‘విలీన’ ఆస్తులపై 11లోగా నివేదిక ఇవ్వాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో... సీమాంధ్రలో కలుస్తున్న గ్రామాలకు సంబంధించిన ఫైళ్లు, స్థిర, చర ఆస్తులు, మానవ వనరులు తదితర అంశాలపై ఈనెల 11లోగా నివేదిక అందజేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. సీమాంధ్రలో కలుస్తున్న మండలాలపై చర్చించేందుకు గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీమాంధ్రలో కలుస్తున్న 136 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన ఆస్తులు, కోర్టు కేసులు, వివిధ రకాల పథకాలు, కార్యక్రమాల సమాచారంపై పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలని సూచించారు.
భద్రాచలం డివిజన్‌లోని 98 రెవెన్యూ గ్రామాలు, పాల్వంచ డివిజన్‌లోని 38 రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలో కలుస్తున్నందున మిగిలిన గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ గ్రామాలను ఏ మండలంలో కలిపితే బాగుటుందో ప్రతిపాదనలు సమర్పిస్తే అట్టి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. విభజనకు సంబంధించిన గ్రామాల మ్యాప్‌ను ఖమ్మం వెబ్‌సైట్‌లో పెట్టాలని, ఆ సీడీ హర్డ్‌కాపీని అధికారులకు అందజేయాలని సర్వే అండ్‌ల్యాండ్ రికార్డు ఏడీని కలెక్టర్ ఆదేశించారు. విభజనకు సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు చాలా సున్నితమైనవని, వీటికి సంబంధించిన రికార్డులు స్కానింగ్ చేసి భద్రపరచాలన్నారు.
జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ సీమాంధ్రలో కలుస్తున్న ప్రతి గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలపై నివేదిక అందజేయాలన్నారు. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను మూడు ఫైల్స్ తయారు చేసి సంబంధిత అధికారికి, రెవెన్యూ డివిజన్‌అధికారికి, కలెక్టరేట్‌లో ఒకటి అందజేయాలన్నారు. సీమాంధ్రలో కలుస్తున్న గ్రామాల ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వనరులు అన్ని అందేలా చూడాల న్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ దివ్య, భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం, కొత్తగూడెం రెవెన్యూ డివి జనల్ అధికారులు కె.వెంకటేశ్వర్లు, ఎస్.సత్యనారాయణ, సంజీవరెడ్డి, డి.అమయ్‌కుమార్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.