
సైకిల్ స్పీడుకు పడమటి గాలి బ్రేక్
మార్కాపురం, న్యూస్‌లైన్ : ఎన్నికలు ఏవైనా.. అభ్యర్థులు ఎవరైనా.. గెలుపు మాత్రం వైఎస్సార్ సీపీదే. పశ్చిమ ప్రకాశం ప్రజల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ప్రజలు ఓట్ల రూపంలో కనబరిచారు. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గతేడాది మేలో జరిగిన సొసైటీ ఎన్నికలు, జూన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన జంకె వెంకటరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజులు ఎమ్మెల్యేలుగా ఘన విజయం సాధించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. ఒంగోలు ఎంపీగా వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డికి ప్రజలు మంచి మెజారిటీ అందించారు.
మార్కాపురం నియోజకవర్గంలో వైవీ సుబ్బారెడ్డికి 81,347 ఓట్లు రాగా, టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 73,038 ఓట్లు వచ్చాయి. దీంతో వైవీ మార్కాపురం నియోజకవర్గంలో 8,309 ఓట్ల మెజారిటీ సాధించారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 91,881 ఓట్లు రాగా టీడీపీకి 79,985 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 11,896 ఓట్ల మెజారిటీ వైవీ సుబ్బారెడ్డికి లభించింది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 85,123ఓట్లురాగా టీడీపీ అభ్యర్థికి 65,467 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైవీకి 19,656 ఓట్ల మెజారిటీ వచ్చింది. పశ్చిమ ప్రాంతంలో ఫ్యాన్ స్పీడుకు సైకిల్ బ్రేకులు వేయలేకపోయింది. ఎన్నికలు ఏవైనా ప్రజలు మాత్రం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను సగర్వంగా గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.