కొద్ది గంటల్లో ఓటరు తీర్పు
* తేలనున్న నేతలు, పార్టీల భవిష్యత్తు
* నేటి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం
* 8.30 గంటల నుంచి ఈవీఎంల్లోని ఓట్ల కౌంటింగ్.. 11 గంటలకల్లా ట్రెండ్స్!
* అత్యధికంగా 45 రౌండ్లలో మల్కాజిగిరి లోక్‌సభ, కూకట్‌పల్లి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు
* అతి తక్కువగా అనకాపల్లి లోక్‌సభకు 18 రౌండ్లు, చార్మినార్ అసెంబ్లీకి 13 రౌండ్లు
* 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం
* లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు నిషేధం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం కారణంగా.. ఈ ప్రక్రియ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్రలో ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా 4.82 కోట్ల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు శుక్రవారం వెలువడనుంది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు 598 మంది పోటీ పడగా, 294 అసెంబ్లీ స్థానాలకు 3,910 మంది పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకల్లా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఏ పార్టీలు అధికారంలోకి రానున్నాయో (ట్రెండ్స్) తెలిసిపోయే అవకాశం ఉంది.
కౌంటింగ్‌కు 25 వేల మంది సిబ్బంది
రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో 168 కేంద్రాల్లోని 437 హాళ్లలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉదయం 8 గంటల కల్లా అభ్యర్థుల ఏజెంట్లందరూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురువారం భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 437 కౌంటింగ్ హాళ్లలో 6,955 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 25,000 మందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రత నిమిత్తం 75,000 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఒక కౌంటింగ్ టేబుల్‌కు ఒకరు చొప్పున సూక్ష్మ పరిశీలకుడిని నియమించడంతో పాటు ప్రతి కేంద్రంలోను అదనపు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ 189 మంది పరిశీలకులను నియమించిందన్నారు.
ఈవీఎంలన్నీ భద్రం
ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రంగా ఉన్నాయని, ఎవరూ ఈవీఎంల దగ్గరకు వెళ్లలేదని, ఎవరూ ఈవీఎంలను ఇళ్లకు తీసుకువెళ్లలేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ప్రింటర్ ఆర్గనైజర్ డిస్‌ప్లేను భద్రపరచడంలో అలసత్వంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రజలకు ఫలితం తెలియజేసేందుకు తెరలను ఏర్పాటు చేశారు. అతి పెద్ద లోక్‌సభ స్థానం అయిన మల్కాజిగిరి ఓట్లను అత్యధికంగా 45 రౌండ్లలో లెక్కిస్తారు.
అనకాపల్లి లోక్‌సభ స్థానం కౌంటింగ్ 18 రౌండ్లలోనే పూర్తి కానుంది. అలాగే కూకట్‌పల్లి అసెంబ్లీ ఓట్లను కూడా అత్యధికంగా 45 రౌండ్లలో లెక్కించనున్నారు. చార్మినార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మాత్రం 13 రౌండ్లలోనే పూర్తి కానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఎన్నికల సిబ్బంది ‘బ్యాలెట్ యూనిట్’లను ఆన్ చేస్తారు. ప్రతిరౌండ్ లెక్కింపు తర్వాత ప్రింట్‌అవుట్‌ను అభ్యర్థుల తరఫు ఏజెంట్లకు అందజేస్తారు. ఫలితాలను ఠీఠీఠీ.ఛిౌ్ఛ్చఛీజిట్చ.జీఛి.జీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. గురువారం అర్ధరాత్రి నుంచి 17వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురావడంపైనా నిషేధం విధించారు.