కప్పదాట్లు! | leaders change their parties in district | Sakshi
Sakshi News home page

కప్పదాట్లు!

Published Thu, Feb 27 2014 12:05 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM

leaders change their parties in district

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నేతల కప్పదాట్లతో ప్రధాన పార్టీల్లో ఒకప్పటి ప్రత్యర్థులు కాస్తా ఇప్పుడు మిత్రులుగానో, మిత్రపక్షంగానో కొత్త అవతారమెత్తుతున్నారు. ముగ్గు రు ముఖ్యనేతలు తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంతో జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కేఎస్ రత్నం తమ సహచరులతో కలిసి మంగళవారం టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు.

దీంతో వీరికి ఇన్నాళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరించిన నేతలు ఈ పరిణామాలను విశ్లేషించుకునే పనిలో పడ్డారు. మహేందర్ అనూహ్య నిర్ణయంతో డోలాయమానంలో పడ్డ తాండూరు కాంగ్రెస్ నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తమకు సీటు గ్యారెంటీ అని బలంగా విశ్వసించిన నేతలు కాస్తా మారుతున్న సమీకరణల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదా విలీనం ఉంటుందనే అభిప్రాయానికొచ్చారు. ఈ క్రమంలో ఊహిం చని రీతిలో మహేందర్ తదితర ఎమ్మెల్యేలు తమకు మిత్రపక్షంగా వ్యవహరిస్తుందని భావిస్తున్న టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అంతర్మథనంలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కొందరు కాంగ్రెస్ నాయకులు తమ అంతరంగికులతో భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు జరిపారు.

 ఒకరిద్దరు ఆశావహులు ఏకంగా పార్టీని వీడనున్నట్లు సంకేతాలిచ్చినట్లు తెలిసిం ది. రాజకీయ వైరం ఉన్న నేతలతో ఇమడలేమని భావిస్తున్న వీరు ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేద ని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే టీఆర్‌ఎస్ సీటుపై గంపెడాశ పెట్టుకున్న నేతలకు తాజా పరిణామం మింగుడుపడటం లేదు. సీటు లభిస్తుందనే ఆశతో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన తమకు గులాబీ నాయకత్వం రిక్తహస్తం చూపుతుందనే గుబులు వెంటాడుతోంది. సిట్టింగ్‌లను కాదని తమకు సీట్లిచ్చే అవకాశాలుండవనే అంచనాకొచ్చిన వారు కొత్తదార్లు వెతుక్కుంటున్నారు.

 లైన్ క్లియర్!
 ఇన్నాళ్లు మేహ ందర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు తమకు లైన్‌క్లియర్ అయిందనే సంతోషంలో ఉన్నారు. మహేందర్‌ను ధిక్కరించి సీటు అడిగే పరిస్థితి లేకపోవడంతో గప్‌చిప్‌గా ఉన్నారు. ఇప్పుడు వారంతా తాండూరు రేసుకు రెడీ అవుతున్నారు. మరికొందరు దిగువశ్రేణి నాయకులు మాత్రం ఆయనను అనుసరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే మండలాల్లో ఇప్పటికే వీరికి వైరివర్గంగా ఉన్న ఇతర పార్టీ నేతలు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తాండూరుతో పోలిస్తే చేవెళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంది.

చేవెళ్ల ఎస్సీ రిజర్వ్ కావడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థిత్వం కోసం పెద్దగా పోటీ లేదు. రత్నం బలమైన నేతగా ఎదగడంతో ఆ వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులె వ్వరూ ఆ స్థాయిలో బలపడలేదు. దీంతో ఇప్పుడు టీడీపీ కొత్త నాయకుడి అన్వేషణలో పడింది. మరోవైపు రత్నం గులాబీ పంచన చేరడంతో కాంగ్రెస్‌లోనూ అంతర్మథనం మొదలైంది. పొత్తు-విలీనంలో భాగంగా టీఆర్‌ఎస్ చేవెళ్ల సీటుకు ఎక్క డ ఎసరు పెడుతుందోననే భయం పట్టుకుంది. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు రత్నం టీఆర్‌ఎస్ గూటికి చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పొత్తు,విలీనం జరిగిన పక్షంలో రత్నం పోటీచేస్తే తాము కూడా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లోనూ రత్నం చేరికతో ముసలం పుట్టింది.

 పార్టీ కోసం అహర్నిషలు కృషిచేసిన తమను కాదని, చివరి నిమిషంలో చేరినవారికి సీటు కేటాయిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. టీడీపీలో వెలుగువెలిగిన నేతలు ఇప్పుడు కారెక్కిన నేపథ్యంలో పరిణామాలను పరిశీలిస్తే.. ఒకట్రెండు రోజుల్లో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి. దీనికితోడు కాంగ్రెస్ ఎంపీ సీటుపై గంపెడాశ పెట్టుకున్న ఒకరిద్దరు నేతలు తమకు బీ ఫారం దక్కకపోతే.. ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement