కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఒక్క ఓటు.. నేతల తలరాతలు మార్చేస్తుంది. గెలుపోటములను తారుమారు చేస్తుంది. అందుకే తమవారందరితో ఓటు వేయించేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నం చేస్తుంటా రు. గత నెల 30వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల్లో చాలా మంది ఇంకా తమ పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోలేదు. ఈ ఓట్లను 15వ తేదీ వరకు వినియోగించుకోవచ్చు. జిల్లాలో పోరు హోరాహోరీగా సాగిందని భావిస్తున్న చోట అభ్యర్థులు ఈ ఓట్లపై దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఎంతమంది పోస్టల్ బ్యాలెట్లు పొందారు, ఎంత మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అన్న వివరాలు సేకరించిన అభ్యర్థులు.. ఇంకా ఓటు హక్కు వినియోగించుకోనివారిని కలుస్తూ తమకే ఓటేయాలని కోరుతున్నారు. ఆ ఓట్లను సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నారు.
జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో 19,659 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14,599 మందికి జిల్లా ఎన్నికల యంత్రాంగం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను జారీ చేసింది. నిజామాబాద్ అర్బన్‌లో అత్యధికంగా 2,740 మందికి పోస్టల్ బ్యాలెట్లను జారీ చేయగా జుక్కల్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,214 మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ అయ్యాయి. కామారెడ్డిలో 1,902, నిజామాబాద్‌రూరల్‌లో 1,621, ఆర్మూర్‌లో 1,547, బాల్కొండలో 1,437, బాన్సువాడలో 1,400, బోధన్‌లో 1,393, ఎల్లారెడ్డిలో 1,345 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి. జిల్లాలో ఇప్పటివర కు 8 వేల మంది పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్నారు.
ఇంకా ఆరు వేల పైచిలుకు ఓట్లు వినియోగించుకోవాల్సి ఉంది. పలు నియోజకవర్గాల్లో ఈ ఓట్లు కీలకం కావడంతో వీటిని సొంతం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయాస పడుతున్నారు. సాధారణ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వీటిని వినియోగించుకోవడానికి పక్షం సమయంలో ఉండడంతో సదరు ఓటర్లకు సైతం గిరాకీ పెరిగింది. అయితే అభ్యర్థులు నేరుగా కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులను, తమకు అనుకూలమైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను రంగంలోకి దింపి బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. కొందరు అభ్యర్థులు ఫోన్ నంబర్లు సేకరించి, సదరు ఓటర్లతో మాట్లాడుతున్నారు. తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రలోభాలకూ పాల్పడుతున్నట్లు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్లు ఎందరి తలరాతలు మారుస్తాయో వేచి చూడాలి.
ఆఖరి ప్రయత్నం
Published Wed, May 7 2014 4:30 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement