అవినీతిపైఉక్కుపాదం
ఖమ్మం జెడ్పీసెంటర్: అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతానని కలెక్టర్ కె.ఇలంబరితి అన్నారు. జిల్లా 44వ కలెక్టర్‌గా శుక్రవారం ఉదయం 5.36 నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెల్లవారుజామున 5 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి బయలుదేరి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటి తరువాత గత కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ వచ్చి సీటీసీ ఫైలుపై సంతకం చేసి నూతన కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీటీసీపై సంతకం చేసిన ఇలంబరితి కలెక్టర్ కుర్చీలో ఆసీనులయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారద ర్శక పాలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. జిల్లాలో అన్ని శాఖలలో పాలన సక్రమంగా సాగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఫైళ్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తానని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటానని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు.
రైతు సమస్యలపై తక్షణమే స్పందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తగు ప్రాధాన్యత ఇస్తానన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ జ యప్రకాష్ నారాయణ, కలెక్టరేట్ ఏవో చూడామణి, డీటీలు బొగ్గారపు వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు ఆశోక్, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వరప్రసాద్, డివిజనల్ పీఆర్వో దశరథం తదితరులు పాల్గొన్నారు.
మీ ఆశీస్సులుండాలి : శ్రీనరేశ్‌తో ఇలంబరితి
బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాత, కొత్త కలెక్టర్లిద్దరూ సరదాగా సంభాషించుకున్నారు. సీటీసీ ఫైలుపై కొత్త కలెక్టర్ పెట్టిన సంతకం చూసిన పాత కలెక్టర్ తన సంతకం కన్నా పెద్దగా ఉందని ఇలంబరితినుద్దేశించి అన్నారు. దీనికి సరదాగా స్పందించిన ఇలంబరితి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని శ్రీనరేశ్‌ను కోరారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.