భేష్ : వరుస ఎన్నికల నిర్వహణలో సక్సెస్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండు నెలలు.... ఒకటే పని... వరుసగా దూసుకొచ్చిన మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం తీరిక లేకుండా పనిచేసింది. పని ఒత్తిడిని తట్టుకుని మూడు ఎన్నికలనూ ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్, ఎస్పీ రంగనాథ్‌ల నేతృత్వంలో అటు అధికార, ఇటు పోలీసు బలగాలు ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసేందుకు శ్రమించాయి. ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడం, మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతుండడం, రాజకీయంగా చైతన్యవంతమయిన జిల్లా కావడంతో అధికార యంత్రాంగం ఎక్కడా తొందరపడకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి పనిచేసిందనే భావన వ్యక్తమవుతోంది. అక్కడక్కడా చిన్న చిన్న ఇబ్బందులు, అసౌకర్యాలున్నా మొత్తం మీద ఎన్నికల నిర్వహ ణలో జిల్లా యంత్రాంగం మంచి మార్కులే సాధించిందని చెప్పవచ్చు.
త్రిమూర్తుల పర్యవేక్షణలో...
కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అనుభవం, ఎస్పీ రంగనాథ్ చురుకుతనానికి తోడు జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ పక్కా ప్రణాళిక కలగలిపి జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా ముగిసాయి. ఎన్నికల నిర్వహణలో ఈ త్రిమూర్తులు కీలకపాత్ర
మిగతా 11వ పోషించారు. వీరితో పాటు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, టీచర్లు, అంగన్‌వాడీలు, ఇతర శాఖలకు చెందిన సిబ్బంది వరుస ఎన్నికల నిర్వహణ కోసం శ్రమించారు. ఏ ఎన్నికయినా... నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆ ఎన్నిక ముగిసేంతవరకు అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు తమ పాత్రను పోషించారు. ఉద్యోగ సంఘాల నేతలు, ముఖ్య అధికారులు కూడా ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. జిల్లాకు ఈవీఎంలు వచ్చినప్పుడు వాటిని భద్రపర్చడం నుంచి ఎన్నికల శిక్షణ, నిర్వహణ వరకు సమన్వయంతో వ్యవహరించడంలో ఉద్యోగులు సఫలమయ్యారనే భావన వ్యక్తమవుతోంది.
ఎన్నికల మీద ఎన్నికలు
గత ఏడాది జూన్‌లో పంచాయతీ ఎన్నికలు ముగియగా... 10 నెలల తర్వాత మూడు ఎన్నికలు ఒకేసారి దూసుకొచ్చాయి. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసిన కారణంగా సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఆ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ముందుగా జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన వాయిదా పడి మార్చి 30న జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఆరు రోజులకే స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఏప్రిల్ 6, 11న జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించారు. మధ్యలో శ్రీరామనవమి కారణంగా ఆవిధులలో అధికారులు బిజీగా గడిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ఘట్టం, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ అన్నీ అన్నీ చకచకా అయిపోయాయి. ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
పోలీసులకు కత్తిమీద సాము
ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసులు నిర్వహించిన పాత్ర కీలకమనే చెప్పాలి. వరుసగా జరిగిన ఎన్నికలకు బందోబస్తు నిర్వహణ అంత సులభమయ్యే పనికాదు. హోంగార్డు నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు రెండునెలలుగా అలుపు లేకుండా పనిచేస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల విజయం కోసం ప్రచారానికి వచ్చే అగ్రనేతలకు బందోబస్తు అంశం పోలీసులకు ఒకరకంగా ముచ్చెమటలు పట్టించిందనే చెప్పాలి. ఒక్క కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్రస్థాయి నేతలంతా జిల్లాలో పర్యటించారు. వారికి బందోబస్తు కల్పించడం, శాంతిభద్రతలు కాపాడడం కోసం పోలీసు యంత్రాంగం తీవ్రంగానే శ్రమించింది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో పోలింగ్ నిర్వహణ కోసం పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. ఎస్పీ రంగనాథ్ ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల పోలీసుల సహకారం తీసుకుని, ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్లడంతో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
రాజకీయ పార్టీలు, ప్రజలదీ అద్భుత పాత్ర
ఇక, జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో రాజకీయ పార్టీలు, ప్రజలు మంచి పాత్ర పోషించారు. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా ఎక్కడా ఉద్రేకాలకు లోనుకాని పరిస్థితులు కల్పించారు. ప్రజానీకం కూడా సమర్థవంతమైన బాధ్యతను నిర్వహించింది. ఎన్నికల నిబంధనల కారణంగా కొంత అసౌకర్యానికి గురయినా అధికార, పోలీసు యంత్రాంగానికి సహకరించిన జిల్లా ప్రజలు ఎన్నికల ప్రశాంతంగా ముగియడానికి దోహదపడ్డారు.మొత్తంమీద వెబ్‌కాస్టింగ్ సిబ్బందికి, కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బందికి తగిన రెమ్యునరేషన్ ఇవ్వలేదనే ఆందోళనలు, పోలింగ్‌కు వెళ్లే ఓటర్లకు అక్కడక్కడా సౌకర్యాలు లేకపోవడం లాంటి చిన్న ఘటనలు మినహా అందరి కృషి, సహకారంతో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.