ఒంటరి పోరు.. కారుదే జోరు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒంటరి పోరు తో 2014లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో పాటు కొత్త రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడంలో సఫలమైంది. తాజా ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ఏడు స్థానాల్లో అతి సులభంగా గెలుపొందింది. అదే విధంగా ఆది లాబాద్ పార్లమెంటు స్థానాన్ని సైతం భారీ మెజార్టీ తో దక్కించుకొని తిరుగులేని పార్టీగా జిల్లాలో నిల బడింది.
2004లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పె ట్టుకొని జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ముథోల్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తూ ర్పు ప్రాంతంలోని చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి) అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో గెలిచిన ఏడుగురిలో నలుగురు కొత్తవారు కావడం విశేషం. మరో ముగ్గురు సీనియర్లు ఉన్నారు. బోథ్ నుంచి గెలిచిన రాథోడ్ బాపురావు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చి తన కం టే రాజకీయాల్లో సీనియర్, అదే ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన సోయం బాపురావును ఓడించారు.
బెల్లంపల్లి నుంచి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని దుర్గం చిన్నయ్య తనకంటే సీనియర్, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లేశ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవ లక్ష్మి కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సి ట్టింగ్ ఎమ్మెల్యే, పెద్ద నాయకుని అండ ఉన్న సక్కు ను ఓడించి సత్తా చాటుకున్నారు. ఖానాపూర్ నుంచి గెలిచిన రేఖానాయక్ కూడా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రాథోడ్ రమేశ్ కుమారుడు రితీశ్ రాథోడ్‌ను ఎదుర్కొని విజయాన్ని అందుకొంది.
పాతవారిలో ఆదిలాబాద్ నుంచి గతంలో రెండుసార్లు గెలుపొందిన జోగు రామన్న ఈసారి సులువుగానే బయట పడ్డారు. చెన్నూర్ నుంచి మూడో సారి గెలుపొందిన నల్లాల ఓదెలు కూడా స్థానిక అంశం, కార్మికుల అండ కలిసిరావడం కలిసి వచ్చింది. మంచిర్యాల నుంచి మూడో సారి గెలుపొందిన దివాకర్‌రావు చివరి సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరి పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.