
అందరి దృష్టి ఆమెపైనే..!
జయసుధ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: గత శాసనసభ(2009) ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయ దుందుభి మోగించిన ప్రసిద్ధ సినీనటి, తాజా మాజీ ఎమ్మెల్యే జయసుధ భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో సహకరించిన లష్కర్‌లోని కాంగ్రెస్ నేతలు తాజా ఎన్నికల్లో ఆమెకు దూరంగా ఉన్నారు. అయినా ఆమె విజయం తనదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ ఆమె గెలిచినట్టయితే, గ్రేటర్ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా తెలంగాణ శాసనసభలో అడుగిడనున్నారు. గత ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి చలవతో నియోజకవర్గంలోని నాయకులందరూ ఆమె పక్షాన నిలిచారు. కాంగ్రెస్ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేసిన ఆశావహులు సైతం పక్కన్నే ఉండి విజయంలో భాగస్వాములయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఆశావహులు ఎన్నికల ప్రచారంలో కనిపించకపోగా, కార్పొరేటర్లు ప్రచారానికి దూరంగా ఉన్నారు.
కనిపించని ఆశావహులు..
సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పీసీసీ నాయకులుగా కొనసాగుతున్న పిట్ల కృష్ణ, ఆదం సంతోష్‌కుమార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. టికెట్ రాలేదని కొద్దిరోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి దంపతులు కేంద్రమంత్రి జైరామ్మ్రేష్ రాకతో ప్రచారంలో పాల్గొన్నారు. జయసుధ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఆరు డివిజన్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే కార్పొరేటర్లుగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. వైఎస్సార్‌సీపీ ప్రారంభంలోనే పార్టీలో చేరిన సీతాఫల్‌మండి కార్పొరేటర్ ఆదం విజయ్‌కుమార్ తాజా ఎన్నికల్లో అదేపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి జయసుధకు ప్రత్యర్థిగా మారారు. తన భర్తకు కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో నిరాశకు గురైన బౌద్దనగర్ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి ప్రచారానికి దూరంగా ఉన్నారు. మెట్టుగూడ కార్పొరేటర్ ఎంఆర్.శ్రీనివాస్‌రావు, అడ్డగుట్ట కార్పొరేటర్ గంటా రత్నకుమారి మాత్రమే జయసుధకు అండగా నిలిచారు.
గెలిస్తే రికార్డే..
రాజకీల్లోకి వచ్చిన సినిమా నటులు ఎక్కడా రెండు మార్లు గెలిచిన దాఖలాలు లేవని కొందరు, ఆమె నిజాయతీ పనితీరుకు పెద్దసంఖ్యలో ఓటర్లు అండగా నిలిచారని, మైనారిటీల మద్దతు జయసుధకే ఉందని మరికొందరు చెబుతున్నారు. వీరి అంచనాలకు తగ్గట్టు జయసుధ విజయం సాధిస్తే ఈ నియోజకవర్గం నుంచి రెండోమారు గెలిచిన తొలి మహిళగా రికార్డు సొంతం చేసుకోనున్నారు.