విభజనతోనే..వికాసం | Evolution Partitioning with .. | Sakshi
Sakshi News home page

విభజనతోనే..వికాసం

Published Wed, Aug 14 2013 2:29 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Evolution Partitioning with ..

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతోనే వికాసమని, అందుకు సీమాంధ్రులు సహకరించాలని తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. తెలంగాణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ  మంగళవారం భోజన విరామ సమయంలో సంగారెడ్డిలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిందన్నారు. వెయ్యికి పైగా విద్యార్థుల ఆత్మబలిదానాలు, ఉద్యోగుల సకలజనుల సమ్మె. రాస్తారోకో, రైల్‌రోకోలతో ప్రభుత్వంపై వత్తిడి పెంచడంలో సఫలీకృతం అయ్యామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు అతిక్రమించి ఈ ప్రాంత  వనరులు, ఉద్యోగాలను సీమాంధ్ర పాలకులు కొల్లగొట్టారన్నారు. విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఇరు ప్రాంతాల అభివృద్ధికి చేయూతను అందిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి పిలుపు మేరకు ఈ నెల 17 వరకు ఉద్యోగుల శాంతి, సద్భావన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో శాంతియుతంగా సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్న టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, అక్రమ అరె స్టులను ఆయన ఖండించారు.
 
 14 రోజులుగా సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయం కేంద్రం గా ఆందోళన చేస్తున్నా అరెస్టు చేయలేని పాలకులు పక్షపాత వైఖరితో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘ నాయకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మెను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.   ఇదిలా ఉండగా కార్యాలయాలకు హాజరైన ఉద్యోగులు జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రహదారిపై చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో టీఎన్‌జీఓఎస్ నాయకులు శ్యాంరావు, రాఘవేందర్‌రావు, నర్సింలు, సుశీల్‌బాబు, రవి, శ్రీనివాస్, సిద్దిరాం, యాదమ్మ, మనోహర, పి. మంజులత, పోచయ్య, వీరయ్య, ఆంజనేయులు, జయరాం, జనార్ధన్, నాగరాజ్, లక్ష్మయ్య, రాములు, వివిధ శాఖల ఉద్యొగులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement