సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను ఆయా జిల్లాల కలెక్టర్లు రోజూ సందర్శించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ నెల 16న జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి సూచనలు చేశారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఆర్వోలను, కలెక్టర్లను, ఎన్నికల సిబ్బందిని అభినందించారు. స్ట్రాంగ్ రూంల వద్ద ఇరవైనాలుగు గంటలూ భద్రత ఉండేలా చూడాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించుకునేందుకు వీలుగా షామియానాల వంటివి ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట రీ పోలింగ్‌ను నెల 12 న నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుందన్నారు. లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్‌లుగా కేంద్ర ఉద్యోగులను, కౌంటింగు సూపర్‌వైజర్‌లుగా గెజిటెడ్ అధికారులను, కౌంటింగ్ సహాయకులుగా ఇతర ఉద్యోగులను నియమించుకోవాలన్నారు.
కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. లెక్కింపు సిబ్బందికి ఈ నెల 14న, మైక్రో అబ్జర్వర్‌లకు 15న శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈవీఎంల నిమిత్తం గొడౌన్ నిర్మాణానికి ఇంతవరకూ రూ.50 లక్షలు ఖర్చు చేశామని, ఇంకా రూ.50 లక్షలు అవసరం వుందన్నారు. నిధులు ఇస్తే జూలై నెలాఖరు నాటికి పూర్తి కాగలదన్నారు. ఎన్నికల తనిఖీల్లో ఇంతవరకూ రూ.9.12 కోట్ల నగదు, రూ.2 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
స్ట్రాంగ్‌రూంలను రోజూ సందర్శించండి
Published Fri, May 9 2014 11:40 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement