ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందిన పొంగులేటి శనివారం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటానని, జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ విజయం ప్రజలదేనని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
తనతో పాటు ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను, ఒక సీపీఎం ఎమ్మెల్యేను జిల్లా ప్రజలు గెలిపించారని, జగనన్న బలపరిచిన తమను జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అభిమానులు ఆదరించారని పేర్కొన్నారు. తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఏ ఆలోచనతో తమను గెలిపించారో వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేందుకు పాటుపడతామని చెప్పారు.
కలెక్టర్ అభినందనలు...
ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన పొంగులేటిని ముందుగా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిక్లరేషన్‌ను పొంగులేటికి అందించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు పలుమార్లు పరిశీలించడం వల్ల లెక్కింపులో కొంత ఆలస్యం జరిగిందని కలెక్టర్ వివరించారు. మీ హయాం లో సూర్యాపేట, దేవరపల్లి రహదారిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ పొంగులేటికి సూచిం చారు. కొత్తగూడెం నుంచి జగదల్‌పూర్ వరకు ఫోర్‌లైన్ నిర్మాణానికి జీవో వచ్చిందని, ఎన్నికల కోడ్ వల్ల పనులు ప్రారంభించలేదన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విశేష కృషిచేస్తానన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్‌లో స్వీట్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాదు రమేష్‌రెడ్డి, పార్టీ నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, వైఎస్సార్‌సీపీ టీచర్స్ విభాగం కన్వీనర్ గురుప్రసాద్, నాయకులు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, ఖమ్మం నగర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి,జిల్లేపల్లి సైదులు,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.