nookasani balaji
-
వైఎస్సార్సీపీని గెలిపించండి.. ప్రగతికి పట్టం కట్టండి
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి ప్రగతికి పట్టం కట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఎన్నో అంశాల్లో వెనుకబడిఉందని చెప్పారు. గతంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదమని చెప్పి ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీని ప్రజలు తప్పక తిరస్కరిస్తారన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు కేవలం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలయ్యాయన్నారు. ఎంతో మంది పేదలకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందన్నారు. అలాంటి మహోన్నత పథకాన్ని మహానేత మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు సక్రమంగా కొనసాగించలేకపోయారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగి పేదల కష్టాలు తెలుసుకుని వారి సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టో తయారు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. అమ్మఒడి పథకం పేద తల్లిదండ్రులు, బిడ్డలకు ఆసరాగా నిలుస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యంతో పాటు రోగి విశ్రాంతి కాలానికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని చెప్పడంతో జగన్‌ను పేదలకు మరింత అక్కున చేర్చిందన్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కీలకపాత్ర పోషించే ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాకు చెందిన నాయకులు కావడంతో వీరి గెలుపుతో అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులందరూ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
బంద్ సంపూర్ణం
ఒంగోలు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార సంస్థలతో పాటు బ్యాంకులు కూడా మూతపడ్డాయి. ప్రైవేటు విద్యా సంస్థలూ బంద్ పాటించాయి. ఏపీఎన్జీవోలు ఆందోళనలకు దిగగా విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర కార్యాచరణ సమితి నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కందుకూరులో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ, మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి అక్కడి నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మొత్తం పదిమందిని అరెస్టు చేశారు. దర్శిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి దగ్గరుండి బంద్‌ను విజయవంతం చేయించారు. ఒంగోలులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ తదితరులు బంద్ విజయవంతం చేయించారు. ఉదయం 4.30 గంటలకే ఆర్టీసీ గ్యారేజీ వద్ద బస్సులను అడ్డుకున్నారు. గంటన్నర అనంతరం పోలీసులు 15 మంది నాయకులను అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. మరో వైపు ఏపీఎన్జీవో సంఘ నగర అధ్యక్షుడు నాసర్‌వలి, నాయకులు శరత్, మీరావలి, షరీఫ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వీజీకే ప్రసాద్, ఏఈ నాగేశ్వరరావు తదితరులు ప్రకాశం భవనంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులను బంద్‌కు సహకరించాల్సిందిగా కోరుతూ బయటకు రప్పించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. సీపీవో కాన్ఫరెన్స్ హాలులో జరుగుతున్న ఒంగోలు రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశాన్ని కూడా నిలిపివేయాల్సిందేనంటూ ఉద్యోగులు సీపీవో కాన్ఫరెన్స్‌హాలు వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉద్యోగుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నాయకలు కూడా అక్కడకు వచ్చి సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సమీక్ష సమావేశాన్ని రద్దుచేసి కలెక్టర్ బయటకు వచ్చారు. చీరాలలో నియోజకవర్గ సమన్వయకర్తలు అవ్వారు ముసలయ్య, సజ్జాహేమలతలు అక్కడి నాయకులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు బస్సులను అడ్డుకున్నారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ, తదితర నాయకులు బస్సులను అడ్డుకోవడంతో పాటు పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగేటట్లు చర్యలు చేపట్టారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకే వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పిన్నిక లక్ష్మీప్రసాద్, మరికొందరు సంఘీభావం ప్రకటించి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి, మండల కన్వీనర్లు కలిసి వైఎస్సార్ సెంటర్లో రాస్తారోకో చేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరా సామి రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు దప్పిలి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. యర్రగొండపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మద్దిపాడులో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆందోళనలకు దిగారు. టంగుటూరు, పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లోకూడా రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు జరిగాయి. టంగుటూరులో టి.బిల్లుల ప్రతులను మండల కన్వీనర్ బొట్ల రామారావు తదితరులు దహనం చేసి నిరసన తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో సంతమాగులూరు ఆర్టీసీ బస్టాండు వద్ద వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో.. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రాయపాటి జగదీశ్ ఒంగోలు దక్షిణ బైపాస్‌లో రాస్తారోకో నిర్వహించారు. సీఎం హెలికాప్టర్‌నే పేల్చివేస్తానంటూ ప్రకటించిన పొన్న ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ స్థానిక మంగమూరు రోడ్డు జంక్షన్లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించింది. సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని జిల్లా చైర్మన్ కట్టా నాగరాజు, కన్వీనర్ ఎస్.వెంకటరావు స్పష్టం చేశారు. -
విభజనపై భగ్గుమన్న యువజనం
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా యువత భగ్గుమంది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో యువజనులు, విద్యార్థులతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని ప్రశ్నిస్తూ యువత గళం విప్పారు. ఒంగోలులో ఉదయం పార్టీ కార్యాలయం నుంచి యువకులు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో రాస్తారోకో చేపట్టారు. జిల్లాస్థాయి నేతల సహా అందరూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయం అశాస్త్రీయమైనదన్నారు. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలవాల్సిందిపోయి ప్యాకేజీలు కోరడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా కంకణబద్ధులు కావాలని నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చే హక్కు జైరాం రమేష్కుగాని, దిగ్విజయ్‌సింగ్‌కు గానీ ఎక్కడిదో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. తమ సొంత రాష్ట్రాల్లో ప్రజల చేత ఛీకొట్టించుకునేవారా తెలుగువారిని విభజించేది అంటూ మండిపడ్డారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే నష్టపోయేది ఎక్కువగా విద్యార్థులే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధికారప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు నత్తల భీమేష్, జాజుల కృష్ణ, యువజన విభాగం రాష్ట్ర నాయకులు మారెడ్డి రామకృష్ణారెడ్డి, సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దర్శిలో తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి విద్యార్థులు, యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం సమీపం నుంచి పట్టణం మొత్తం ర్యాలీ చేపట్టారు. అనంతరం దర్శిలోని గడియారస్తంభం సెంటర్లో మానవహారం చేపట్టడంతోపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు ఒక పక్క అన్యాయం జరుగుతుందని తెలిసినా సీమాంధ్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. తమపై విశ్వాసముంచి గెలిపించిన నాయకులకు వెన్నుపోటు పొడిచిన వారికి బుద్ధి చెప్పేందుకు జనం మొత్తం సమాయత్తం కావాలన్నారు. కనిగిరిలో యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన ర్యాలీలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి పాల్గొన్నారు. మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవం కేవలం ఆ రాష్ట్రాల్లోని వ్యతిరేకత మాత్రమే కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలన్నారు. సంతనూతలపాడులో నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీగా మోటారు బైకు ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మాత్రమే తొలినుంచి సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తికి సంఘీభావం పలికేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మార్కాపురంలో జరిగిన యువజనుల ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. కోర్టుసెంటర్‌లో రాస్తారోకో చేశారు. కేంద్రమంత్రులు, ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి చేతగానితనం వల్లే రాష్ర్టం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చోటుచేసుకున్నాయని విమర్శించారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించుకుంటేనే సీమాంధ్రలో సంతోషం ఉంటుందన్నారు. ముందుగా గిద్దలూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. యర్రగొండపాలెంలో యువకులు, విద్యార్థులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని మానవహారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయిందని, రాబోయే ఎన్నికల్లో భూస్థాపితం కాకతప్పదని ఆయన అన్నారు.