కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు జిల్లా బంద్
కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తుతున్న ఉద్యమకారులు
రగిలి పోతున్న సమైక్య వాదులు
ప్రజల ఆకాంక్షలకు లోక్‌సభలో సమాధి కట్టారు...నిద్రాహారాలు, చదువులు,ఉద్యోగాలు, ఉపాధి వదులుకొని సమైక్య రాష్ట్రమే ధ్యేయంగా సాగించిన పోరాటానికి వెన్నుపోటు పొడిచారు. విజయనగరంలో రగిలిన సమైక్యజ్వాలలు రాష్ట్రమంతటా వ్యాపించాయి. ఇక విభజన జరగదని భావించిన జిల్లా వాసులు మంగళవారం పార్లమెంట్‌లో జరిగిన నాటకాన్ని చూసి నివ్వెరపోయారు. కోట్లాది మంది మనోభావాలను లెక్కచేయని కాంగ్రెస్ తలతిక్క వ్యవహారాన్ని భరించలేకపోయారు. జిల్లా ప్రజాప్రతినిధుల చేతగాని తనాన్ని ఛీకొట్టారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఆక్రోశంతో రగిలిపోయారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. దిష్టిబొమ్మలను దహనం చేసి, విభజన రాక్షసులపై విరుచుకుపడ్డారు. బుధవారం జిల్లా బంద్ పాటించనున్నారు.
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లాలో పలుచోట్ల ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. సమైక్యవాదులు ఆందోళనలు నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం 200 రోజులకు పైగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే కనీసం పట్టించుకోకుండా యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించడం దుర్మార్గమని సమైక్య వాదులు మండిపడ్డారు. రోడ్లమీదకు వచ్చి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లోపించడం వల్లే విభజన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎంతో పాటూ కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి తొత్తులుగా ఉంటూ పరోక్షంగా విభజనకు సహకరించారని మండిపడ్డారు. ప్రజల ఓట్లతో పదవులు అనుభవిస్తున్న సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు అధిష్టానం అంటూ ప్రజలను అవమానపరిచారని వాపోయారు.
వీరికి రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధులు కడతామని స్పష్టం చేశారు. ప్రజల పట్ల గౌరం ఉంటే ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. సాలూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఐలాండ్ సమీపంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరజాపు ఈశ్వరరావు, గొర్లె మధు, గిరి రఘుల ఆధ్వర్యంలో నిరసన, రాస్తారోకోలతో పాటూ సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ కౌన్సిలర్ కొల్లి వెంకటరమణ సోనియాగాంధీలా చీర కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణంలో వైఎస్‌ఆర్ సీపీ పట్టణ కన్వీనర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీఏ చైర్‌పర్సన్, సోనియాగాంధీ, కిశోర్ చంద్రదేవ్, బొత్స సత్యనారాయణల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా 20 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది.
మహాసభ ఆధ్వర్యంలో...
రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ జంక్షన్‌తోపాటు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ జంక్షన్ వద్ద మహాసభ ప్రతినిధులంతా కళ్లకు, నోటికి, చెవులకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సోనియా గాంధీ, గ్రూప్ ఆఫ్ మంత్రుల దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేసిన అనంతరం దహనం చేశారు.
పలువురు సమైక్యవాదులు సోనియా గాంధీని విభజన రాక్షసిగా అభివర్ణిస్తూ, చిత్రపటాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిందని మండిపడ్డారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాన్ని కేవలం కొందరి స్వార్థ రాజకీయాల కోసం రెండు ముక్కలు చేయడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ త్వరలో తగిన ప్రతిఫలం అనుభవిస్తుందన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో..
రాష్ట్రవిభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందటాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలోని మయూరి జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ సీఎంతో పాటూ కాంగ్రెస్ నాయకులు తెలుగుజాతిని మోసం చేశారని మండిపడ్డారు.
సోనియాగాంధీ,కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఐవీపీ రాజు, కర్రోతు వెంకటనర్సింగరావు, ఎస్‌ఎన్‌ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించటాన్ని నిరసిస్తూ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటూ పలు పక్షాలు జిల్లాబంద్‌కు పిలుపునిచ్చాయి. తెలుగుదేశం పార్టీ, విశాలాంధ్ర మహాసభలు సైతం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి.
పోలీసు బలగాల మోహరింపు....
విభజన బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం తెలపడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఇప్పటికే సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా జరిగిన నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధానంగా మంత్రి బొత్స నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, గంట స్తంభం ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెల్లుబికిన విభజనాగ్రహం
Published Wed, Feb 19 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement