విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరసన
ఊరూవాడా ఆగ్రహజ్వాల సోనియా, అద్వానీ, షిండే,
సుష్మ తదితరుల దిష్టిబొమ్మల దహనం
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
అడుగడుగునా రాస్తారోకోలో.. స్తంభించిన ట్రాఫిక్
పార్టీ కార్యాలయాలు, కూడళ్లలో పోలీసుల భారీ బందోబస్తు
సాక్షి నెట్‌వర్క్: రాష్ర్ట విభజన బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ మంగళవారం సీమాంధ్రలో నిరసనలు మిన్నంటాయి. జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీగా వచ్చి అనంతపురం-చెన్నై రహదారిపై ఆందోళన చేపట్టారు. సమైక్యవాదులు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతపురంలోని బీజేపీ కార్యాలయం పై దాడికి యత్నించారు.
కడపలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పులివెందులలో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు.
కర్నూలులో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రాజ్‌విహార్ కూడలి వద్ద సోనియా, అద్వానీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నంద్యాల-శ్రీశైలం రహదారిలో గౌరు చరితారెడ్డి నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పోలీసులు ముందుజాగ్రత్తగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తిరుపతిలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలమనేరు, పుత్తూరు, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో జాతీయరహదారులు దిగ్బంధించారు.
కృష్ణా జిల్లా విజయవాడలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రాఘవయ్యపార్కు వద్ద సోనియా, షిండే దిష్టిబొమ్మలను దహనం చేశారు. బెంజిసర్కిల్ వద్ద టైర్లు తగలబెట్టి నిరసన తెలుపగా, ఇబ్రహీంపట్నంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సోనియాకు పట్టిన విభజన పిచ్చి వదలాలంటూ వేపమండలతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. గుడివాడలో విభజనకు కారకులంటూ కేంద్రప్రభుత్వం, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాలను రాక్షస వేషంలో చిత్రీకరించి చెత్తకుప్ప వద్ద పెట్టారు.
ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. జిల్లా కోర్టు ముందు రిలే దీక్షలు చేస్తున్న న్యాయవాదులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఒంగోలు సీవీఎన్ రీడింగ్ రూమ్ సెంటర్‌లో నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
గుంటూరు శంకర్ విలాస్ సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బైఠాయించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కొవ్వెత్తులతో ప్రదర్శన చేశారు.
వైఎస్సార్‌సీపీ నగర విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో రోడ్డుపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ రాస్తారోకో చేపట్టగా,టీడీపీ కార్యకర్తలు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆత్మకూరులో టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. కోరుకొండలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీజేపీ దిమ్మెను ధ్వంసం చేసి, రాహుల్ ఫ్లెక్సీలను నిప్పు పెట్టారు. రాజమండ్రి, మామిడికుదురులో సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు.
విశాఖలో జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రాష్ట్ర విభజనపై మనస్తాపానికి గురైన ఒక న్యాయవాది ఆ మంటల్లో దూకి ఆత్మహత్యకు యత్నించగా అక్కడున్నవారు అడ్డుకున్నారు. జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న నరేంద్ర మోడీ హోర్డింగ్‌ను చింపివేసి తగలబెట్టారు. అనకాపల్లిలో మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్‌లను దహనం చేశారు. అనకాపల్లిలో నెహ్రౌచౌక ధర్నా చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సమైక్యవాదులు బీజేపీ ఫ్లెక్సీలను తొలగించి ప్రకాశం చౌక్‌లో తగులబెట్టారు. అదే సెంటర్‌లో ఉన్న నమో టీస్టాల్‌ను ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మద్దాల రాజేష్ చింతలపూడిలో రాస్తారోకో చేసి తెలుగుతల్లి చిత్రపటానికి రక్తతిలకం దిద్ది నిరసన తెలిపారు.
విజయనగరం జిల్లా సాలూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఐలాండ్ సమీపంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాస్తారోకో చేపట్టి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.
శ్రీకాకుళం వైఎస్సార్ కూడలి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.పొట్టిశ్రీరాములు కూడలి వద్ద సమైక్యవాదులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. రాజాం, పలాస, పాలకొండలలో వైఎస్సార్ సీపీ శ్రేణులు సోనియా, యూపీఏ దిష్టిబొమ్మలను దహనం చేశారు.