k.ilambarithi
-
నిర్లక్ష్యాన్ని సహించం
ఖమ్మం జెడ్పీసెంటర్: పేదలకు ప్రభుత్వ ఫలాలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. అధికారులు మొక్కుబడిగా సమావేశాలకు హాజరుకాకుండా యథార్థ నివేదికలతో రావాలని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ హోదాలో సమావేశానికి హాజరైన ఎంపీ కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం చైర్మన్, ఎంపీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలి విజిలెన్స్ కమిటీ సమావేశం సంతృప్తికరంగా లేదన్నారు. మొక్కుబడి నివేదికలతో అధికారులు హాజరుకావటం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు..దానికి అధికారులు సహకరించాలని కోరారు. ప్రతి మూడునెలల కోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఒకటి, రెండు పేజీల నివేదికలతో కాకుండా సమగ్ర సమాచారంతో రావాలన్నారు. తదుపరి సమావేశంలో పూర్తిస్థాయి సమీక్ష చేస్తామన్నారు. రెండునెలలకోసారి క్షేత్రపర్యటన చేసి అభివృద్ధిని పర్యవేక్షిస్తామన్నారు. ఒకటి, రెండుసార్లు మాత్రమే హెచ్చరిస్తాం..మూడోసారి సంబంధిత శాఖలకు సిఫారసు చేసి చర్యలు చేపడతామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి అభివృద్ధికి పాటుపడాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ మీదే ఎక్కువసేపు చర్చ జరిగిందన్నారు. సమీక్ష తీరు ఇలా.. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. తొలుత కలెక్టర్ కమిటీ సమావేశం నిర్వహణ తీరును వివరించారు. అనంతరం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని తనకు ఎజెండా కాపీ అందలేదన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉంటే అక్కడికి పంపించేవారని, ఇప్పుడలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సమాచార పుస్తకం పంపామని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు..కాబట్టి వారికి ఏజెండా కాపీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఎంపీ పొంగులేటి సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను సంబంధిత అధికారులు వివరించారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద 1.77 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం లక్ష్యంకాగా 50వేల వరకు నిర్మించామన్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారుల లోపం ఉందని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మరుగుదొడ్ల నిర్మా ణ వ్యయాన్ని రూ.10,900 నుంచి రూ.20వేలకు పెంచేలా తీర్మానం చేసి, ప్రతిపాదనలు పంపాలని ఎంపీ పొంగులేటి సూచించారు. ఉపాధి హామీ పనుల నిబంధనలు ఎలా ఉన్నాయి, గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానం చేస్తున్నారా? అని ఎంపీ ప్రశ్నించారు. లేబర్ బడ్జెట్ ఏర్పాటు చేసి వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పీడీ వివరించారు. ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్లు దీనిలో పరిమితికి మించి జోక్యం చేసుకుంటున్నారని కలెక్టర్ అన్నారు. వీరిని తొలగించి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఉపాధిహామీలో తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, చండ్రుగొండ, కల్లూరులో అవినీతి జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, అక్రమాలకు పాల్పడిన వారిని తొలగించాలని కోరారు. చండ్రుగొండ మండలం రావికంపాడులో వందశాతం మరుగుదొడ్లు నిర్మించినట్లు నివేదికలు ఇచ్చారు. ఆ ఊరికి బహుమతి కూడా అందజేశారు. కానీ అక్కడ ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదు..దీనిపై విచారణ చేపట్టాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వేంసూరులో కోటి రూపాయల స్కాం జరిగిందని ఎంపీడీవోను సస్పెండ్ చేశారు. నగదు రికవరీ అయిందా? లేదా? అని ఎమ్మెల్యే పాయం ప్రశ్నించారు. ఇందిర జలప్రభ పనులు పదిశాతం కూడా పూర్తికాలేదన్నారు. శాఖల మధ్య సమన్వయం లేదు. ట్రాన్స్‌కో అధికారులు ఎక్కడ అని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రశ్నించారు. ఎంపీలు సమావేశానికి వస్తే ఎస్ఈ స్థాయి అధికారి సమావేశానికి రాలేడా? అన్ని ప్రశ్నించారు. నీటిపారుదలశాఖ మొత్తం 300 పథకాలు నిర్వహిస్తుంటే వాటిలో 200 మూలకుపడ్డాయంటే ఆ శాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని ఎంపీ పొంగులేటి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలేరుపాడు మండలంలో ఇందిరమ్మ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఎవరు ఇస్తారని ఎమ్మెల్యే తాటి ప్రశ్నించారు. ఆ బిల్లులను చంద్రబాబు ఇస్తారని ఎంపీ నాయక్ సమాధానం ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా తీర్మానం చేస్తున్నట్లు పొంగులేటి ప్రకటించారు. చివరిలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట వెంకటేశ్వరరావు మృతికి సమావేశం మౌనం పాటించింది. శాసన సభ్యుల డుమ్మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలో మొదటి సారిగా జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి సత్తుపల్లి, పాలేరు, మధిర, ఖమ్మం, భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం శాసన సభ్యులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలవుతున్న తీరుపై నిర్వహించిన సమావేశానికి వారు హాజరుకాకపోవడం విమర్శలకు తావిచ్చింది. -
‘చెత్త’శుద్ధిపై చిత్త‘శుద్ధి’
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు జిల్లా అధికారులు సోమవారం ‘చెత్త’శుద్ధిపై చిత్త‘శుద్ధి’ ప్రదర్శించారు. ‘స్వచ్ఛభారత్’ను జిల్లాలో విజయవంతం చేయిం చారు. కలెక్టర్, ఎస్పీ మొదలు కిందిస్థాయి ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వరకు ప్రతిఒక్కరూ చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. డ్రెయినేజీల్లో పేరుకు పోయిన సిల్ట్‌ను తొలగించారు. కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి, ఎస్పీ ఏవీ రంగనాథ్ పలుచోట్ల ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణ- ఆవశ్యకతను వివరించారు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పరిసరాల పరిశుభ్రత కోసం జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, జిల్లా జడ్జి రమేశ్‌కుమార్, ఎస్పీ ఏవీ రంగనాథ్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ వేణుమనోహర్ తదితరులు సోమవారం ఉదయం 7 గంటలకే చీపురు, పలుగు, పారలు పట్టుకున్నారు. నగరంలో చెత్తచెదారాలు, కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారుల స్ఫూర్తితో మిగతా ఉద్యోగులు కూడా వారిని అనుసరించారు. కలెక్టర్, ఎస్పీ జిల్లా కేంద్రంతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ ప్రాంతాల్లో పర్యటించారు. స్వచ్ఛభారత్‌ను నిరంతర ప్రక్రియ చేయాలని పిలుపునిచ్చారు. చెత్తాచెదారాలను తొలగించి పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని కోరారు. మున్సిపాలిటీలు, పోలీస్ సబ్‌డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవే ట్ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు పదివేల ట్రాక్టర్ల చెత్తను తొలగించి అరుదైన రికార్డును నెలకొల్పారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, మధిర తదితర ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వెనుక ఉన్న గోళ్లపాడు చానల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించటం ద్వారా జిల్లాలో ‘స్వచ్ఛభారత్’కు శ్రీకారం చుట్టారు. చెత్తపై సమరం మూణ్నాళ్ల ముచ్చట కావద్దని, ఇదో నిరంతర పోరాటంలా కొనసాగాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. నగర జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరారు. ఖమ్మంలోని గోళ్లపాడు చానల్లో సిల్ట్‌ను తొలగించి జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత ‘స్వచ్ఛభారత్’ను ప్రారంభించారు. నగరంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ కాల్వలో సిల్ట్‌ను తొలగించారు. గాంధీజయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని కలెక్టర్, ఎస్పీ, జెడ్పీ చైర్పర్సన్, ఖమ్మం ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మురుగునీటి వల్ల దోమలు వ్యాప్తి చెంది, వ్యాధులు ప్రబలుతాయన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలన్నారు. నగరంలో 1928 టన్నుల చెత్తను తరలించారు. 23 జేసీబీలు, 191 ట్రాక్టర్లు, 20 టిప్పర్లను దీనికి ఉపయోగించారు. కొత్తగూడెంలోని పాతబస్డిపో, శ్మశాన వాటిక ప్రాంతాలు, పాల్వంచలోని ఒడ్డుగూడెం, పాత గాంధీనగర్, హైస్కూల్రోడ్, బొల్లోరిగూడెం, వర్తకసంఘ భవనం తదితర ప్రాం తాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్తుపల్లిలో డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో చెత్తను తొలగించారు. ఇల్లెందులో ప్రభుత్వ, ప్రైవేట్, సింగరేణి సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమా న్ని నిర్వహించారు. భద్రాచలం, పాలేరు, మధిర, అశ్వారావుపేట తదితర నియోజకవర్గాల్లో ‘స్వచ్ఛభారత్’ విజయవంతంగా కొనసాగింది. -
జిల్లాలో రూ.427 కోట్ల రుణమాఫీ
ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లా రైతులకు పంట రుణమాఫీ కోసం రూ. 427 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీని వివిధ నోడల్ బ్యాంకుల ద్వారా సంబంధిత బ్యాంకులకు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు, బ్యాంక్మేనేజర్లతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రుణమాఫీ పంపిణీపై కలెక్టర్ బ్యాంకర్లు, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రెవిన్యూ అధికారులు, బ్యాంకు అధికారులు సంయుక్తంగా ఆమోదించిన ఎనెగ్జర్-ఈ తుది జాబితా ప్రకారమే రుణమాఫీ అందించాలని ఆదేశించారు. పట్టాదారుపాస్ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఒక్కో బ్యాంకుకు ముగ్గురు వీఆర్వోలు, ఒక ఆర్ఐ లేదా డిప్యూటీ తహశీల్దార్ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాలన్నారు. మండల ప్రత్యేకాధికారి తహశీల్దార్ వ్యవహరిస్తారన్నారు. ప్రతినియోజకవర్గానికో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు ప్రత్యేక బృందాలను అధికారులుగా నియమించామన్నారు. అర్హులైన రైతులకు ఏమాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదన్నారు. ఆధార్‌నంబర్‌ను నమోదు చేసి ఆన్లైన్ ద్వారా రుణమాఫీ నివేదిక పంపాలని ఆదేశించారు. రైతుల ఖాతా నంబర్లు, భూ సర్వేనంబర్, భూమి విస్తీర్ణం, రైతుల నివాస స్థితి, పట్టాదారు పాస్‌పుస్తకం వివరాలు ప్రత్యేక టీమ్‌లు, బ్యాంకు అధికారులు సంయుక్తంగా పరిశీలించిన తర్వాతే రుణమాఫీ ఇవ్వాలని ఆదేశించారు. రుణమాఫీకి ఆధార్ నంబర్ తప్పనిసరి అన్నారు. రుణమాఫీ విషయంలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గొద్దని సూచించారు. ఈ సమావేశంలో జేసీ సురేంద్రమోహన్, జేడీఏ భాస్కరరావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వండి.. ఆధార్ నంబర్ అనుసంధానం చేస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని కలెక్టర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీఆర్వోలు, బ్యాంకులకు రైతులు తమ ఆధార్ నంబర్లను రెండురోజుల్లో అందజేయాలని సూచించారు. లేనిపక్షంలో రుణమాఫీ వర్తించదని తెలిపారు. -
రెవెన్యూ ‘ప్రక్షాళన’
ఖమ్మం జెడ్పీసెంటర్: గ్రామ, మండలస్థాయిలో రెవెన్యూశాఖను ప్రక్షాళించనున్నారు. ఈ శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న యంత్రాంగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీఆర్వో నుంచి తహశీల్దార్ వరకు త్వరలో బదిలీలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ బదిలీల్లో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వివిధ అంశాల ఆధారంగా ఉన్నతాధికారులు ఇప్పటికే జాబితా తయారు చేసినట్లు సమాచారం. కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి నిర్ణయం వెలువడిందే తరువాయి వెంటనే బదిలీలుండే అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వారంలోపే బదిలీలుండవచ్చని సమాచారం. బదిలీల్లో ప్రామాణికంగా తీసుకున్న అంశాలు ఇవేనని తెలుస్తోంది. - ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్నవారు. - రాజకీయ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నవారు. - ప్రభుత్వ భూముల కబ్జాను ప్రోత్సహిస్తున్నవారు. - కాసుల కక్కుర్తితో పాస్‌పుస్తకాలు మారుస్తున్నవారు. - కార్యాలయాలకు తరచూ డుమ్మా కొడుతున్నవారు. - ప్రజలకు అందుబాటులో ఉండని వారికి బదిలీ తప్పదని అంటున్నారు. వీఆర్వో మొదలుకొని తహశీల్దార్ వరకు బదిలీలు ఉండవచ్చని సమాచారం. గ్రామ, మండలస్థాయిలో రెవెన్యూ పాలన సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతోనే కలెక్టర్ ఈ చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి బాధ్యతలు స్వీకరించి నెలరోజులకుపైగా అవుతుండటంతో ఆయన రెవెన్యూశాఖ పనితీరుపై దృష్టి సారించారని అంటున్నారు. కొందరు వీఆర్వోలు, తహశీల్దార్ల ఆగడాలు పెరిగాయని ఫిర్యాదులు రావడంతోనే కలెక్టర్ ఈ చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. గాడి తప్పిన ‘రెవెన్యూ’ పాలన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకావాలంటే రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా పనిచేయాలి. కానీ ఇటీవల రెవెన్యూశాఖకు పాలనపై పట్టు సడలినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. చేతివాటం ఎక్కువైనట్లు ఆరోపణలున్నాయి. ఏళ్లతరబడి గ్రామాల్లో పనిచేస్తున్న కొందరు వీఆర్వోలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ అవసరాల నిమిత్తం మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. కార్యాలయాల్లో ఫైళ్లు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయాయి. వీటినే బదిలీలకు కారణాలుగా చెబుతున్నారు. ఆరోపణలు వినిపిస్తున్న మండలాలు ఇవే.. ఆరోపణలు వినిపిస్తున్న మండలాల్లో అభియోగాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో రెండు నుంచి ఆరేళ్లుగా ఒకే మండలంలో 26 మంది డిప్యూటీ తహశీల్దార్లు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 701 మంది వీఆర్వోలు ఉండగా వారిలో 345 మంది ఒకే చోట రెండేళ్ళకు పైగా పనిచేస్తున్నారు. మధిర, ఖమ్మం రూరల్ తహశీల్దార్లుగా పనిచేస్తున్న వారు సొంతమండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. బోనకల్లు మండలంలో ఓ అధికారి పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. తల్లాడ మండలంలో పనిచేస్తున్న ఓ అధికారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం విషయంలో నిర్లక్ష్యం వహిం చారని సమాచారం. పెనుబల్లి మండలంలో పనిచేస్తున్న అధికారిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వేంసూరు మండలంలో పనిచేస్తున్న ఓ అధికారి విధులకు హాజరవుతున్నా పాలన విషయంలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అక్రమార్జనే ధ్యేయంగా.. రెవెన్యూ అధికారులు కొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతల పలుకుబడితో ఆయా గ్రామాల్లో తిష్టవేసి ఏళ్ళ తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. పైసలు లేనిదే పని చేయడం లేదని, ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులకు దారాదత్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జాబితా సిద్ధం.. రెవెన్యూశాఖలో ఏళ్ళతరబడి ఒకే చోట పని చేస్తున్న వారి జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీఆర్వో మొదలు తహశీల్దార్ వరకు రెండేళ్ళకు మించి పని చేస్తున్న వారి వివరాలతో నివేదికలు తయారు చేసి రెండు రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. సొంత గ్రామం, మండలంతో పాటు ఏళ్ళ తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. అధిక శాతం వీఆర్వోలు ఒకే చోట పని చేస్తూ రైతులు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. పైరవీలకు చెక్.... జిల్లాలో ఏ మండలంలోనైనా వీఆర్వో నుంచి తహశీల్ధార్, ఎంపీడీవో, ఇతర అధికారులు పని చేయాలంటే రాజకీయ నేతల ఆశీస్సులు ఉండాల్సిందే. కానీ నూతన కలెక్టర్ ఇలంబరితి మాత్రం బదిలీల్లో రాజకీయ పైరవీలకు చెక్ పెట్టేందుకు వ్యూహం రచించారు. రాజకీయ నేతల పలుకుబడితో ఆయా మండలాల్లో పోస్టింగ్‌లు పొంది.. వారికి చెప్పుచేతల్లో ఉంటున్న అధికారులపై దృష్టి సారించారు. బదిలీ చేసిన అధికారులు తమకు కేటాయించిన స్థానాల్లో చేరకుండా రాజకీయ నేతలను ఆశ్రయించి ఒత్తిడి చేసినా, విధుల్లో చేరకుండా లీవ్‌లో వెళ్ళినా వారి చిట్టా తీసి, చట్టపరంగా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
కలెక్టరేటా.. చెత్తకుండీనా..?
* సీమాంధ్ర ఉద్యోగుల జాబితా ఏది..? * మయపాలన పాటించాలిపరిష్కృతి ఫిర్యాదులు * రిపీట్ కావొద్దు అధికారులకు అక్షింతలు వేసిన కొత్త కలెక్టర్ * బాధ్యతల స్వీకరణ రోజునే ఇలంబరితి మార్కు ఖమ్మం జెడ్పీసెంటర్: ఇది జిల్లా పరిపాలన కార్యాలయమా..! చెత్త కుండీనా..! .ఏమిటి ఈ చెత్త..! ఈ వాహనాల పార్కింగ్ ఏంటి .. ? సీమాంధ్ర ఉద్యోగుల జాబితా ఏది..? ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పరిష్కృతి ఫిర్యాదుల నమోదు ఉందా...! హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రస్థాయి అధికారులు ఈ విభాగంపై దృష్టి సారిస్తారు....ఈ విషయం తెలుసా.. ? అని ప్రశ్నల వర్షం కురిపించారు జిల్లా కలెక్టర్ ఇలంబరితి. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె.ఇలంబరితి తొలిరోజే అధికారులకు అక్షింతలు వేశారు. శుక్రవారం ఉదయం 5.36గంటలకు బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరిగి బయటకు వెళ్తూ డీఆర్వో శివశ్రీనివాస్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. జిల్లా అధికారులు సమయ పాలన పాటించాలని ...కలెక్టరేట్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ..తీరు మార్చుకోవాలని అగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటిస్తే అన్ని పనులు సత్వరం జరుగుతాయని హితబోధ చేశారు. ముందు మీరు సమయ పాలన పాటించాలని డీఆర్వోకు చెప్పారు. జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల జాబితాను తాను హైదరాబాద్ వెళ్లే వరకు తెలపాలన్నారు. పరిష్కృతిలో ఫిర్యాదుల నమోదు సక్రమంగా జరగాలన్నారు. రెండు రోజుల్లో ఫిర్యాదుదారులకు సమాధానం తెలియాలన్నారు. గ్రీవెన్స్ ఫిర్యాదులను హైదరాబాద్ స్థాయిలో పరిశీలిస్తారని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ ఆదర్శవంతంగా నిలవాలని చెప్పారు. వాహనాల పార్కింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు. కలెక్టర్ వస్తారని తెలిసినా.... జిల్లా కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించాల్సిన డీఆర్వోనే జిల్లా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆలస్యంగా రావడం చర్చనీయాంశమయింది. కలెక్టర్ కార్యాలయానికి వీఐపీలు వచ్చినప్పుడు తన సిబ్బందితో కలిసి కలెక్టరేట్ పోర్టికో వరకు వెళ్లి వీఐపీలకు పుష్పగుచ్ఛం అందజేసి వారిని గౌరవప్రదంగా కలెక్టరేట్‌లోకి తీసుకొస్తారు డీఆర్వో. కాగా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఇలంబరితికి అలాంటి ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఉదయం 5 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చి బాధ్యతలు స్వీకరిస్తానని కలెక్టర్ ప్రకటించినా జిల్లా రెవెన్యూ అధికారి సమయానికి కలెక్టరేట్‌కు రాలేదు. కలెక్టర్ చాంబర్లోకి వచ్చిన 30 నిమిషాలకు డీఆర్వో రావడం, కనీసం స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛం ఇవ్వకపోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. -
అవినీతిపైఉక్కుపాదం
ఖమ్మం జెడ్పీసెంటర్: అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతానని కలెక్టర్ కె.ఇలంబరితి అన్నారు. జిల్లా 44వ కలెక్టర్‌గా శుక్రవారం ఉదయం 5.36 నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి బయలుదేరి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి తరువాత గత కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ వచ్చి సీటీసీ ఫైలుపై సంతకం చేసి నూతన కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీటీసీపై సంతకం చేసిన ఇలంబరితి కలెక్టర్ కుర్చీలో ఆసీనులయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారద ర్శక పాలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. జిల్లాలో అన్ని శాఖలలో పాలన సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తానని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటానని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. రైతు సమస్యలపై తక్షణమే స్పందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తగు ప్రాధాన్యత ఇస్తానన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ జ యప్రకాష్ నారాయణ, కలెక్టరేట్ ఏవో చూడామణి, డీటీలు బొగ్గారపు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు ఆశోక్, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వరప్రసాద్, డివిజనల్ పీఆర్వో దశరథం తదితరులు పాల్గొన్నారు. మీ ఆశీస్సులుండాలి : శ్రీనరేశ్తో ఇలంబరితి బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాత, కొత్త కలెక్టర్లిద్దరూ సరదాగా సంభాషించుకున్నారు. సీటీసీ ఫైలుపై కొత్త కలెక్టర్ పెట్టిన సంతకం చూసిన పాత కలెక్టర్ తన సంతకం కన్నా పెద్దగా ఉందని ఇలంబరితినుద్దేశించి అన్నారు. దీనికి సరదాగా స్పందించిన ఇలంబరితి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని శ్రీనరేశ్‌ను కోరారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. -
జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కొత్త కలెక్టర్‌గా డాక్టర్. కె.ఇలంబరితి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస శ్రీనరేశ్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఇలంబరితిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యువ ఐఏఎస్ అధికారి అయిన ఇలంబరితి జిల్లా 44వ కలెక్టర్‌గా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కలెక్టర్ శ్రీనరేశ్‌ను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. 2005 బ్యాచ్ అధికారి యువ ఐఏఎస్ అధికారి అయిన ఇలంబరితి తమిళనాడుకు చెందిన వారు. ఆయన 2005లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. చెన్నై యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సెన్సైస్ కోర్సు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయిన ఈయన 2005 ఆగస్టులో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సీఈవోగా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జోనల్ కమిషనర్‌గా, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ అనే అంశంపై శిక్షణ కూడా తీసుకున్నారు. శ్రీనరేశ్‌కు వీడ్కోలు గత ఏడాది జూన్ 24న బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ త్వరలోనే వీడ్కోలు తీసుకోనున్నారు. ఒక ఏడాది 36 రోజుల పాటు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఈయన హయాంలోనే జిల్లాలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఈయన ప్రశంసనీయ పాత్ర పోషించారు. సమస్యలపై స్పందించడంలో మంచి పేరే తెచ్చుకున్న శ్రీనరేశ్.. కారణాలేవైనా జిల్లాపై తన ముద్రను మాత్రం వేయలేకపోయారనే చెప్పుకోవాలి.