srinivasa sri naresh
-
ఉద్యోగం ఇచ్చారు.. పోస్టింగ్ ఆపారు..
అతడొక అభాగ్యుడు. ఆకలితో నకనకలాడుతున్నాడు. నోటి వద్దకు అన్నం ముద్ద వచ్చింది. ప్రాణం లేచొచ్చింది. ఆవురావురుమంటూ తినేందుకు నోరు తెరిచాడు... అంతలోనే ఆ ముద్ద వెనక్కి జరిగింది. అది ముందుకు రాదు.. వెనక్కు వెళ్లదు..! ఇక, ఆ అభాగ్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి అభాగ్యులు మన జిల్లాలో 35మంది ఉన్నారు. వారి నోటి కాడి ముద్ద ఎలా దూరం దూరంగా జరిగిందో చదవండి. - ఖమ్మం జడ్పీసెంటర్ ఇదీ నేపథ్యం జిల్లావ్యాప్తంగా 83 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకిగాను ఏపీపీఎస్సీ ద్వారా గత ఏడాది డిసెంబర్ 31ననోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 23న పరీక్షలు జరిగారుు. మార్చి 24న ఫలితాలు వెలువడ్డాయి. అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాలను జూన్ 9న జిల్లాపరిషత్ అధికారులు పరిశీలించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 83 పోస్టులను భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు వచ్చారుు. జూలై 11న 83 మంది అభ్యర్థులకు అధికారులు నియూమక పత్రాలు (అపాయింట్మెంట్ లెటర్లు) ఇచ్చారు. వీరిలో 35మందిని ఏడు (పోలవరం ముంపు) మండలాలకు కేటారుుంచారు. వీరిని మినహారుుం చి, మిగతా 48మందికి పోస్టింగ్ ఇచ్చారు. విభజనతో బ్రేక్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రాకు వెళ్లడంతో ఈ 35మంది పోస్టింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. వీరికి పోస్టింగ్ ఎలా ఇవ్వాలో స్పష్టత ఇవ్వాలంటూ అప్పటి కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు రాలేదు. ఈ అభ్యర్థులు నాటి నుంచి.. అంటే, గత ఐదు నెలలుగా పోస్టింగ్ కోసం జిల్లాపరిషత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని వీరు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయూంలో ఈ పరీక్షలు జరిగారు. 35 పోస్టులు ఏపీకి వెళ్లారుు. మిగిలిన 48 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చారుు’’ అని, జిల్లాపరిషత్ అధికారులు చెబుతున్నారు. అపారుుంట్‌మెంట్ లెటర్లు అందుకున్న మిగిలిన 35మందికి పోస్టింగ్ కేటారుుంపు విషయమై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని వారు అంటున్నారు. జిల్లా పరిషత్‌లో నిరసన ఐదు నెలలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నప్పటికీ తమను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఈ 35మంది అభ్యర్థులు గురువారం జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమతోపాటు అపారుుంట్‌మెంట్ లెటర్లు తీసుకున్న 48మంది ఉద్యోగం చేస్తుండగా, తాము మాత్రం ఇలా చెప్పులరిగేలా తిరుగుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వద్దకు డీపీవో రవీందర్, జిల్లాపరిషత్ ఏఓ వచ్చి సర్దిచెప్పేందుకు యత్నించారు. ‘‘35 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం నిర్ణయూనుసారం చర్యలు తీసుకుంటాం’’ అని, వారు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వైఖరి కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు అన్నారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. -
అవినీతిపైఉక్కుపాదం
ఖమ్మం జెడ్పీసెంటర్: అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతానని కలెక్టర్ కె.ఇలంబరితి అన్నారు. జిల్లా 44వ కలెక్టర్‌గా శుక్రవారం ఉదయం 5.36 నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి బయలుదేరి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి తరువాత గత కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ వచ్చి సీటీసీ ఫైలుపై సంతకం చేసి నూతన కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీటీసీపై సంతకం చేసిన ఇలంబరితి కలెక్టర్ కుర్చీలో ఆసీనులయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారద ర్శక పాలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. జిల్లాలో అన్ని శాఖలలో పాలన సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తానని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటానని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. రైతు సమస్యలపై తక్షణమే స్పందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తగు ప్రాధాన్యత ఇస్తానన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ జ యప్రకాష్ నారాయణ, కలెక్టరేట్ ఏవో చూడామణి, డీటీలు బొగ్గారపు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు ఆశోక్, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వరప్రసాద్, డివిజనల్ పీఆర్వో దశరథం తదితరులు పాల్గొన్నారు. మీ ఆశీస్సులుండాలి : శ్రీనరేశ్తో ఇలంబరితి బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాత, కొత్త కలెక్టర్లిద్దరూ సరదాగా సంభాషించుకున్నారు. సీటీసీ ఫైలుపై కొత్త కలెక్టర్ పెట్టిన సంతకం చూసిన పాత కలెక్టర్ తన సంతకం కన్నా పెద్దగా ఉందని ఇలంబరితినుద్దేశించి అన్నారు. దీనికి సరదాగా స్పందించిన ఇలంబరితి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని శ్రీనరేశ్‌ను కోరారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. -
జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కొత్త కలెక్టర్‌గా డాక్టర్. కె.ఇలంబరితి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస శ్రీనరేశ్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఇలంబరితిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యువ ఐఏఎస్ అధికారి అయిన ఇలంబరితి జిల్లా 44వ కలెక్టర్‌గా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కలెక్టర్ శ్రీనరేశ్‌ను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. 2005 బ్యాచ్ అధికారి యువ ఐఏఎస్ అధికారి అయిన ఇలంబరితి తమిళనాడుకు చెందిన వారు. ఆయన 2005లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. చెన్నై యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సెన్సైస్ కోర్సు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయిన ఈయన 2005 ఆగస్టులో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈవోగా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జోనల్ కమిషనర్‌గా, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ అనే అంశంపై శిక్షణ కూడా తీసుకున్నారు. శ్రీనరేశ్‌కు వీడ్కోలు గత ఏడాది జూన్ 24న బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ త్వరలోనే వీడ్కోలు తీసుకోనున్నారు. ఒక ఏడాది 36 రోజుల పాటు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఈయన హయాంలోనే జిల్లాలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఈయన ప్రశంసనీయ పాత్ర పోషించారు. సమస్యలపై స్పందించడంలో మంచి పేరే తెచ్చుకున్న శ్రీనరేశ్.. కారణాలేవైనా జిల్లాపై తన ముద్రను మాత్రం వేయలేకపోయారనే చెప్పుకోవాలి. -
ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందిన పొంగులేటి శనివారం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ఎంపీగా తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటానని, జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ విజయం ప్రజలదేనని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. తనతో పాటు ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను, ఒక సీపీఎం ఎమ్మెల్యేను జిల్లా ప్రజలు గెలిపించారని, జగనన్న బలపరిచిన తమను జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అభిమానులు ఆదరించారని పేర్కొన్నారు. తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఏ ఆలోచనతో తమను గెలిపించారో వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేందుకు పాటుపడతామని చెప్పారు. కలెక్టర్ అభినందనలు... ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన పొంగులేటిని ముందుగా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిక్లరేషన్‌ను పొంగులేటికి అందించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు పలుమార్లు పరిశీలించడం వల్ల లెక్కింపులో కొంత ఆలస్యం జరిగిందని కలెక్టర్ వివరించారు. మీ హయాం లో సూర్యాపేట, దేవరపల్లి రహదారిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ పొంగులేటికి సూచిం చారు. కొత్తగూడెం నుంచి జగదల్పూర్ వరకు ఫోర్‌లైన్ నిర్మాణానికి జీవో వచ్చిందని, ఎన్నికల కోడ్ వల్ల పనులు ప్రారంభించలేదన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విశేష కృషిచేస్తానన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు కలెక్టరేట్లో స్వీట్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాదు రమేష్‌రెడ్డి, పార్టీ నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, వైఎస్సార్సీపీ టీచర్స్ విభాగం కన్వీనర్ గురుప్రసాద్, నాయకులు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముస్తఫా, ఖమ్మం నగర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి,జిల్లేపల్లి సైదులు,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘విలీన’ ఆస్తులపై 11లోగా నివేదిక ఇవ్వాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో... సీమాంధ్రలో కలుస్తున్న గ్రామాలకు సంబంధించిన ఫైళ్లు, స్థిర, చర ఆస్తులు, మానవ వనరులు తదితర అంశాలపై ఈనెల 11లోగా నివేదిక అందజేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. సీమాంధ్రలో కలుస్తున్న మండలాలపై చర్చించేందుకు గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీమాంధ్రలో కలుస్తున్న 136 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన ఆస్తులు, కోర్టు కేసులు, వివిధ రకాల పథకాలు, కార్యక్రమాల సమాచారంపై పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలని సూచించారు. భద్రాచలం డివిజన్లోని 98 రెవెన్యూ గ్రామాలు, పాల్వంచ డివిజన్లోని 38 రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలో కలుస్తున్నందున మిగిలిన గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ గ్రామాలను ఏ మండలంలో కలిపితే బాగుటుందో ప్రతిపాదనలు సమర్పిస్తే అట్టి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. విభజనకు సంబంధించిన గ్రామాల మ్యాప్‌ను ఖమ్మం వెబ్సైట్లో పెట్టాలని, ఆ సీడీ హర్డ్‌కాపీని అధికారులకు అందజేయాలని సర్వే అండ్‌ల్యాండ్ రికార్డు ఏడీని కలెక్టర్ ఆదేశించారు. విభజనకు సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు చాలా సున్నితమైనవని, వీటికి సంబంధించిన రికార్డులు స్కానింగ్ చేసి భద్రపరచాలన్నారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ సీమాంధ్రలో కలుస్తున్న ప్రతి గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలపై నివేదిక అందజేయాలన్నారు. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను మూడు ఫైల్స్ తయారు చేసి సంబంధిత అధికారికి, రెవెన్యూ డివిజన్అధికారికి, కలెక్టరేట్లో ఒకటి అందజేయాలన్నారు. సీమాంధ్రలో కలుస్తున్న గ్రామాల ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వనరులు అన్ని అందేలా చూడాల న్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ దివ్య, భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం, కొత్తగూడెం రెవెన్యూ డివి జనల్ అధికారులు కె.వెంకటేశ్వర్లు, ఎస్.సత్యనారాయణ, సంజీవరెడ్డి, డి.అమయ్‌కుమార్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
1279 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు దాఖలు
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: జిల్లాలోని 10 అసెంబ్లీ, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1279 ఓట్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 753, ఆయా సెగ్మెంట్ల నుంచి ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభకు సంబంధించి 526 ఓట్లు తమకు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. భద్రాచలం సెగ్మెంట్‌కు 857 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విడుదల చేయగా శాసనసభకు 45, లోక్‌సభకు 45 ఓట్లు దాఖలయ్యాయన్నారు. అదేవిధంగా పినపాక సెగ్మెంట్‌కు 538 విడుదల చేయగా శాసనసభకు మాత్రమే 4, ఇల్లెందు సెగ్మెంట్‌కు 1363 విడుదల చేయగా శాసనసభకు 35, లోక్‌సభకు 24 ఓట్లు దాఖలయ్యాయన్నారు. ఈ మూడు సెగ్మెంట్లకు సంబంధించి మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఖమ్మం సెగ్మెంట్‌కు సంబంధించి 4261 పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేయగా శాసనసభకు 500, లోక్‌సభకు 300, పాలేరు సెగ్మెంట్‌కు 675 విడుదల చేయగా శాసనసభకు 10, లోక్‌సభకు 4, మధిర సెగ్మెంట్‌కు 809 విడుదల చేయగా శాసనసభకు 46, లోక్‌సభకు 40, వైరా సెగ్మెంట్‌కు 1146 విడుదల చేయగా శాసనసభకు 26, లోక్‌సభకు 26, సత్తుపల్లి సెగ్మెంట్‌కు 1422 విడుదల చేయగా శాసనసభకు 12, లోక్‌సభకు 12, కొత్తగూడెం సెగ్మెంట్‌కు 1588 విడుదల చేయగా శాససభకు 75, లోక్ఃసభకు 75, అశ్వారావుపేట సెగ్మెంట్‌కు 533 విడుదల చేయగా ఇప్పటివరకు ఒక్క ఓటు కూడా దాఖలు కాలేదని పేర్కొన్నారు. మొత్తం జిల్లాలోని 10 సెగ్మెంట్ల నుంచి 13,192 పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేయగా 1279ఓట్లు దాఖలు అయినట్లు వివరించారు. -
కౌంటింగ్‌కు సహకరించాలి
కొణిజర్ల, న్యూస్‌లైన్: ఈ నెల 16న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఐ. శ్రీనివాసశ్రీనరేష్ కోరారు. మండలంలోని తనికెళ్ల వద్ద ఉన్న విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల వారి సహకారంతో జిల్లాలో ఏ ఆటంకం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించగలిగామన్నారు. జిల్లావ్యాప్తంగా 80 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ సంఖ్య ఇంకా లెక్కించవలసి ఉందన్నారు. అనుకున్న లక్ష్యం 90 శాతం పోలింగ్‌కు చేరుకోలేకపోయినా తెలంగాణలో పోలింగ్ శా తంలో జిల్లా రెండోస్థానంలో ఉందన్నారు. పార్లమెంట్‌కు 83 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా శ్రమిం చిన ప్రతి అధికారిని ఆయన అభినందించారు. స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలన మధిర, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ సందర్శించారు. ఈవీఎంలు ఉంచిన తీరును పరిశీలించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేయించారు. అనంతరం అసెంబ్లీ నియోజకవ ర్గాలలో పోలింగ్ కేంద్రాల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల వివరాలు పరిశీలించారు. ప్రజా ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మధిర నియోజకవర్గం అయ్యవారిగూడెంలో ఏ గుర్తుకు నొక్కినా ఓటు కంకి కొడవలికే పడ్డాయని, పార్లమెంట్‌కు సంబంధించి 106 ఓట్లు ఆ విధంగా పడ్డాయని దీనిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎం.నిరంజన్‌రెడ్డి కలెక్టర్‌కు తెలిపారు. ఖమ్మం గ్రెయిన్ మార్కెట్‌నుంచి పోలింగ్ స్టేషన్ ఎత్తి వేయాలని అక్కడ దుమ్ము , మిర్చి ఘాటుకు తట్టుకోలేక ప్రజలు ఓటేయడానికి రావడం లేదని, దీని వల్ల పోలింగ్ శాతం పడి పోతుందని టీఆర్ఎస్ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సాధారణ పరిశీలకుడు జశ్వంత్ సింగ్, పాలేరు, ఖమ్మం, మధిర అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకుడు ఆశీష్‌కుమార్ ఘోష్, వైరా, సత్తుపల్లి,కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ పరిశీలకుడు గోబింద చంద్ర సేతి, ఐటీడీఏ పీఓ దివ్య, డీఆర్ఓ శివశ్రీనివాస్, రిటర్నింగ్ అధికార్లు అమయ్‌కుమార్, దాసరి సంజీవరెడ్డి, వెంకటాచారి, వైరా , కొణిజర్ల,చింతకాని, నేలకొండపల్లి తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
భేష్ : వరుస ఎన్నికల నిర్వహణలో సక్సెస్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండు నెలలు.... ఒకటే పని... వరుసగా దూసుకొచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం తీరిక లేకుండా పనిచేసింది. పని ఒత్తిడిని తట్టుకుని మూడు ఎన్నికలనూ ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్, ఎస్పీ రంగనాథ్‌ల నేతృత్వంలో అటు అధికార, ఇటు పోలీసు బలగాలు ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసేందుకు శ్రమించాయి. ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడం, మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతుండడం, రాజకీయంగా చైతన్యవంతమయిన జిల్లా కావడంతో అధికార యంత్రాంగం ఎక్కడా తొందరపడకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి పనిచేసిందనే భావన వ్యక్తమవుతోంది. అక్కడక్కడా చిన్న చిన్న ఇబ్బందులు, అసౌకర్యాలున్నా మొత్తం మీద ఎన్నికల నిర్వహ ణలో జిల్లా యంత్రాంగం మంచి మార్కులే సాధించిందని చెప్పవచ్చు. త్రిమూర్తుల పర్యవేక్షణలో... కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అనుభవం, ఎస్పీ రంగనాథ్ చురుకుతనానికి తోడు జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పక్కా ప్రణాళిక కలగలిపి జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా ముగిసాయి. ఎన్నికల నిర్వహణలో ఈ త్రిమూర్తులు కీలకపాత్ర మిగతా 11వ పోషించారు. వీరితో పాటు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, టీచర్లు, అంగన్వాడీలు, ఇతర శాఖలకు చెందిన సిబ్బంది వరుస ఎన్నికల నిర్వహణ కోసం శ్రమించారు. ఏ ఎన్నికయినా... నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆ ఎన్నిక ముగిసేంతవరకు అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు తమ పాత్రను పోషించారు. ఉద్యోగ సంఘాల నేతలు, ముఖ్య అధికారులు కూడా ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. జిల్లాకు ఈవీఎంలు వచ్చినప్పుడు వాటిని భద్రపర్చడం నుంచి ఎన్నికల శిక్షణ, నిర్వహణ వరకు సమన్వయంతో వ్యవహరించడంలో ఉద్యోగులు సఫలమయ్యారనే భావన వ్యక్తమవుతోంది. ఎన్నికల మీద ఎన్నికలు గత ఏడాది జూన్‌లో పంచాయతీ ఎన్నికలు ముగియగా... 10 నెలల తర్వాత మూడు ఎన్నికలు ఒకేసారి దూసుకొచ్చాయి. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసిన కారణంగా సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఆ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ముందుగా జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన వాయిదా పడి మార్చి 30న జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఆరు రోజులకే స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఏప్రిల్ 6, 11న జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించారు. మధ్యలో శ్రీరామనవమి కారణంగా ఆవిధులలో అధికారులు బిజీగా గడిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ఘట్టం, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ అన్నీ అన్నీ చకచకా అయిపోయాయి. ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలీసులకు కత్తిమీద సాము ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసులు నిర్వహించిన పాత్ర కీలకమనే చెప్పాలి. వరుసగా జరిగిన ఎన్నికలకు బందోబస్తు నిర్వహణ అంత సులభమయ్యే పనికాదు. హోంగార్డు నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు రెండునెలలుగా అలుపు లేకుండా పనిచేస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల విజయం కోసం ప్రచారానికి వచ్చే అగ్రనేతలకు బందోబస్తు అంశం పోలీసులకు ఒకరకంగా ముచ్చెమటలు పట్టించిందనే చెప్పాలి. ఒక్క కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్రస్థాయి నేతలంతా జిల్లాలో పర్యటించారు. వారికి బందోబస్తు కల్పించడం, శాంతిభద్రతలు కాపాడడం కోసం పోలీసు యంత్రాంగం తీవ్రంగానే శ్రమించింది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో పోలింగ్ నిర్వహణ కోసం పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. ఎస్పీ రంగనాథ్ ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల పోలీసుల సహకారం తీసుకుని, ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్లడంతో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాజకీయ పార్టీలు, ప్రజలదీ అద్భుత పాత్ర ఇక, జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో రాజకీయ పార్టీలు, ప్రజలు మంచి పాత్ర పోషించారు. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా ఎక్కడా ఉద్రేకాలకు లోనుకాని పరిస్థితులు కల్పించారు. ప్రజానీకం కూడా సమర్థవంతమైన బాధ్యతను నిర్వహించింది. ఎన్నికల నిబంధనల కారణంగా కొంత అసౌకర్యానికి గురయినా అధికార, పోలీసు యంత్రాంగానికి సహకరించిన జిల్లా ప్రజలు ఎన్నికల ప్రశాంతంగా ముగియడానికి దోహదపడ్డారు.మొత్తంమీద వెబ్‌కాస్టింగ్ సిబ్బందికి, కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బందికి తగిన రెమ్యునరేషన్ ఇవ్వలేదనే ఆందోళనలు, పోలింగ్‌కు వెళ్లే ఓటర్లకు అక్కడక్కడా సౌకర్యాలు లేకపోవడం లాంటి చిన్న ఘటనలు మినహా అందరి కృషి, సహకారంతో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.