వైఎస్సార్‌సీపీని గెలిపించండి.. ప్రగతికి పట్టం కట్టండి
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి ప్రగతికి పట్టం కట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఎన్నో అంశాల్లో వెనుకబడిఉందని చెప్పారు. గతంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదమని చెప్పి ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీని ప్రజలు తప్పక తిరస్కరిస్తారన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు కేవలం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలయ్యాయన్నారు. ఎంతో మంది పేదలకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందన్నారు. అలాంటి మహోన్నత పథకాన్ని మహానేత మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు సక్రమంగా కొనసాగించలేకపోయారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగి పేదల కష్టాలు తెలుసుకుని వారి సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టో తయారు చేశారని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. అమ్మఒడి పథకం పేద తల్లిదండ్రులు, బిడ్డలకు ఆసరాగా నిలుస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యంతో పాటు రోగి విశ్రాంతి కాలానికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని చెప్పడంతో జగన్‌ను పేదలకు మరింత అక్కున చేర్చిందన్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కీలకపాత్ర పోషించే ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాకు చెందిన నాయకులు కావడంతో వీరి గెలుపుతో అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరూ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.