
రేసులో‘సైకిల్’ కుదేలే..!
పోలింగ్‌కు ముందు జిల్లాలో 15 స్థానాలు తమవేనని చెబుతూ వచ్చిన టీడీపీ నేతలు.. పోలింగ్ అనంతరం తమ లెక్కలు తప్పాయని దిగాలు పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : పోలింగ్‌కు ముందు జిల్లాలో 15 స్థానాలు తమవేనని చెబుతూ వచ్చిన టీడీపీ నేతలు.. పోలింగ్ అనంతరం తమ లెక్కలు తప్పాయని దిగాలు పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి ఆధారంగా వేస్తున్న అంచనాలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ఫ్యాన్’కు స్పష్టమైన ఆధిక్యత లభిస్తుందన్న అంచనాలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ‘పండగ ముందు’ ఉండే జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ నాయకులు లోలోపల జావగారిపోతున్నా.. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
తమ అంచనాలు తల్లకిందులై పార్టీ బలంగా ఉందనుకున్న నియోజకవర్గాల్లోనూ గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చని తెలుగుతమ్ముళ్లు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. 19 అసెంబ్లీ స్థానాల్లో తుని, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, రాజానగరం, రాజమండ్రి రూరల్, మండపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం, కొత్తపేట, రాజమండ్రి రూరల్, రంపచోడవరం, పి.గన్నవరం, అమలాపురం ఖాయంగా తమవేనని వేసుకున్న లెక్క తప్పుతుందని అంటున్నారు.
ఖాయమనుకున్నచోటా ‘ఖాయిలా’యే..
తునిలో టీడీపీకి మళ్లీ ఎదురు దెబ్బ ఖాయమని రాజకీయాలతో ఆట్టే సంబంధం లేని వారు కూడా అంటున్నారు. పెద్దాపురం సీటుపై ఆశ పెట్టుకున్న స్థానిక నేతలను నిరాశపరుస్తూ స్థానికేతరునికి టిక్కెట్టు ఇవ్వడంతో టీడీపీ శ్రేణుల్లోనే వ్యతిరేకత పెరిగిందని, ఈ పరిణామం వైఎస్సార్ సీపీకి అదనపు అవకాశంగా కలిసి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాకినాడ సిటీలో ఒక ప్రాంతంలో తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని టీడీపీ నేతలు సంబరపడుతున్నా.. తక్కిన చోట్ల వారి సంబరంపై నీళ్లు చల్లేలా ఓటర్లు తీర్పునిచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక కాకినాడ రూరల్‌లో అసలు టీడీపీ సోదిలోకే ఉండదని, అక్కడ వైఎస్సార్‌సీపీ గెలుపు నల్లేరుపై నడకేనంటున్నారు. నిట్టనిలువునా చీలిపోయిన ఓట్లతో ప్రత్తిపాడులో టీడీపీ నష్టపోతుందని, దీనివల్ల వైఎస్సార్‌సీపీ విజయావకాశాలు గణనీయంగా మెరుగు పడ్డాయని అంచనా వేస్తున్నారు.
తిరిగి తమ ఖాతాలోనే పడుతుందని టీడీపీ ఆశపడుతున్న రాజానగరంలో వైఎస్సార్ సీపీ హవా ముందు కుదేలు కాక తప్పదంటున్నారు. ఎంతో కొంత అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు ఆశించిన రాజమండ్రి సిటీని బీజేపీకి విడిచి పెట్టడం, సిటీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన సీనియర్ నేతను ఆయనకు పట్టులేని రూరల్ నియోజకవర్గానికి మార్చడం.. ఆ రెండు స్థానాల్లో ప్రతికూలాంశాలు అవుతాయని, దాంతో అక్కడ వైఎస్సార్ సీపీ విజయం అనాయాసమేనని అంటున్నారు. టీడీపీ తనకు కంచుకోటగా పరిగణించిన మండపేటలోనూ ఎదురీదాల్సి వచ్చిందని, అక్కడున్న సామాజిక సమీకరణలు, వైఎస్సార్ సీపీపై ఎస్సీ, బీసీల్లో ఉన్న ఆదరణ ముందు టీడీపీ కురిపించిన కోట్లు కొట్టుకు పోక తప్పదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాదాపు ఇదే పరిస్థితి ముమ్మిడివరం నియోజకవర్గంలో సైతం కనిపిస్తోందని టీడీపీ నాయకులే నిట్టూరుస్తున్నారు.
తాజా మాజీలపై సొంత సామాజికవర్గాల నిరసన
ఇక రామచంద్రపురం, కొత్తపేటల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి పార్టీని పటిష్టం చేసుకున్నామని టీడీపీ మురిసినా..ఆ నిర్ణయమే ఆ రెండు చోట్లా పార్టీకి అశనిపాతంలా పరిణమించిందంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సహజంగా ఉండే వ్యతిరేకతకు తోడు సొంత సామాజికవర్గానికి చేసిందేమీ లేదనే నిరసన అక్కడ టీడీపీ ఆశలను తలకిందులు చేసిందంటున్నారు. పి.గన్నవరం, అమలాపురం తమవేనన్న టీడీపీ లెక్క పోలింగ్ అనంతరం అందుకున్న క్షేత్రస్థాయి సమాచారంతో తప్పిందంటున్నారు. మొత్తం మీద టీడీపీ తన ఖాతాలో వేసుకున్న స్థానాలన్నింటా వైఎస్సార్ సీపీ సానుకూల పవనాలు వీచాయని, దాంతో ‘సైకిల్’ ఎక్కడా గెలుపు మజిలీ చేరే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.