
ఓటు పడలేదా..? వేటు పడుద్ది..!
నెల రోజులకు పైగా గ్రామ, పట్టణాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల వద్ద హంగామా సృష్టించారు.
మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : నెల రోజులకు పైగా గ్రామ, పట్టణాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల వద్ద హంగామా సృష్టించారు. ‘అన్నా గెలుపు మనదే.. మన చేతిలో ఊరు, వాడా, గల్లీవాసులు ఉన్నారు..’ అంటూ ఊదరగొట్టారు. ‘ఓట్లన్నీ మనకే పడుతాయి, నువ్వేం ఫికర్ జేయకు, నన్ను కాదని నా వోళ్లంతా ఎటూ పోరు..’ అంటూ భరోసానిచ్చారు. మాయమాటలతో డబ్బులు లాగిన నాయకులకు గుబులు మొదలైంది. మరో తొమ్మిది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈవీఎంలు కావడంతో వార్డుల వారీగా లెక్క తేలనుంది. ఏ వార్డులో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే విషయమూ అభ్యర్థులకు తెలిసిపోనుంది. ప్రగల్భాలు పలికిన మేరకు ఓట్లు రాలకపోతే పరిస్థితి ఏమిటనే విషయమై తర్జన భర్జన పడుతున్నారు. ఓట్లు పడితే భవిష్యత్ ఉంటుంది, లేదంటే వేటు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాలెట్ ద్వారా ఓటు వేసినప్పుడు అన్ని కలిపి లెక్కించేవారు. ప్రస్తుతం ఈవీఎం కావడంతో పరిస్థితి మారిపోయింది. తమ ఊళ్లో.. వార్డులో ఆధిక్యం మనదే, ప్రత్యర్థులకు ఓట్లు పడలేదు అని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వారీగా కమిటీలు వేసి గెలుపు కోసం కృషి చేయాలని అభ్యర్థులు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను కోరారు.
దీంతో ఎన్నో మాటలు చెప్పి మూటలు పట్టుకెళ్లారు. మనసులో ఉన్న కోరికలు సాధించుకున్నారు. తీరా ఫలితాల సమయం ఆసన్నం కావడంతో రోజు రోజుకు గుబులు రెట్టింపవుతోంది. నాయకులు కూడా కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయని, ఎవరు ఎంత పట్టుకెళ్లారో నాయకుల వివరాలతో లెక్కలేస్తున్నారు. ఫలానా చోట ఇంత ఇచ్చాం.. ఇన్ని ఓట్లు రావాలని తేల్చేస్తున్నారు. ఆశించిన మేరకు ఓట్లు రాని చోట అక్కడి నాయకులు డబ్బు, మద్యం పంచలేదనే అభిప్రాయానికి అభ్యర్థులు రాక తప్పదు. దీంతో అక్కడి నాయకులపై వేటు తప్పదు మరీ.