ఒంగోలు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార సంస్థలతో పాటు బ్యాంకులు కూడా మూతపడ్డాయి. ప్రైవేటు విద్యా సంస్థలూ బంద్ పాటించాయి. ఏపీఎన్‌జీవోలు ఆందోళనలకు దిగగా విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర కార్యాచరణ సమితి నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కందుకూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ, మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి అక్కడి నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక రాజకీయ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మొత్తం పదిమందిని అరెస్టు చేశారు. దర్శిలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి దగ్గరుండి బంద్‌ను విజయవంతం చేయించారు. ఒంగోలులో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ తదితరులు బంద్ విజయవంతం చేయించారు. ఉదయం 4.30 గంటలకే ఆర్టీసీ గ్యారేజీ వద్ద బస్సులను అడ్డుకున్నారు. గంటన్నర అనంతరం పోలీసులు 15 మంది నాయకులను అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
మరో వైపు ఏపీఎన్‌జీవో సంఘ నగర అధ్యక్షుడు నాసర్‌వలి, నాయకులు శరత్, మీరావలి, షరీఫ్, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వీజీకే ప్రసాద్, ఏఈ నాగేశ్వరరావు తదితరులు ప్రకాశం భవనంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులను బంద్‌కు సహకరించాల్సిందిగా కోరుతూ బయటకు రప్పించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. సీపీవో కాన్ఫరెన్స్ హాలులో జరుగుతున్న ఒంగోలు రెవెన్యూ డివిజన్ సమీక్ష సమావేశాన్ని కూడా నిలిపివేయాల్సిందేనంటూ ఉద్యోగులు సీపీవో కాన్ఫరెన్స్‌హాలు వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉద్యోగుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ నాయకలు కూడా అక్కడకు వచ్చి సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సమీక్ష సమావేశాన్ని రద్దుచేసి కలెక్టర్ బయటకు వచ్చారు.
చీరాలలో నియోజకవర్గ సమన్వయకర్తలు అవ్వారు ముసలయ్య, సజ్జాహేమలతలు అక్కడి నాయకులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు బస్సులను అడ్డుకున్నారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ, తదితర నాయకులు బస్సులను అడ్డుకోవడంతో పాటు పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగేటట్లు చర్యలు చేపట్టారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకే వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పిన్నిక లక్ష్మీప్రసాద్, మరికొందరు సంఘీభావం ప్రకటించి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి, మండల కన్వీనర్లు కలిసి వైఎస్సార్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు.
పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరా సామి రంగారెడ్డి, రైతు సంఘం నాయకులు దప్పిలి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. యర్రగొండపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మద్దిపాడులో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆందోళనలకు దిగారు. టంగుటూరు, పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లోకూడా రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు జరిగాయి. టంగుటూరులో టి.బిల్లుల ప్రతులను మండల కన్వీనర్ బొట్ల రామారావు తదితరులు దహనం చేసి నిరసన తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో సంతమాగులూరు ఆర్టీసీ బస్టాండు వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.
విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో..
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రాయపాటి జగదీశ్ ఒంగోలు దక్షిణ బైపాస్‌లో రాస్తారోకో నిర్వహించారు. సీఎం హెలికాప్టర్‌నే పేల్చివేస్తానంటూ ప్రకటించిన పొన్న ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ స్థానిక మంగమూరు రోడ్డు జంక్షన్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించింది. సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని జిల్లా చైర్మన్ కట్టా నాగరాజు, కన్వీనర్ ఎస్.వెంకటరావు స్పష్టం చేశారు.
బంద్ సంపూర్ణం
Published Sat, Jan 4 2014 1:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement