ఖమ్మం జెడ్పీసెంటర్: గ్రామ, మండలస్థాయిలో రెవెన్యూశాఖను ప్రక్షాళించనున్నారు. ఈ శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న యంత్రాంగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీఆర్వో నుంచి తహశీల్దార్ వరకు త్వరలో బదిలీలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ బదిలీల్లో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వివిధ అంశాల ఆధారంగా ఉన్నతాధికారులు ఇప్పటికే జాబితా తయారు చేసినట్లు సమాచారం.
కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి నిర్ణయం వెలువడిందే తరువాయి వెంటనే బదిలీలుండే అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వారంలోపే బదిలీలుండవచ్చని సమాచారం.
బదిలీల్లో ప్రామాణికంగా తీసుకున్న అంశాలు ఇవేనని తెలుస్తోంది. - ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్నవారు. - రాజకీయ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నవారు. - ప్రభుత్వ భూముల కబ్జాను ప్రోత్సహిస్తున్నవారు. - కాసుల కక్కుర్తితో పాస్‌పుస్తకాలు మారుస్తున్నవారు. - కార్యాలయాలకు తరచూ డుమ్మా కొడుతున్నవారు. - ప్రజలకు అందుబాటులో ఉండని వారికి బదిలీ తప్పదని అంటున్నారు.
వీఆర్వో మొదలుకొని తహశీల్దార్ వరకు బదిలీలు ఉండవచ్చని సమాచారం. గ్రామ, మండలస్థాయిలో రెవెన్యూ పాలన సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతోనే కలెక్టర్ ఈ చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌గా ఇలంబరితి బాధ్యతలు స్వీకరించి నెలరోజులకుపైగా అవుతుండటంతో ఆయన రెవెన్యూశాఖ పనితీరుపై దృష్టి సారించారని అంటున్నారు. కొందరు వీఆర్వోలు, తహశీల్దార్ల ఆగడాలు పెరిగాయని ఫిర్యాదులు రావడంతోనే కలెక్టర్ ఈ చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.
గాడి తప్పిన ‘రెవెన్యూ’ పాలన
ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకావాలంటే రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా పనిచేయాలి. కానీ ఇటీవల రెవెన్యూశాఖకు పాలనపై పట్టు సడలినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. చేతివాటం ఎక్కువైనట్లు ఆరోపణలున్నాయి. ఏళ్లతరబడి గ్రామాల్లో పనిచేస్తున్న కొందరు వీఆర్వోలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివిధ అవసరాల నిమిత్తం మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. కార్యాలయాల్లో ఫైళ్లు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయాయి. వీటినే బదిలీలకు కారణాలుగా చెబుతున్నారు.
ఆరోపణలు వినిపిస్తున్న మండలాలు ఇవే..
ఆరోపణలు వినిపిస్తున్న మండలాల్లో అభియోగాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో రెండు నుంచి ఆరేళ్లుగా ఒకే మండలంలో 26 మంది డిప్యూటీ తహశీల్దార్లు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 701 మంది వీఆర్వోలు ఉండగా వారిలో 345 మంది ఒకే చోట రెండేళ్ళకు పైగా పనిచేస్తున్నారు. మధిర, ఖమ్మం రూరల్ తహశీల్దార్లుగా పనిచేస్తున్న వారు సొంతమండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
వీరిపై అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. బోనకల్లు మండలంలో ఓ అధికారి పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. తల్లాడ మండలంలో పనిచేస్తున్న ఓ అధికారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం విషయంలో నిర్లక్ష్యం వహిం చారని సమాచారం. పెనుబల్లి మండలంలో పనిచేస్తున్న అధికారిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వేంసూరు మండలంలో పనిచేస్తున్న ఓ అధికారి విధులకు హాజరవుతున్నా పాలన విషయంలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.
అక్రమార్జనే ధ్యేయంగా..
రెవెన్యూ అధికారులు కొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతల పలుకుబడితో ఆయా గ్రామాల్లో తిష్టవేసి ఏళ్ళ తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. పైసలు లేనిదే పని చేయడం లేదని, ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులకు దారాదత్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జాబితా సిద్ధం..
రెవెన్యూశాఖలో ఏళ్ళతరబడి ఒకే చోట పని చేస్తున్న వారి జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీఆర్వో మొదలు తహశీల్దార్ వరకు రెండేళ్ళకు మించి పని చేస్తున్న వారి వివరాలతో నివేదికలు తయారు చేసి రెండు రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. సొంత గ్రామం, మండలంతో పాటు ఏళ్ళ తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. అధిక శాతం వీఆర్వోలు ఒకే చోట పని చేస్తూ రైతులు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
పైరవీలకు చెక్....
జిల్లాలో ఏ మండలంలోనైనా వీఆర్వో నుంచి తహశీల్ధార్, ఎంపీడీవో, ఇతర అధికారులు పని చేయాలంటే రాజకీయ నేతల ఆశీస్సులు ఉండాల్సిందే. కానీ నూతన కలెక్టర్ ఇలంబరితి మాత్రం బదిలీల్లో రాజకీయ పైరవీలకు చెక్ పెట్టేందుకు వ్యూహం రచించారు. రాజకీయ నేతల పలుకుబడితో ఆయా మండలాల్లో పోస్టింగ్‌లు పొంది.. వారికి చెప్పుచేతల్లో ఉంటున్న అధికారులపై దృష్టి సారించారు. బదిలీ చేసిన అధికారులు తమకు కేటాయించిన స్థానాల్లో చేరకుండా రాజకీయ నేతలను ఆశ్రయించి ఒత్తిడి చేసినా, విధుల్లో చేరకుండా లీవ్‌లో వెళ్ళినా వారి చిట్టా తీసి, చట్టపరంగా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రెవెన్యూ ‘ప్రక్షాళన’
Published Mon, Sep 22 2014 2:00 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement