ఎప్పటికప్పుడు తెరపై ఫలితం | elections results on screen | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడు తెరపై ఫలితం

Published Tue, May 13 2014 2:23 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

ఎప్పటికప్పుడు తెరపై ఫలితం - Sakshi

ఎప్పటికప్పుడు తెరపై ఫలితం

 సాక్షి, సిటీబ్యూరో: ఈసారి కౌంటింగ్‌కు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం తోడు కానుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో రౌండ్ల వారీగా, టేబుళ్ల వారీగా ఎప్పటికప్పుడు డిస్‌ప్లే అవుతుంది. కావాలనుకుంటే ఈ వివరాల ప్రింట్ కాపీని కూడా పొందవచ్చు. ఈవీఎంలకు అనుసంధానిస్తున్న ‘ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్‌ప్లే యూనిట్ (పాడు)’ ద్వారా ఈవీఎంలలోని ఓట్ల వివరాలను ఎప్పటికప్పుడు డిస్‌ప్లే అవుతాయి. ఓట్లను లెక్కించే అధికారులతోపాటు ఎన్నికల పరిశీలకులు, రాజకీయపార్టీల ఏజెంట్లు ‘పాడు’ డిస్‌ప్లే ద్వారా ఎప్పటికప్పుడు కౌంటింగ్ తీరును.. ఓట్ల వివరాలను చూడవచ్చు. ఈ వివరాలకు సంబంధించిన కాపీ కావాలంటే ప్రింటర్‌ను అనుసంధానించి పొందవచ్చు. గతంలో ఈ విధానం లేదు.

ఈసారి కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ విధానం గురించి పోటీ చేసిన అభ్యర్థులందరికీ తెలియజేయాల్సిందిగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అందుకుగాను ఈ నెల 14న పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించాల్సిందిగా రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కమిషనర్ సోమేశ్‌కుమార్ రిటర్నింగ్ అధికారులతో జీహెచ్‌ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ  విషయం వెల్లడించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 211 టేబుళ్లు.. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 211 టేబుళ్లు వెరసి మొత్తం 422 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నందున ఒక్కో టేబుల్‌కు ఒక్కో యూనిట్ వంతున 422 ‘పాడు’ యూనిట్లు అవసరమన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక అబ్జర్వర్ ఉంటారని, ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించడంతోపాటు ప్రతి రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తారన్నారు. ప్రతి రౌండ్ ఫలితంపై అబ్జర్వర్ సంతకం చేస్తారని, రిటర్నింగ్ అధికారులు ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు.
 
ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు
 అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల అబ్జర్వర్లకు ప్రత్యేక రూమ్ కేటాయించడంతోపాటు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళి..  రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు తెలియజేసేందుకు మీడియాసెంటర్ ఏర్పాటు చేయాలని సోమేశ్‌కుమార్ సూచించారు. 16న కౌంటింగ్ జరుగనున్నందున 15వ తేదీ  మధ్యాహ్నం కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని, అదే సమావేశంలో వారికి గుర్తింపు కార్డులు అందజేయాలని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి 8.30 నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదన్నారు. అప్పటిలోగా పోస్టల్‌బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాని పక్షంలో వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్దకు పంపించాలని సూచించారు.
 
 ఏజెంట్లు బయటకు వెళ్తే తిరిగి రానీయరు

 కౌంటింగ్‌కు హాజరయ్యే రాజకీయ పార్టీల ఏజెంట్లు లోనికి ప్రవేశించాక బయటకు వెళ్తే తిరిగి లోనికి రానీయరని సోమేశ్‌కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోనే క్యాంటీన్ ఏర్పాట్లు చేయాలి తప్ప ఎవరినీ ఆహార పదార్థాలు లోనికి తేనీయవద్దని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కౌంటింగ్ రోజున అభ్యర్థుల సమక్షంలో ఉదయం 6.30 గంటలకే స్ట్రాంగ్‌రూమ్‌లు తెరవాలన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం దాదాపు రెండు వేల మంది విధులు నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు వంతున (కౌంటింగ్ సూపర్‌వైజర్,  కౌంటింగ్ అసిస్టెంట్‌లతో పాటు కేంద్రం నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్) 1266 మంది, ఇతరత్రా అధికారులు, సిబ్బంది వెరసి మరో 600 మంది, రిజర్వులో దాదాపు 200 మంది వెరసి దాదాపు 2066 మంది విధుల్లో పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement