ్చారు. ఏదో ఆలోచనలో ఉన్న ఆయన లిఫ్ట్ రెండో అంతస్తుకు రాకమునుపే డోర్ తెరిచి లోపలికి అడుగు పెట్టారు. దీంతో ఆయన ఒక్కసారిగా కింది అంతస్తులో ఉన్న లిఫ్ట్ పైభాగంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గన్‌మెన్లు పరుగున వచ్చి రత్నంను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇటీవల చేవెళ్ల నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో నిమ్స్‌కు తరలివెళ్లారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొందరు రత్నంను నిమ్స్‌లో పరామర్శించారు.