గిరిజనుల సంక్షేమానికి పాటుపడతా
- అరకు ఎంపీ కొత్తపల్లి గీత విజయోత్సవ సభకు తరలివెళ్లిన
- ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబు అడుగడుగునా ఘన స్వాగతం
రంపచోడవరం/గంగవరం, న్యూస్‌లైన్ : గిరిజనుల సంక్షేమానికి నిరంత రం పాటుపడతానని వైఎస్సార్ సీపీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత పేర్కొన్నారు. ఆదివారం రంపచోడవరంలోని లెనోరా విద్యా సంస్థల ప్రాంగణంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (బాబు) అధ్యక్షతన విజయోత్సవ సభ నిర్వహించారు. ఇది సమష్టి విజయమని ఎంపీ గీత, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అనంత బాబు పేర్కొన్నారు. ఏజెన్సీ అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజేశ్వరి అన్నారు. అన్న య్య అనంత బాబు అందించిన సహకారం జీవితంలో మరువలేన న్నారు. అనంత బాబు మాట్లాడుతూ ఎంపీపీగా పనిచేసి, ఉపాధి కూలీగా కూడా చేసిన రాజేశ్వరికి పేదల కష్టాలు తెలుసని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతుందని తెలి పారు. రాబోయే రోజుల్లో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు పోరాటాలు చేయడానికి ిసిద్ధంగా ఉండాలని, జనంతో కలిసి పనిచేయాలని ఎంపీ కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. అనంత బాబు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు ఇబ్బందులు కలగ కుండా చూడాలన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ, ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు పాల్గొన్నారు.
సభకు ర్యాలీగా తరలివెళ్లిన నేతలు
రంపచోడవరంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకు ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నియోజకవర్గ కన్వీనర్ అనంత బాబు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా తరలివెళ్లారు. ఎల్లవరం మొదలు కొని రంపచోడవరం చేరుకునే వరకు ప్రతి గ్రామం లో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబుకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. మండల కేంద్రమైన గంగవరంలో మండల యువజన అధ్యక్షుడు దిండి నాగమహేష్ , జెడ్పీటీసీ అభ్యర్థిని రామతులసి, సర్పంచ్ అక్కమ్మ తదితరులు స్వాగతం పలికారు. అలాగే రంపచోడవరం మండలంలో బి. వెలమలకోట గ్రామంలో గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామ శివారులో స్వాగతం పలకగా, గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే రాజేశ్వరి ఆవిష్కరించారు.
ఇక్కడ కొద్దిసేపు కార్యకర్తలను ఉద్దేశించి అనంత బాబు ప్రసంగించారు. అనంతరం ఐ.పోలవరం గ్రామంలో ఎమ్మెల్యే రాజేశ్వరికి, అనంత బాబుకు అపూర్వ స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నాయకులు, కార్యకర్తలు జేజేలు కొడుతూ రంపచోడవరం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. పందిరి మామిడి నుంచి సభాప్రాంగణం వరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే రాజేశ్వరి, అనంత బాబులు ప్రజలకు అభివాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రంపచోడవరం వారపు సంతలోని ఆలయం లో కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు.