ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా యువత భగ్గుమంది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో యువజనులు, విద్యార్థులతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని ప్రశ్నిస్తూ యువత గళం విప్పారు. ఒంగోలులో ఉదయం పార్టీ కార్యాలయం నుంచి యువకులు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగమూరు రోడ్డు జంక్షన్‌లో రాస్తారోకో చేపట్టారు. జిల్లాస్థాయి నేతల సహా అందరూ రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయం అశాస్త్రీయమైనదన్నారు. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలవాల్సిందిపోయి ప్యాకేజీలు కోరడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా కంకణబద్ధులు కావాలని నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చే హక్కు జైరాం రమేష్‌కుగాని, దిగ్విజయ్‌సింగ్‌కు గానీ ఎక్కడిదో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. తమ సొంత రాష్ట్రాల్లో ప్రజల చేత ఛీకొట్టించుకునేవారా తెలుగువారిని విభజించేది అంటూ మండిపడ్డారు.
యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే నష్టపోయేది ఎక్కువగా విద్యార్థులే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధికారప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు నత్తల భీమేష్, జాజుల కృష్ణ, యువజన విభాగం రాష్ట్ర నాయకులు మారెడ్డి రామకృష్ణారెడ్డి, సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
దర్శిలో తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి విద్యార్థులు, యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం సమీపం నుంచి పట్టణం మొత్తం ర్యాలీ చేపట్టారు. అనంతరం దర్శిలోని గడియారస్తంభం సెంటర్‌లో మానవహారం చేపట్టడంతోపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు ఒక పక్క అన్యాయం జరుగుతుందని తెలిసినా సీమాంధ్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. తమపై విశ్వాసముంచి గెలిపించిన నాయకులకు వెన్నుపోటు పొడిచిన వారికి బుద్ధి చెప్పేందుకు జనం మొత్తం సమాయత్తం కావాలన్నారు.
కనిగిరిలో యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి పాల్గొన్నారు. మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవం కేవలం ఆ రాష్ట్రాల్లోని వ్యతిరేకత మాత్రమే కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలన్నారు.
సంతనూతలపాడులో నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీగా మోటారు బైకు ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే తొలినుంచి సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తికి సంఘీభావం పలికేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మార్కాపురంలో జరిగిన యువజనుల ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. కోర్టుసెంటర్‌లో రాస్తారోకో చేశారు. కేంద్రమంత్రులు, ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి చేతగానితనం వల్లే రాష్ర్టం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చోటుచేసుకున్నాయని విమర్శించారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించుకుంటేనే సీమాంధ్రలో సంతోషం ఉంటుందన్నారు. ముందుగా గిద్దలూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. యర్రగొండపాలెంలో యువకులు, విద్యార్థులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని మానవహారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయిందని, రాబోయే ఎన్నికల్లో భూస్థాపితం కాకతప్పదని ఆయన అన్నారు.
విభజనపై భగ్గుమన్న యువజనం
Published Wed, Dec 11 2013 3:12 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement