
ఎన్నికల మత్తు.. రూ.213 కోట్లు
అసలే ఎండాకాలం.. ఆపై ఎన్నికల కాలం.. ఇక మందుబాబులకు పండగే పండగ. మున్సిపాలిటీలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు.. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ఒకే సమయంలో రావడంతో తాగినోళ్లకు తాగినంత.
ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం
కర్నూలు, న్యూస్‌లైన్: అసలే ఎండాకాలం.. ఆపై ఎన్నికల కాలం.. ఇక మందుబాబులకు పండగే పండగ. మున్సిపాలిటీలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు.. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ఒకే సమయంలో రావడంతో తాగినోళ్లకు తాగినంత. రెండు నెలల పాటు మద్యం ఏరులై పారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కష్టమని తెలుసుకున్న వ్యాపారాలు.. అంతకుముందే భారీగా మద్యం నిల్వ చేసుకున్నారు. ఆ తర్వాత అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ విడత అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేయడంతో మందుబాబులు ముప్పూటలా మందులో మునిగితేలారు.
జిల్లాలో 170 మద్యం దుకాణాలు, 35 బార్లు, 7 ప్రభుత్వ దుకాణాలు, రెండు క్లబ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా మార్చి ఒకటి నుంచి మే 7వ తేదీ వరకు దాదాపు రూ.113 కోట్ల విలువ చేసే విక్రయాలు చేపట్టారు. కోడ్ అమల్లోకి వస్తే మద్యం విక్రయాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధిస్తుందనే ముందుచూపుతో ఫిబ్రవరిలోనే భారీ మోతాదులో సరుకును నిల్వ చేసుకున్నారు. 28 రోజుల్లో మొత్తం రూ.57.04 కోట్లు విలువ చేసే 1,41,625 కేసుల మద్యం, లక్ష బీరు కేసులను ముందుగానే నిల్వ చేయడం గమనార్హం. 28వ తేదీ ఒక్క రోజే 8.29 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. మార్చి నెలలో 1,20,328 కేసుల మద్యం, 96,337 కేసుల బీరు, ఏప్రిల్‌లో 1,16,437 కేసుల మద్యం, 1,23,757 కేసుల బీరు.. మే మొదటి వారంలో 24,880 కేసుల మద్యం, 21,108 కేసుల బీరు అమ్మకాలు చేపట్టారు.
మద్యం అమ్మకాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంతో కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు భారీ ఎత్తున కర్ణాటక మద్యాన్ని ఏరులై పారించారు. ఏప్రిల్ నెలాఖరున వారం రోజుల పాటు మద్యం కొరత ఏర్పడటంతో వ్యాపారులు కూడా కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున తరలించి విక్రయాలు జరిపారు. అధికారిక లెక్కల ప్రకారం రూ.113 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. అనధికార లెక్కల ప్రకారం మరో వంద కోట్ల విలువ చేసే మద్యం విక్రయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నాటుసారా విక్రయాలు కూడా జోరుగా సాగాయి. జిల్లాలో నాటుసారా వ్యాపారం కుటీర పరిశ్రమగా మారింది. 200 పైగా స్థావరాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలించారు. రూ.50 కోట్లకు పైగా నాటుసారా అమ్మకాలు జరిగినట్లు అనధికారిక అంచనా. వరుస ఎన్నికలు.. ప్రతి ఎన్నికకు పోలింగ్ ముందు రెండు రోజులు మద్యం దుకాణాలు సీల్ చేయడంతో నిల్వ చేసుకున్న మద్యాన్ని వ్యాపారులు అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడం గమనార్హం.