జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కొత్త కలెక్టర్‌గా డాక్టర్. కె.ఇలంబరితి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస శ్రీనరేశ్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఇలంబరితిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యువ ఐఏఎస్ అధికారి అయిన ఇలంబరితి జిల్లా 44వ కలెక్టర్‌గా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కలెక్టర్ శ్రీనరేశ్‌ను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.
2005 బ్యాచ్ అధికారి యువ ఐఏఎస్ అధికారి అయిన ఇలంబరితి తమిళనాడుకు చెందిన వారు. ఆయన 2005లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. చెన్నై యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సెన్సైస్ కోర్సు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయిన ఈయన 2005 ఆగస్టులో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈవోగా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జోనల్ కమిషనర్‌గా, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ అనే అంశంపై శిక్షణ కూడా తీసుకున్నారు.
శ్రీనరేశ్‌కు వీడ్కోలు
గత ఏడాది జూన్ 24న బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ త్వరలోనే వీడ్కోలు తీసుకోనున్నారు. ఒక ఏడాది 36 రోజుల పాటు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఈయన హయాంలోనే జిల్లాలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఈయన ప్రశంసనీయ పాత్ర పోషించారు. సమస్యలపై స్పందించడంలో మంచి పేరే తెచ్చుకున్న శ్రీనరేశ్.. కారణాలేవైనా జిల్లాపై తన ముద్రను మాత్రం వేయలేకపోయారనే చెప్పుకోవాలి.