వైద్యుల విభజన సంక్లిష్టం | Complicated by medical division | Sakshi
Sakshi News home page

వైద్యుల విభజన సంక్లిష్టం

Published Wed, May 21 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

Complicated by medical division

హైదరాబాద్‌లో 2 వేల మందికిపైగా సీమాంధ్ర వైద్యులు  ఒక్కసారిగా వెళితే వైద్య సేవలకు విఘాతం
 
వాళ్లంతా వెళ్లాల్సిందేనంటున్న  తెలంగాణ ప్రభుత్వ వైద్యులు
తమకు ఆప్షన్లు ఇవ్వాలని కోరుతున్న సీమాంధ్ర ప్రాంత వైద్యులు

 
హైదరాబాద్:  రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల విభజన సంక్లిష్టతకు దారి తీస్తోంది. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో సింహభాగం సీమాంధ్రకు చెందిన వైద్యులు ఉండటమే దీనికి కారణం. నగరంలో వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీమాంధ్ర వైద్యుల సంఖ్య రెండు వేలకు పైనే ఉంటుందని అంచనా. ఒక్క ఉస్మానియా ఆస్పత్రి, వైద్య కళాశాలలోనే నాలుగు వందల మంది పైగా స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలోనూ వారు నాలుగు వందల మందిపైనే ఉన్నట్టు అంచనా. అంతేకాదు ఆరోగ్య సంచాలకుల పరిధిలో ఉన్న 80 ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో 50 శాతం మంది వైద్యులు సీమాంధ్రకు చెందిన వారే. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, మెటర్నిటీ ఆస్పత్రులు ఇలా అన్ని ఆస్పత్రుల్లోనూ మెజారిటీ వైద్యులు సీమాంధ్రకు చెందిన వారే ఉన్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి.

 అయితే రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు వైద్యుల కొరత ఉంది. పైగా హైదరాబాద్‌లో కోటి మందికి పైగా జనాభా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా 2,000 మందికి పైగా వైద్యులు నగరాన్ని వదిలి వెళితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కానీ.. ఇక్కడి సీమాంధ్ర వైద్యులు విధిగా తమ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని, ఎంతో మంది వైద్య డిగ్రీలు పొంది నిరుద్యోగులుగా ఉన్నారని, వాళ్లలో చాలా మందికి అవకాశం లభిస్తుందని, సీనియర్ వైద్యులందరికీ పదోన్నతులు లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అంటోంది. పైగా ఎన్నో ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోనే పనిచేస్తూ, ప్రైవేటు క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని స్థిరపడిన చాలా మంది సీమాంధ్ర వైద్యులు రాష్ట్ర విభజన తర్వాత అక్కడికి వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. రెండేళ్ల లోపు సర్వీసు ఉన్న చాలామంది సీమాంధ్రకు చెందిన వైద్యులు తమకు ఆప్షన్లు ఇవ్వాలని, ఒక వేళ నిజంగా సీమాంధ్రకు వెళ్లాల్సి వస్తే రాజీనామా చేసేందుకు వెనుకాడమని స్పష్టం చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement