సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో గందరగోళం నెలకొంది.
కురిచేడు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లందరికీ ఓటేసేందుకు అవసరమైన స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ బూత్‌లెవల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మందికి అందలేదు. కురిచేడు మండలంలోని 58వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 1,030 మంది ఓటర్లుండగా, వారిలో 460 మందికి ఓటర్ స్లిప్పులు అందలేదు. 570 మందికి మాత్రమే స్లిప్పులు పంపిణీ చేశారు.
అంతేగాకుండా పంపిణీ చేసిన స్లిప్పుల్లో కూడా 476 నుంచి 570 సంఖ్య వరకూ గల 94 మంది ఓటర్లకు పర్చూరు నియోజకవర్గం పర్చూరు మండలం చింతపల్లిపాడులోని 58వ నంబర్ పోలింగ్ కేంద్రంలోని ఓటర్లకు సంబంధించిన స్లిప్పులు అందజేశారు. ఆ స్లిప్పులు అందుకున్న.. మండలంలోని గొల్లపాలెం ఎస్సీకాలనీ ఓటర్లంతా అయోమయానికి గురయ్యారు. వీరితో పాటు అసలు స్లిప్పులే అందనివారు కూడా ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి బుధవారం తామంతా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.