
కాయ్ రాజా.. కాయ్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఓటర్లు అత్యంత గుంభనంగా వ్యవహరించడంతో వారి నాడి పట్టుకోవడం కష్టంగా మారింది.
సాక్షి, ఏలూరు : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఓటర్లు అత్యంత గుంభనంగా వ్యవహరించడంతో వారి నాడి పట్టుకోవడం కష్టంగా మారింది. ప్రతి అభ్యర్థి గెలుపు తనదేనని చెబుతున్నారు. వారి ధీమాపై పందెం కట్టే పనిలో బెట్టింగ్‌రాయుళ్లు నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో గ్రామస్థాయిలో బెట్టింగ్‌లు జోరుగా సాగడం విశేషం. జిల్లాలో సంక్రాంతికి రూ.కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. ఎన్ని హెచ్చరికలు చేసినా ఆరోజు వచ్చేసరికి అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటుంది. దీనికోసం వారికి బెట్టింగ్ ముఠాల నుంచి అందాల్సినవి అందుతుంటాయి. ఇదే సంప్రదాయాన్ని ఎన్నికల బెట్టింగ్‌ల విషయంలోనూ అధికారులు అనుసరిస్తున్నారు. జిల్లాలో కోట్లాది రూపాయల బెట్టిం గ్‌లు జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదు.
పక్కా ప్రణాళిక
నియోజకవర్గాల వారీగా బెట్టింగ్‌ల తీరును పరిశీలిస్తే.. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైనే ప్రధానంగా పందాలు కడుతున్నారు. లోక్‌సభ నియోజక వర్గాల్లో ఏ సెగ్మెంట్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీకి వస్తాయనే దానిపైనా పందాలు నడుస్తున్నాయి. పందెం సొమ్ముకు పక్కాగా డాక్యుమెంట్లు రాసుకుంటున్నారు. డబ్బులు ముందుగానే మధ్యవర్తి దగ్గర పెడుతున్నారు. అతనికి కొంత కమిషన్ ఇచ్చి గెలిచిన వారికి మొత్తం సొమ్ము అప్పగించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కోడి పందాల్లో ముందుండే డెల్టాకు చెందిన ప్రముఖులు ఎన్నికల బెట్టింగ్‌లలోనూ ముందున్నట్లు తెలుస్తోంది. వీరు జిల్లా వ్యాప్తంగా పందాలు కాస్తున్నారు. రూపాయికి రూపాయిన్నర ఇస్తామంటూ కోసు పందాలు వేస్తున్నారు. కచ్చితంగా తామనుకున్న అభ్యర్థి గెలుస్తాడనుకున్న చోట కోసు పందాలు నడుస్తున్నాయి.
నియోజకర్గాల్లో ఇలా...
ఆచంటలో భారీగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఉండి, భీమవరం పట్టణాల్లో ప్రతి వార్డులోనూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. చింతలపూడిలో టీడీపీ నాయకులు తమ అభ్యర్థిపై రూ.25 లక్షల పందెం కట్టారు. పోలవరంలో రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకూ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. నరసాపురంలో ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీట్లపై బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇక్కడ కూడా కోసు పందాలే ఎక్కువగా ఉన్నాయి. నిడదవోలులో రూ.50 వేల నుంచి రూ.5లక్షల వరకూ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. తణుకులో రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకూ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఉంగుటూరులో వైసీపీ అభ్యర్థికి లభించే మెజార్టీపై కోసు పందెం కాస్తున్నారు. ఇక్కడ రూ.50 లక్షల వరకూ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. దెందులూరులో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఈ సీటుపై బెట్టిం గ్ కాసిన రూ.22 లక్షలను పోలింగ్ రోజు రాత్రి ఏలూరులో పోలీసులు పట్టుకోవడంతో పందెంరాయుళ్లు జాగ్రత్తపడుతున్నారు. కౌంటింగ్ సమయం దగ్గరపడే కొద్దీ బెట్టింగ్‌లు ఊపందుకునే అవకాశం ఉంది.